అనిల్‌కుమార్‌ను ఆశీర్వదించండి

సినీ నటుడు అలీ

నెల్లూరు  : ‘డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ నెల్లూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ఎన్నో పోరాటాలు చేశారు. సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన్ను ఈనెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించండి’ అని సినీ నటుడు అలీ ఓటర్లను కోరారు. నెల్లూరులోని 43వ డివిజన్‌ జెండావీధి, కోటమిట్ట, మెక్లిన్స్‌రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే, అభ్యర్థి అనిల్‌కుమార్‌తో కలిసి శనివారం అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అనిల్‌ పేదవారి కోసం సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోను విడుదల చేయడం జరిగిందన్నారు. మైనార్టీల సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామని జగనన్న ప్రకటించారన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్, మౌజన్‌లకు గౌరవవేతనం రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించారన్నారు. మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. నారాయణ నాలుగన్నరేళ్లుగా నగర ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును నారాయణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Back to Top