అమరావతి: రాష్ట్ర 15వ శాసనసభ తొలి సమావేశం బుధవారం ఉదయం 11.05 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 175 మంది సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ముగియని పక్షంలో గురువారం ఉదయం కొనసాగిస్తారు. 13వ తేదీన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. మరుసటి రోజు అంటే 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. కొత్త ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడుతుంది. 15, 16వ తేదీలు సెలవు రోజులు కావడంతో సభ తిరిగి 17వ తేదీన ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగుతుంది. సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెబుతారు. దీంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.