దేశ సార్వభౌమత్వానికే చంద్రబాబు ముప్పు తెచ్చారు

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  

  చంద్రబాబు హయాంలో జరిగిన పెగాసస్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేయాలి

  పెగాసస్ పై విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి.

 తాను నిప్పే అయితే.. "పెగాసస్ వాడలేదు.. మమతా బెనర్జీ చెప్పింది అబద్ధం, ఏ విచారణకు అయినా సిద్ధం" అని చంద్రబాబు చెప్పాలి.

  లేదంటే, చంద్రబాబు పెగాసస్ వాడారన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తారా..?

 మమతా బెనర్జీ మీద పరువు నష్టం దావా వేయకపోతే... పెగాసస్ వాడినట్టేనని చంద్రబాబు అంగీకరించినట్టే.

 చంద్రబాబు నియర్ అండ్ డియర్ ఏబీవీ(ఏబీ వెంకటేశ్వరరావు)ని అడ్డుపెట్టుకుని పెగాసస్ స్పైవేర్ ను ప్రైవేటుగా కొని ఉండొచ్చు..!

  చంద్రబాబు జీవితం అంతా అనైతిక రాజకీయమే.. అనైతిక రాజకీయాల్లో బాబే నంబర్ 1

  పెగాసస్ లో గుమ్మడికాయల దొంగలు ఎవరంటేనే.. లోకేష్ నుంచి అయ్యన్నవరకు టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు

  పెగాసస్ వాడి ఉంటే.. ఆరోజే దొరికే వారమని లోకేష్ అంటున్నాడు.. దొంగలు ఎప్పుడైనా అంత త్వరగా దొరుకుతారా..?

  నాడు మా పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవం అవునా, కాదా..?

 చంద్రబాబు నాయుడు ప్రజా నాయకుడు కానేకాదు..  వ్యవస్థలను మేనేజ్ చేసి బతికే వ్యక్తి.  

 సింగిల్ గా ఎన్నికల బరిలో దిగే సత్తా బాబుకు ఎప్పుడూ లేదు.. ఎప్పుడూ ఎవరోఒకరి మద్దతుతోనే అధికారంలోకి వచ్చారు

వైయ‌స్ జ‌గ‌న్‌ గారు సింగిల్ గానే ఎన్నికల బరిలోకి వెళతారు.. వక్రమార్గాల్లో వెళ్ళడం బాబుకు అలవాటు

తాడేపల్లి: చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాదాస్పద పెగాసస్‌ స్పైవేర్‌పై కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పెగసస్‌ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు.  ఈ విషయంపై శుక్రవారం వైయ‌స్అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  

పెగాసస్ కు కూడా బాబే ఆద్యుడేమే..!
    ఈ దేశంలో టెక్నాలజీకి ఆద్యుడునని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు..  చివరకి ఆ టెక్నాలజీతోనే దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వచ్చేరీతిలో పెగాసస్‌ స్పైవేర్‌ను వాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ పెగాసస్‌ స్పైవేర్‌ను వాడినట్లుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీగారు నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సీనియర్‌ మోస్ట్‌ పొలిటిషియన్‌ అయిన మమతా బెనర్జీగారు నైతిక విలువలు కలిగిన రాజకీయవేత్త. అంతేకాకుండా ఆమె చెప్పింది స్టేట్‌మెంట్‌ కూడా కాదు. శాసనసభలోనే ఆన్‌ రికార్డుగా చెప్పారు మమతా బెనర్జీ.
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెగాసస్‌  స్పైవేర్‌ను కొని ఉపయోగించారని మమతా బెనర్జీ చెప్పారు.  మమతా బెనర్జీ ఏమీ మాకు రాజకీయ మిత్రురాలు కాదు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి కూడా కాదు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లు కొంతకాలం ఒకేబోటులో ప్రయాణం చేశారు. 2019 ఎన్నికల్లో వారు ప్రత్యేకమైన కూటమిగా ఏర్పడి మోదీకి వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకుని, చంద్రబాబు పక్కనే నుంచొని చెయ్యెత్తిన వ్యక్తి. అలాంటిది నిన్న మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పిన మాటలు విన్న తర్వాత... గుమ్మడికాయల దొంగలు అనగానే భుజాలు తడుముకునేవిధంగా పెగాసస్ గురించి లోకేష్ నుంచి అయ్యన్న వరకూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. తమకు పెగాసస్‌తో సంబంధం లేదని, తామేమీ వాడలేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వాళ్లు ఎందుకు అలా ప్రకటన చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాస్తవానికి, ఇప్పటి వరకూ మా  పార్టీగానీ, ప్రభుత్వం తరఫునగానీ మాట్లాడలేదు, ఫస్ట్ రియాక్షన్ పార్టీ నుంచి నేనే ఇస్తున్నాను. నేను మాట్లాడక ముందువరకూ, మేమేమీ వాళ్లు ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడారని అనలేదే...! అనకపోయినా టీడీపీ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ కూడా సమాధానం ఇచ్చారు. చంద్రబాబుతో సహా ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా వచ్చి ఈ పెగాసస్‌తో తమకు సంబంధం లేదని స్టేట్‌మెంట్‌ లు ఇస్తూనే ఉన్నారు.

మరి, మమతాపై పరువు నష్టం దావా వేస్తారా..?
    టీడీపీవాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వరుసగా భుజాలు తడుముకునే కార్యక్రమం చేస్తున్నారంటే దీనిలో ఏదో ఉంది? మీరు ఖచ్చితంగా పెగాసస్‌ స్పైవేర్‌ను వాడారు. దీనిద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం చేశారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. మమతా బెనర్జీగారు శాసనసభలో ఇదే విషయం చెప్పారు.  ఆమెకు ఏమైనా సమాధానం చెబుతారా? లేక మమతా బెనర్జీగారిపై పరువునష్టం దావా వేస్తారా?. ఎందుకంటే, లోకేష్‌ బాబు తిండి ఖర్చు కోసం రూ.30 లక్షలు వాడారని సాక్షి దినపత్రికలో వస్తే.. దానిమీద పరువునష్టం దావా వేశారే? మరి దీనిపై కూడా మమతా బెనర్జీపై పరువునష్టం దావా వేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా?

- ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును కోట్‌ చేస్తూ అన్న తర్వాత ఆమెకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా? లేదా? అదేమంటే, తిరిగి మామీద విమర్శలు చేస్తున్నారు. మామీద విమర్శలు చేయడంతోపాటు, ఆర్టీఏ యాక్ట్‌ కింద ఎవరో దరఖాస్తు చేస్తే,  అప్పుడు ఉన్న డీజీపీ సవాంగ్‌ గారు ఇలాంటి పరికరాలు మేము కొనలేదని సమాధానం చెప్పారట. ఇంకేముంది మేమేమీ కొనలేదు.. మేము శుద్ధులమని భుజాలు ఎగరేసుకుంటున్నారు. అయ్యా..  మీ సంగతి ఎవరికి తెలియదు.. ఇలాంటివి సవాంగ్‌ ద్వారానో, ప్రభుత్వం ద్వారానో కొంటారా..? 

బాబు నియర్ అండ్ డియర్ ఏబీవీతో పెగాసస్ కొన్నారేమో..
    మీకు చాలా నియర్‌ అండ్‌ డియర్‌ ... మీ హయాంలో ఇంటెలిజెన్స్ పోలీస్‌ అధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుగారు ఏమయ్యారు? ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడితే, విచారణ జరిపి, ఆయనను సస్పెండ్‌ చేస్తే న్యాయస్థానాలు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆయన సస్పెన్షన్‌ తప్పు అని ఎక్కడా వ్యతిరేకించలేదే? అలాంటి ఏబీవీని పక్కన పెట్టుకుని ప్రభుత్వ సొమ్ముతో కాకుండా, ప్రైవేట్‌ సొమ్ముతో పెగాసస్ స్పై వేర్ ను కొనవచ్చుకదా? సవాంగ్‌ గారు చెప్పారు కదా మాకేమీ సంబంధం లేదని, పెగాసస్‌ స్పైవేర్‌ వాడలేదని చెప్పడానికి చేసే ప్రయత్నాలు పచ్చి అబద్ధం.

అనైతికమైన రాజకీయాలకు బాబే బ్రాండ్...
    ఎందుకంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా వక్రమార్గమే.  టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ మార్గాల ద్వారా, అనైతికమైన రాజకీయాలు నడిపారు. ఈ దేశంలో ఎవరైనా అనైతికమైన రాజకీయవేత్త ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. మేము 2014-19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,  వైయస్సార్‌ సీపీని చిందరవందర చేయడానికి, మా పార్టీని నాశనం చేయడానికి  అనేకమైన అనైతిక మార్గాలు అన్వేషించారు, ఆచరించారనే విషయాన్ని ప్రజలు ఏ మాత్రం మర్చిపోరు.

    - మా పార్టీకి చెందిన 23మంది శాసనసభ్యులను లాక్కుని, అందులో నలుగురుకి మంత్రి పదవులు ఇచ్చారే? మమ్మల్ని సర్వనాశనం చేద్దామని ఇన్ని అనైతిక కార్యక్రమాలు పాల్పడ్డారే. జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని రాజకీయంగా ఛిన్నాభిన్నాం చేద్దామని, అదే క్రమంలో మీరు ఫోన్‌ ట్యాపింగ్‌ లకు పాల్పడలేదా? అని ప్రశ్నిస్తున్నాం. ఆ విషయాన్ని అప్పట్లోనే మేం చెప్పాం. మీరు ఫోన్‌ ట్యాపింగ్‌ లు చేస్తున్నారని, మాపై దాడులు చేస్తున్నారంటూ అసెంబ్లీలోనే అనేక ఆరోపణలు చేశాం. దానికి ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి.

పెగాసస్ పై కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలి
    మేము ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిఉంటే ఆరోజే పట్టుకునేవాళ్లు కదా అని నారా లోకేష్‌ నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. దొంగలు అంత తొందరగా దొరుకుతారా? దొంగలు వెంటనే ఎందుకు దొరుకుతారు నాయనా లోకేష్ ?.  ఆధారాలు ఒక్కొక్కటీ బయటపడతాయి. నిదానంగా దొంగలు దొరుకుతారు. దొరికిన తర్వాత శిక్షలు కూడా పడతాయి. చంద్రబాబు దుర్మార్గపు విధానాలు అనుసరిస్తున్నారు కాబట్టే, ఇవాళ ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. దీనిపై పూర్తి విచారణ జరగాలని కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలను మేము డిమాండ్‌ చేస్తున్నాం. పెగాసస్ స్పైవేర్‌ వాడినదానిపై విచారణ జరిగితే తప్పనిసరిగా అన్నీ బయటకు వస్తాయి. 

నాడు ఈవీఎంలపైనా బాబు బురదచల్లలేదా..
     నాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న చంద్రబాబు గారు ఏం చెప్పారు లోకేష్..? మర్చిపోయారా? ఈవీఎంలలో కూడా మోసం జరుగుతుందంటూ ప్రచారం చేసుకుని తప్పుకోవాలని అనుకున్నారే? ఈవీఎంలపై కూడా బురద చల్లే కార్యక్రమం చేశారు. చంద్రబాబు గత చరిత్ర చూసినా...  చట్టవ్యతిరేక కార్యక్రమాలు పాల్పడటానికి ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలంటూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

-  మమతా బెనర్జీగారు చెప్పినవి విన్నతర్వాత పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి  ఇతరుల రహస్యాలను తెలుసుకునే కార్యక్రమం చంద్రబాబు అధికారంలో ఉండి మరీ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే వేలు పెట్టి వినాలనో, కన్ను పెట్టి చూడాలనో, గోడెక్కి అవతల ఏం జరుగుతుందో చూడాలనే అనైతికమైన పనులు చేసి, రాజకీయంగా బట్టకట్టాలని చూస్తున్నారు కాబట్టే అనైతికమైన ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. దీనిపై వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి ప్రయత్నం చేసిన సంఘటనల మీద పూర్తి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. 

పరువునష్టం దావా వేయకుంటే.. అంగీకరించినట్టే...
    మమతా బెనర్జీగారి మీద టీడీపీ పరువునష్టం దావా వేయకుంటే ఆమె చెప్పిన పెగాసస్ స్పై వేర్ ను వాడినట్టు మీరు అంగీకరించినట్లుగానే ప్రపంచం భావించాల్సి ఉంటుందని మీరు గమనించాలి. మీరు ఎన్ని డప్పాలు కొట్టినా ప్రజలు నమ్మరు. 

- ఈరోజు కూడా చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. పెగాసస్ కొనలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు ఆధారాలతో బయట పడ్డాయని అంటున్నారు.. మరి మమతా బెనర్జీగారు మాట్లాడింది ఏంటో, చంద్రబాబుకు అర్థం అయిందేంటో నాకు అయితే అర్థం కావడం లేదు. అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడే చంద్రబాబు పెగాసస్‌ స్పైవేర్‌ను వాడే అవకాశమే  ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్రాలను కోరుతున్నాం.

 - రాజకీయ పార్టీలకు తెరవెనుక వ్యూహకర్తలు అనేది వేరే అంశం. వ్యూహకర్తలు ఏ పార్టీకైనా ఉండొచ్చు, అధికారులు ఉండవచ్చు. దానికి, దీనికి సంబంధం ఏముంది?

- మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరో సలహా మేరకు ఆమె ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందని అనుకోవడం ఎంతవరకూ సమంజసం...? దీనివల్ల ఆమెకు పొలిటికల్‌గా ఏం లాభం ఉంటుంది...? పోరాడి అధికారంలోకి వచ్చిన మహిళ. చంద్రబాబులా నక్కజిత్తులతో ట్యాపింగ్‌లతో అధికారంలోకి వచ్చిన ఆమె కాదు. వాళ్ల పార్టీ వ్యూహకర్త, మా వ్యూహకర్త ఒకటే కాబట్టి ఆమెతో అనిపించారనేది అనైతికం. ఆ మాటను టీడీపీవాళ్లను అనమనండి. మమతా బెనర్జీపై దావా వేయమనండి. ఎందుకంటే, ఆమె అన్నది నిజం కాబట్టే, ఆమె గురించి వీళ్ళు ఏమీ మాట్లాడరు. 

- చంద్రబాబు నిప్పే అయితే.. తాము పెగాసస్‌ స్పైవేర్‌ ను వాడలేదని టీడీపీని స్పష్టం చేయమనండి. మమతా బెనర్జీ అబద్ధం చెప్పిందని చెప్పమనండి, ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని చెప్పమనండి. దానిపై తండ్రీకొడుకులు మౌనం పాటిస్తారు. వీళ్ల మాట వినడం వల్లే కదా ఏబీ వెంకటేశ్వరరావు శంకరగిరి మాన్యాలు పట్టాడు. మా పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను ఎత్తుకుపోయేందుకు ఆరోజున పోలీస్‌ వ్యవస్థను ఉపయోగించిన నీచరాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ శాఖలను పార్టీలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు. పెగాసస్‌ స్పైవేర్‌ ను వాడారనడానికి ఇంతకంటే రుజువులు ఏం కావాలి...?

- ఏబీ వెంకటేశ్వరరావు పచ్చచొక్కా తొడుక్కున్నాడు తప్ప ఖాకీ చొక్కా కాదని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాం. ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడి రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ సహచరులను సైతం తొక్కివేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top