ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరపాల్సిందే

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆమోదం..
 

అసెంబ్లీ : అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తుకు బుధవారం శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత సభలో చదివి వినిపించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ..  4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందో అన్ని రకాల ఆధారాలతో సభలో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్‌ కూడా విచారణ జరిపించమని ఆదేశించారని చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కంచె చేను మేసే విధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. కావాల్సిన వాళ్లకు చంద్రబాబు భూములు దోచిపెట్టారని తెలిపారు. రాజధాని ప్రకటన గురించి ముందే తెలుసుకుని.. అక్కడ తక్కువ ధరలకు భూములకు కొనుగోలు చేసి.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడా కనపడదని చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. 

ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం నూజివీడు అని కొందరు.. మరో ప్రాంతమని మరికొందరు లీకులు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఒక సీఎంకు కొట్టే బుద్ధి ఉంటే.. మరొక సీఎంకు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విచారణ జరిపాలని కోరారు. 

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక లీకు వీరుడు అని విమర్శించారు. సొంత మనుషులకు మేలు చేసేలా నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. అనంతరం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 
 

Back to Top