వ్యక్తులు కాదు..వ్యవస్థలు శాశ్వతం

దళితుడు, న్యాయకోవిదుడు ఎస్‌ఈసీ పదవికి అర్హుడు కాదా?

 నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఒక్కరే ఆ పదవికి అర్హులా?

వ్యవస్థ బలోపేతానికే కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించాం

ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి పట్టిన పచ్చ చీడ

పవన్‌ వ్యాఖ్యలు అర్ధరహితం

రామకృష్ణ సీపీఐని టీడీపీ జేబు సంస్థగా మార్చారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: వ్యక్తులు వస్తుంటారు..పోతుంటారు కానీ..వ్యవస్థలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా దళితుడు, న్యాయ కోవిదుడు, రిటైర్డు హైకోర్టు జడ్జి కనగరాజ్‌ను నియమించామన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఈసీగా కనగరాజ్‌ నియామకాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

తమిళనాడు రాష్ట్రంలోని ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, మద్రాస్‌ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన కనగరాజ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి అన్ని రకాల అర్హులున్నారు. ఆయన తొమ్మిదేళ్లు హైకోర్టు జడ్జిగా పని చేసి అనేకమైన తీర్పులు ఇచ్చారని, ఆయన ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాలు అనుసరించాయని చెప్పారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే..ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, నిష్పక్షపాతంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పు కోసమే ఎన్నికల కమిషనర్‌ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించామన్నారు. ఇదేదో పెద్ద తప్పు అన్నట్లు, చీకటి పాలన అంటూ టీడీపీ, మరికొన్ని చిన్న పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నియమించిన వ్యక్తులే ఎల్లకాలం ఆ పదవిలో ఉండాలా? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఒక్కరే ఆ పదవికి అర్హుడుఅన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై రాసిన లేఖ తప్పు అన్నారు. ఇలాంటి వ్యక్తులు అలాంటి పదవిలో ఉండకూడదన్నారు. 
స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు హయాంలో 2018లోనే జరగాల్సి ఉండగా ఎందుకు వాయిదా వేశారో సమాధానం చెప్పాలని అంబటి డిమాండు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను, అర్డినెన్స్‌ను పవన్‌ కళ్యాణ్‌ తప్పుపట్టడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి పట్టిన పచ్చ చీడ అన్నారు. రామకృష్ణ సీపీఐ పార్టీని టీడీపీ జేబు సంస్థగా మార్చారని, చంద్రబాబు ఏం చెబితే అదే ఆయన మాట్లాడుతారన్నారు. 
కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేయాల్సిన కార్యాకలాపాలు చేస్తున్నారని, సీఎం వైయస్ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వ్యవస్థ బాగుకోసమే అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ నియామకాన్ని అందరూ ఆహ్వానించాలని అంబటి కోరారు. 

తాజా వీడియోలు

Back to Top