ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ తెరిచే ప్రసక్తే లేదు

నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం

స్టైరిన్‌ తరలింపునకు రెండు కంటైనర్‌షిప్‌లు ఏర్పాటు చేశాం

మంత్రుల బృందాన్ని ఎవరూ అడ్డుకోలేదు

కొన్ని మీడియా చానళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విశాఖపట్నం: సున్నితమైన విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మంత్రుల బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారని కొన్ని మీడియా చానల్స్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని, మంత్రుల బృందాన్ని ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్తులు మంత్రుల బృందాన్ని కలిసి వారి బాధను చెప్పుకున్నారని చెప్పారు. విశాఖలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ వలన ఐదు గ్రామాలపై ప్రభావం పడిందని ఆ గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం జరిగిందని, ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్తులు కూడా తన గ్రామాన్ని పరిగణలోకి తీసుకోవాలని మంత్రులను కలిసి వారి బాధను వివరించారన్నారు. ఆ అంశాన్ని విడిచిపెట్టి మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు అంటూ కొన్ని మీడియా చానల్స్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

సీఎం వైయస్‌ జగన్‌ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే అడక్కుండానే సాయం చేస్తున్నారని మంత్రి కన్నబాబు చెప్పారు. గ్యాస్‌ లీకేజీ ఘటన తరువాత ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ. కోటి, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 1 లక్ష, ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఎఫెక్టెడ్‌ ఏరియాలోని మనిషికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. ఎవరినో కొంతమందిని వదిలేసే కార్యక్రమం చేయడం లేదని, ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామాన్ని కూడా పరిశీలించి నిజంగా ఎఫెక్టెడ్‌ విలేజ్‌ అయితే పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కన్నబాబు వివరించారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ మూతపడిందని, నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కంపెనీ తెరిచే ప్రసక్తే లేదని మంత్రి కన్నబాబు చెప్పారు. కంపెనీలో ఒక్క టన్ను స్టైరీన్‌ కూడా ఉండేందుకు వీల్లేదని ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. స్టైరీన్‌ తరలించేందుకు ప్రభుత్వం రెండు కంటైనర్‌ షిప్స్‌ను ఏర్పాటు చేసిందని, ఒక కంటైనర్‌షిప్‌లో 8,500 టన్నుల స్టైరీన్‌ లోడ్‌ చేయడం మొదలైందన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలోని ట్యాంకర్‌లో ఉన్న స్టైరీన్‌ కూడా మొత్తం షిప్ట్‌ చేస్తున్నామని, ఇదంతా పూర్తవ్వడానికి 5 రోజులు పడుతుందన్న నిపుణుల సూచనను సీఎం వివరించామన్నారు. ఐదు రోజుల్లో ఒక్క టన్ను కూడా ఉండేందుకు వీల్లేదని సీఎం ఆదేశించారన్నారు. మొత్తం స్టైరీన్‌ను దక్షిణ కొరియా తరలిస్తున్నారని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామని వివరించారు.
 

Back to Top