హర్షాతిరేకాలు

నూత‌న జిల్లాల ఏర్పాటుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

క్షీరాభిషేకాలు, భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు
 

మచిలీపట్నం: నూతన జిల్లాల ఏర్పాటుపై బందరు వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నిర్వహించిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికారు. ‘థాంక్యూ సీఎం’ అనే ప్లకార్డులను పట్టుకుని జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జిల్లా కోర్టు సెంటర్‌లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బందరు  మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు తంటిపూడి కవిత, లంకా సూరిబాబు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు షేక్‌ సలార్‌దాదా, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ షేక్‌ అచ్చెబా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకె వెంకటేశ్వరరావు, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం నాయకుడు వై.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే కాకాణి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
పొదలకూరు: తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిపినందుకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పొదలకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జగనన్న వరం – సర్వేపల్లి జననీరాజనం’ పేరుతో చేపట్టిన వారోత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

కార్యక్రమంలో భాగంగా తొలుత బస్టాండ్‌ సెంటరులో ‘థాంక్యూ సీఎం సర్‌’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక సంగంరోడ్డు పెట్రోలు బంకు నుంచి రామనగర్‌ గేటు సెంటరు వరకు వందలాది బైకులు, వేలాదిమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. మండల ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కీలుగుర్రాలు, మేళతాళాలు, బాణాసంచాతో యువకులు సంబరాలు నిర్వహించారు.  

తాజా వీడియోలు

Back to Top