పశుగణాభివృద్ధి, పాడి, మ‌త్స్య పరిశ్రమ

 

పాడిపరిశ్రమ అనగానే 'మిల్మన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్యవాక్యాలు గుర్తుకు వస్తాయి.

"అమూల్ అంటే ఏమిటి. ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు. మన గ్రామీణ వ్యవస్థలోని సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇది వేగంగా మార్పు అందించేఒక సాధనం. మన రైతులు వారి స్వంత అభివృద్ధిలో పాలుపంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది. త్రిభువన్ దాస్ గారి తోనూ మరియు కైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనే ఈ విషయం తెలుసుకున్నాను. నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెలు మొదలగు వాటి అభివృద్ధి కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి, అభివృద్ధి సాధనాలను వారి అందుబాటులో ఉంచలేనంత వరకు, అటువంటి అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు, నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించ బడలేనంత వరకు మహిళల మరియు పురుషులు అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల మంచి ప్రభుత్వం అందించ గలిగే మంచి పాలన ఏమిటి? ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని, దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలను అన్వేషించాలి".

1946 లో కేవలం రెండు డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్, ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా 1 లక్ష 86 వేల పాల సహకార సంఘాలలో 1 కోటి, 66 లక్షల పాల ఉత్పత్తిదారులు ఉన్నారు.

డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా, పాల సహకార సంస్థల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమూల్ ప్రాజెక్టు'ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని పాల ఉత్పత్తిదారులు సామాజిక-ఆర్థిక అభివృద్ధే కాకుండా, రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం, పాల ఉత్పత్తిదారులకు తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం, వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులను లభించేటట్టు చేయడం మొదలగునవి. ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంతేగాక 27 లక్షల మంది మహిళా రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు 2 కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. 9,899 మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకొనడం మరియు తగిన ధరతోపాటు ఆర్థిక అభివృద్ధిని అందుకొనడమే లక్ష్యంగా, వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (AM CU) మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (BMCU) లను కలిగి యున్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విప్లవం ఇప్పటికే 700 గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు, రైతులు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

జగనన్న జీవక్రాంతి
21. రాష్ట్రవ్యాప్తంగా 2,19,151 గొర్రెల/మేకల యూనిట్ల పంపిణీ కోసం రూ.1,869 కోట్లతో జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క లబ్దిదారులకు వై.యస్.ఆర్. చేయూత క్రింద పశువుల సేకరణ, రవాణా మరియు బీమా ప్రీమియం కోసమై 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడుతున్నది.

పశువుల రంగం నిరంతరమైన మరియు ఆటంకంలేని ఆదాయాన్ని సృష్టిస్తుంది. మరియు వ్యవసాయ సంబంధిత పేద వర్గానికి జీవనోపాధిని అందిస్తుంది కూడా. వై.యస్.ఆర్. పశువుల నష్టపరిహార పథకం ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం మేలురకం స్వదేశీ జాతి పశువు ఒకదానికి రూ. 30,000లు చొప్పున, సాధారణ జాతి గేదెలు మొదలైన పశుసంపదకు ఒకడానికి రూ.15,000 లు చొప్పున మరియు ఒక్కొక్క గొర్రె లేదా మేకకు రూ. 6,000లు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించబడుతుంది. పశువుల నష్ట పరిహార నిధి కోసమై 2021-22 సంవత్సరానికి 50 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

మత్స్య రంగం
దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. భారత దేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 29.4% గా ఉంది. దేశంలోని మొత్తం రొయ్యల సా గులో మన రాష్ట్రం 5.12 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 68.5% గా ఉంది. 2019-20లో దేశం నుండి 46,663 కోట్ల రూపాయల విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగగా అందులో రాష్ట్ర 18,846 కోట్ల రూపాయలు (10.4%) గా వున్నది. మత్స్య రంగం 26.50 లక్షల జనాభాకు జీవనోపాధి కల్పిస్తున్నది.

మత్స్యకారుల సంక్షేమం కోసం వై.యస్.ఆర్. 'మత్స్యకార భరోసా పథకాన్ని' ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం జూన్ 2019 నుండి, చేపల వేట నిషేధ కాలంలో 1,19,875 లబ్దిదారులకు రూ. 332 కోట్లు, 19,796 మంది లబ్దిదారులకు డీజిల్ ఆయిల్పై రూ. 48.17 కోట్ల సబ్సిడీ, మరణించిన 67 మత్స్యకారుల కుటుంబాలకు న ఎక్స్- గ్రేషియాను ఇవ్వడం జరిగింది. 53,550 రొయ్యలు పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్కు రూ.3.86 నుండి రూ.1.50కు తగ్గించబడింది. ఫలితంగా రూ.1,560 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

ఇంతేగాక G.S.P.C. తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 14,927 కుటుంబాలకు పరిహారంగా రూ.75 కోట్లు అందించడం జరిగింది. తీరప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి, 8 ఫిషింగ్ నౌకాశ్రయాల అభివృద్ధిని రెండు దశలలో చేపట్టడం జరిగింది. రూ.1510 కోట్లతో 4 ఫిషింగ్ నౌకాశ్రయాల నిర్మాణ పనులు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి. రెండవ దశలో, రూ. 1365.35 కోట్లతో మరియొక 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు - శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నంలోని పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి. ఈ చర్యలతో, 'మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరులను సుస్థిర అభివృద్ధికి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉ పయోగించడం' అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును. 2021-22 సంవత్సరానికి మత్స్య రంగానికి 39.4 కోట్లు ప్రతి పాదిస్తున్నాను.

25. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపుల ద్వారా నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (S.D.G.) సాధించగలుగుతున్నాము - అవి ఏమనగా 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అన్నిరకాల రూపాలలో పేదరిక నిర్మూలన', 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'ఆకలి బాధలు లేకుండా చూడటం', 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ఉత్పాదకతో కూడిన ఉపాధి మరియు అందరికీ గౌరవప్రదమైన పని కల్పించడం' మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతలు తగ్గించడం'.

Back to Top