తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో జీవనాడికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు. పోలవరం విషయంలో ఇంత ఘోరం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం , బాధ్యత ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీకి ఉందన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పువైయస్ఆర్‌సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి ద్రోహం చేయవద్దని, ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులను సరి చేసుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.