అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్దారు. కొమ్మినేని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాక్షి మీడియా వేదికగా కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ప్రజల సమస్యలను కొమ్మినేని వెలుగులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. లైవ్ డిబెట్ లో కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. కొమ్మినేని ని అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ సాక్షి మీడియా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఏపీలో పత్రికా స్వేచ్ఛ లేదా? మీడియా గొంతు నొక్కటమే చంద్రబాబు లక్ష్యమా? అని నిలదీశారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు... కొమ్మినేని విషయం లో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమే అన్నారు. ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణహత్య తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణహత్య తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈనెల 3వ తేదీన తన్మయి అదృశ్యమైతే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో గత ఏడాది కాలంలో 72 మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారని, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన్మయి హత్య జరిగుండేది కాదన్నారు. ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను గాలికొదిలేశారని, ల్యాండ్ సెటిల్మెంట్ లలో పోలీసులు బిజీ గా ఉన్నారని ఆరోపించారు. ప్రజల భద్రతను గాలికొదిలేశారని, ఎస్పీ నుంచి డీజీపీ దాకా లా అండ్ ఆర్డర్ పై రివ్యూ చేయడం లేదని ఆక్షేపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు.