ప్రజా సంకల్పయాత్రలో 3 కోట్ల మందితో మమేకం

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపే యాత్ర

ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం

ఇఛ్చాపురంలో 88 అడుగుల పైలాన్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం

ఇఛ్చాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటూ చిరస్థాయిగా నిలిచే రీతిలో ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. ఈ నెల 9 వ తేదీన పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ,  అందుకు చిహ్నంగా ఇఛ్చాపురం నియోజకవర్గంలో నిర్మిస్తున్న పైలాన్ వద్ద  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైయస్ఆర్ గారు పాదయాత్ర చేసి నాటి 9 ఏళ్లు చంద్రబాబు దుష్టపాలనను ఎలా అంతమొందిచ్చారో, ఈనాటి ప్రజా వ్యతిరేక,అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర దోహదపడుతుందన్నారు. ఇడుపుల పాయలో ఒక ధృడ సంకల్పంతో మొదలైన అడుగు, ఇఛ్చాపురం వచ్చేసరికి ఉక్కు సంకల్పంతో ముగియనుందన్నారు.  జగన్ మోహన్ రెడ్డి నడిచిన దూరం కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ఉన్న దానికంటే మించినదని , ఇది విజయవంతం కావడం పార్టీకి గర్వకారణమన్నారు. కిలోమీటర్లు, రోజులు అనే లెక్క కోసం కాకుండా, ప్రతి గ్రామంలోనూ మహిళలను, రైతులను, యువతను, వృద్ధులను , కులవృత్తులపై ఆధారపడిన వారిని, విద్యార్ధులను ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకోడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కేవలం పాదయాత్ర చేశామని చెప్పుకోడానికి కాకుండా పూర్తిగా ప్రజలతో మమేకం కావడానికే చేసిందన్నారు.  మొత్తం మీద ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు రెండున్నర కోట్ల నుంచి, మూడు కోట్ల మందితో మమేకం అయ్యినట్లుగా అంచనాలున్నాయని వివరించారు.

ఎముకలు కొరికే చలిలోనూ, జోరు వాన, తీవ్రమైన ఎండవేడిమిని సైతం పక్కకు పెట్టి ప్రజలందరిని కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలన్న అకుంఠిత దీక్షతో జననేత పాదయాత్ర జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినట్లుగా ఉదయం రెండు గంటలు, సాయంత్రం పొద్దుపోయాక మరో రెండు మూడు గంటలు లాగా కాకుండా , నిబద్ధతతో జగన్ పాదయాత్ర కొనసాగిందన్నారు.

జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి, ఆయన నుంచి ఒక హామీ పొందితే చాలన్న నమ్మకంతో అడుగడుగునా ప్రజలు బారులు తీరారన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ కూడా ఆచరణ సాధ్యమేనని, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న తరువాతనే పార్టీ విధానాలను జగన్ గారు ప్రకటించారన్నారు.

రైతులను ఆదుకోడానికి స్థీరకరణ నిధి ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన దరిమిలా అటువంటి పథకాన్నే తెలంగాణాలో అమలు చేయడం ప్రారంభించారనీ, అలాగే వెయ్యి రూపాయలు పైబడిన చికిత్స అవసరమైన ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యశ్రీ కిందకు చేరుస్తామన్న విధానం ఆధారంగానే, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టిందనీ అలాగే, బిసి డిక్లరేషన్ ద్వారా బిసి వర్గాలకు చేయబోయే కార్యక్రమాలను ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షులు ప్రకటించిన తరువాతనే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆదరణ పథకాన్ని చేపట్టిన సంగతిని గుర్తుకు చేస్తూ ఇలా అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ జగన్ ఎంతో పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగారన్నారు.

చంద్రబాబు నాయుడిలా రాజకీయాల్లో తలపండకపోయినా, సంక్షేమంలో మాత్రం అందరి తలదన్నే రీతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండనున్నాయని తలశిల రఘురాం అన్నారు. రాష్ట్రంలో బలమైన సంక్షేమ ప్రభుత్వం ఏర్పడటానికి వైయస్ జగన్ చేసిన ప్రజా సంకల్పయాత్ర పునాది వేయనున్నదని పేర్కొన్నారు.

చారిత్రకమైన ప్రజా సంకల్పయాత్ర ముగింపు కూడా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి దాయకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 88 అడుగుల ఎత్తున పైలాన్ నిర్మిస్తున్నామని, పార్టీ శ్రేణులందరినీ  ఉత్తేజితం చేసేలా రూపుదిద్దుతున్నామని ఆయన వివరించారు.

ప్రజా సంకల్పయాత్ర విశేషాలివీ

13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్లు (341 రోజు నాటికి)  నడిచారు. 231 మండలాల్లోని 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లలో పాదయాత్ర జరిగింది. ఇందులో 55 ఆత్మీయ సమ్మేళనాలు, 124 బహిరంగ సభలు జరిగినట్లు తలశిల రఘురాం తెలిపారు. ఇంతవరకు జరిగిన పాదయాత్రలో దాదాపు 2 కోట్లు50 లక్షల మంది నుంచి 3 కోట్ల మంది వరకు ప్రజలను నేరుగా కలుసుకున్నట్లుగా అంచనాలున్నాయని ఆయన వివరించారు.

Back to Top