తండ్రి బాటలోనే సీఎం  వైయస్‌ జగన్‌ అడుగులు

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా

మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌దే 

గుంటూరు:  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లతో నిరుపేద ముస్లిం కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదిగారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా పేర్కొన్నారు. పొన్నూరురోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ‘‘మైనార్టీ యువత ఉన్నత విద్య–నైపుణ్యాభివృద్ధి’’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన  మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడిన నేత ఎవరైనా ఉన్నారంటే ఆది వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన తీసుకున్న మహత్తరమైన చర్యలతో ముస్లిం సమాజం విద్య, ఉద్యోగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు.  

సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో ముందుకు వెళ్తూ ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి శాశ్వతరీతిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేబినెట్‌లో 50 శాతం పదవులను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించడంతో పాటు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు కట్టబెట్టారన్నారు. ఆంధ్ర ముస్లిం కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కర్నూలులోని ఉర్దూ యూనివర్శిటీ స్టడీ సెంటర్‌ను గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పారు.గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని, ముస్లింలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత సీఎం జగనమోహన్‌ రెడ్డికే చెందిందని అన్నారు.

కళాశాల కరస్పాండెంటు షేక్‌ సుభాని మాట్లాడుతూ  మహానేత వైఎస్సార్‌  ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం, మైనార్టీలు సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నారని చెప్పారు. అనంతరం కళాశాల యాజమాన్యం అంజాద్‌ బాషాను ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, మహ్మదీయ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు సమీవుల్లా షరీఫ్, ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర ఎండీ మస్తాన్‌వలీ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రేమ్‌కుమార్, షేక్‌ గౌస్‌  పాల్గొన్నారు.

లక్షల ఉద్యోగాల భర్తీ  ఎప్పుడైనా  జరిగిందా?
ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షేక్‌ అంజాద్‌ బాషా అన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కరకట్టను ఆనుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలనలో ఎల్లో మీడియా అండతో అవాస్తవాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు పాలన సాగించారని మండిపడ్డారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులు పొంగి వరదలు సంభవిస్తే అందులోనూ బురద రాజకీయాలు చేశారన్నారు

Back to Top