కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట 

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు విడుదల 

చెక్కు అందజేసిన మాజీ మంత్రి కన్నబాబు  

కాకినాడ : కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. 
అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్‌ మెకానిక్‌గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజేష్‌, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌ ఓదార్చారు.

వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా  కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం వైయ‌స్ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆర్థిక‌ సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్‌లో వలంటీర్‌గా పని చేస్తోందన్నారు.

Back to Top