ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ భేష్

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ స‌భ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. ఆహార భద్రతా చట్టం అమలులో ఉత్తమ పనితీరుతో ఒడిశా, ఉత్తర ప్రదేశ్ ప్రథ‌మ, ద్వితీయ స్థానాలు ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు, పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించడం జరిగినట్లు ఆమె చెప్పారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార భద్రతా చట్టం అమలు, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్) కార్యకలాపాల ఆధారంగా ఆయా రాష్ట్రాల ర్యాంకులను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర‌మంత్రి తెలిపారు. ర్యాంకుల నిర్ధారణ కోసం ప్రధానంగా మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. తొలి అంశం కింద ఆహార భద్రతా చట్టం కింద అసలైన లబ్దిదారుల గుర్తింపు, వారికి ఆహారం పంపిణీ జరిగే తీరు. రెండో అంశం కింద ఆహార ధాన్యాల రవాణా, వాటిని పంపిణీ కోసం రేషన్‌ దుకాణాల కోసం చేర వేసే పటిష్టమైన వ్యవస్థ, మూడోది పోషకాహారం పంపిణీ కోసం పౌరసరఫరాల శాఖ చేపట్టే కార్యక్రమాలు. ఈ మూడు అంశాల ఆధారంగానే రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించడం జరుగుతుందని కేంద్ర‌మంత్రి చెప్పారు. అత్యుత్తమ ర్యాంకుల సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.
 

Back to Top