చంద్రబాబు అక్రమాస్తుల కేసును విచారిస్తారా?

వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

దశాబ్దంన్నరగా చంద్రబాబు అక్రమాస్తుల కేసుపై ‘స్టే’

దీర్ఘకాలంగా ‘స్టే’ కేసుల్లో సత్వర విచారణను స్వాగతిస్తున్నాం

గత పాలకులు విఫలమైతేనే కొత్తవారిని ఎన్నుకుంటారు

మళ్లీ పాత విధానాలే కొనసాగించాలంటే ఎలా?

హైకోర్టు ఆదేశాలపై జాతీయ స్థాయిలో చర్చ  

తాడేప‌ల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఏళ్ల తరబడి ‘స్టే’లు కొనసాగుతున్న వాటిపై వెంటనే  విచారణ ప్రారంభించాలని వైయ‌స్ఆర్‌‌సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

► ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్లో స్టేలు మంజూరైన వాటన్నింటికీ సంబంధించి వేగంగా విచారణ జరిగి, వెంటనే శిక్షలు పడాల్సిన వాటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించనుండటం చాలా సంతోషకరం. ఇలాంటి కేసులు ఏపీ ప్రజల ముందు అనేకం ఉన్నాయి.
► దివంగత ఎన్టీఆర్‌ సతీమణి  నందమూరి లక్ష్మీపార్వతి 15 ఏళ్ల  క్రితమే చంద్రబాబు అక్రమ ఆస్తులకు సంబంధించి వేసిన కేసు చాలా ముఖ్యమైనది.  దేశ చరిత్రలోనే దీర్ఘకాలంగా విచారణ జరగకుండా స్టే ఉన్న కేసుల్లో ఇది నెంబర్‌ వన్‌. ఈ కేసును విచారిస్తారా? లేదా? అనేది తేలాలి.  

‘బ్రీఫ్డ్‌ మీ’ కేసును ప్రయార్టీగా చేపడతారా?
► మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ.. అన్నది 135 కోట్ల మంది ప్రజల్లో ఉన్న పంచ్‌ డైలాగ్‌. దేశ చరిత్రలో ఓ ప్రజా ప్రతినిధి ఆదేశాలతో ఓటుకు కోట్లు ఇస్తూ  అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో ఇదే నంబర్‌ వన్‌ కేసు. ఈ కేసులో కూడా ఇప్పటికీ విచారణ ముందుకు కదలలేదు కాబట్టి తెలుగువారు, తెలుగు భాషాభిమాని అయిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ కేసును కూడా టాప్‌ ప్రయార్టీ కేసుగా, వెంటనే శిక్ష విధించే వీలున్న కేసుగా న్యాయస్థానానికి అప్పగిస్తారా? అన్నది చూడాలి. 

పాత్రధారుడో.. లబ్ధిదారుడో తేల్చాలి
► మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో స్టేను తొలగించాలి. ఒక పబ్లిక్‌ సర్వెంట్‌.. ఈ దేశంలోని నంబర్‌ వన్‌ భూ కుంభకోణంలో పాత్రధారుడా? లేక లబ్ధిదారుడా..? అనే విషయాన్ని తేల్చేలా ఈ కేసును కూడా ధర్మాసనానికి అప్పగిస్తారా? అన్నది వేచి చూడాలి. 

న్యాయవ్యవస్థపై సుదీర్ఘ చర్చ జరగాలి..
► న్యాయవ్యవస్థ అభివృద్ధి నిరోధక శక్తిగా తయారు కాకూడదు. అలా తయారవుతుందనే భావన ప్రజల్లో కలిగితే చాలా ప్రమాదం. అటువంటి వాతావరణం ఏపీలో కనిపిస్తోంది. ప్రతి విషయానికి అడ్డుపడతాం, ఏదీ ముందుకు సాగనివ్వం అనే ధోరణి ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన ధోరణి. దీన్ని న్యాయస్థానాలు పున: సమీక్షించుకోవాల్సి ఉంది. దీనిపై ప్రజల్లో సుదీర్ఘ చర్చ జరగాలి. 

అలాగైతే కొత్త ప్రభుత్వం ఎందుకు?
► గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తరువాత వచ్చిన ప్రభుత్వాలకు సమీక్షించే అధికారం ఉండదు అనే మాదిరిగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం పాలనలో విఫలమైతేనే కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. అదే విధానాలను అమలు చేసేటట్లయితే కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? కొత్తగా వచ్చిన ప్రభుత్వ విధానాలు వేరుగా ఉంటాయి. పాత వాటిని కొనసాగించాలా.. వద్దా.. అనే దానిని శాసనసభ నిర్ణయించుకుంటుంది. ఇందులో న్యాయ వ్యవస్థ చొరబడటం సరికాదు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు న్యాయబద్ధమైనవి కావనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

భూముల కొనుగోళ్లలో ప్రముఖులు..
► దేశంలోనే అమరావతి భూ కుంభకోణం అతిపెద్దది. చంద్రబాబు, ఆయన కుమారుడు, వారి బంధువులు, సన్నిహితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఉన్న వ్యక్తి కుమార్తెలు కూడా భూములు కొనుగోలు చేసిన వారిలో వున్నారు. ఈ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దమ్మాలపాటి ఏజీగా పనిచేశారు. అమరావతి ‘రాజధాని’ నిర్ణయానికి ముందే ఆయనకు ఉన్న సమాచారంతో ఆయనతో పాటు న్యాయవ్యవస్థలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి కుమార్తెలు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. దీనిపై విచారణ జరగాలి. ఈ ఆరోపణ నిజమా.. కాదా? అనేది నిగ్గు తేల్చాలి. అయితే అసలు విచారణ జరపడానికే వీల్లేదనే పద్ధతిలో న్యాయస్థానం వ్యవహరించడం దురదృష్టకరం.  

హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా చర్చ
► హైకోర్టు ఆదేశాలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి. రాజధాని భూముల కుంభకోణంపై సమాచారాన్ని పత్రికలు, సోషల్‌ మీడియా ఎక్కడా ప్రజలకు వెల్లడించకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఎంపిక సరిగా లేదని జేపీ అన్నారు..
► లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ మరో అడుగు ముందుకేసి జడ్జీల ఎంపికే సరైన విధంగా లేదని,  పార్టీలో పనిచేసిన వ్యక్తిని, న్యాయం గురించి తెలియకపోయినా, వారిని జడ్జీలుగా నియమించడం వల్ల వ్యవస్థలో ఇటువంటి సమస్యలు వస్తాయని అన్నారు. వీటన్నింటిపైనా న్యాయవ్యవస్థ సమీక్షించుకోవాలి. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top