కాసేప‌ట్లో ఏపీ కేబినెట్‌ భేటీ

 అమరావతి: సీఎం వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. నివర్‌ తుపాను ప్రభావం మీద కూడా చర్చించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.   

30 నుంచి అసెంబ్లీ, మండలి
  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేశారు. 15వ శాసనసభ ఐదో సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. మండలి 37వ సమావేశాలు ఉదయం 10కి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూన్‌ 16, 17వ తేదీల్లో ఉభయ సభల సాధారణ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. కనీసం 3 వారాలు జరగాల్సిన బడ్జెట్‌ సమావేశాలను కోవిడ్‌ వల్ల రెండు రోజులకే కుదించి నిర్వహించారు.

రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధి పూర్తయ్యే లోపు ఉభయ సభల సమావేశాలను అనివార్యంగా నిర్వహించాల్సి ఉన్నందున నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉభయ సభలు ఎన్ని రోజులు సమావేశమవుతాయనే అంశాన్ని తొలి రోజు సోమవారం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌ అధ్యక్షతన వేర్వేరుగా బీఏసీ (కార్యకలాపాల సలహా మండలి) భేటీల్లో నిర్ణయిస్తారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top