అమరావతి: వైయస్ఆర్ రైతుభరోసా కింద 50.47 లక్షలమంది రైతులకు రూ.2 వేల వంతున పెట్టుబడి సాయం అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రైతు సంక్షేమానికి కట్టుబడి కరోనా వంటి మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. చిత్తశుద్ధి అనేదానికి తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిదర్శనమని చెప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతుభరోసా చెల్లిస్తామని చెప్పారు. వారందరికీ రూ.11,500 ఇస్తామన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీని కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. విపక్షాల తీరును, పోలవరంపై టీడీపీ వైఖరిని ఎండగట్టారు. మంత్రి కురసాల కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. ► పోలవరంపై టీడీపీ విచిత్రమైన వాదన చేస్తోంది. ప్రాజెక్టు గురించి ఏమీ తెలియకుండానే లోకేశ్ విమర్శలు చేయడం విడ్డూరం. ► కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని తామే కడతామని కేంద్రం నుంచి టీడీపీ ప్రభుత్వం తీసుకున్నమాట నిజం కాదా?. ► పోలవరం పాపం బాబు అకౌంట్‌లోనే ఉంటుంది. ► మా ప్రభుత్వం నూటికి నూరుశాతం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతుంది. ► లోకేశ్‌కి డ్రైవింగ్ రాక టీడీపీ ఏమైందో చూశాం.. మళ్లీ ట్రాక్టర్ ఎందుకు నడిపారు? అదృష్టవశాత్తు ఏమీ కాలేదు కనుక సరిపోయిందిగానీ లేకుంటే దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అనే వారు. ► అమరావతి రైతులు మాత్రమే రైతులా? మిగతా రైతుల కష్టాలు టీడీపీకి పట్టవా?. ► కమ్యూనిస్టులు ఎర్రజెండాను మోయడం మాని పచ్చజెండా మోస్తున్నారు. గీతం ఆక్రమణలను కమ్యూనిస్టులు సమర్థించడం దారుణం.