ఖజానా ఖాళీ చేసిపోతున్న బాబు!

రెండో మాట  

 

సాధికార సర్వేలు పేర్కొనని రాష్ట్ర ప్రగతిని సీఎం చంద్రబాబు సొంత ఊదర సర్వేల ‘జంతర పెట్టె’లో జనాలకి చూపడమే కాదు, ఎన్నికల కమిషన్‌ను సహితం మభ్యపెడు తున్నారు. రాష్ట్రం అప్పు రూ. రెండున్నర లక్షల కోట్లు అని తేలగా, దాన్ని ఎన్నికల తరుణంలో తట్టుకోడానికి చేసిన పని.. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సిబ్బంది జీతాలు మినహా మిగతా అలవెన్సులు, వైద్య బిల్లులు, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వగైరా నిధులన్నింటినీ గత రెండు, మూడు మాసాలుగా నిలిపేసినట్లు అధికార వర్గాల భోగట్టా. ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల ఖర్చు వచ్చే ప్రభుత్వానికి అప్పులను బదలాయించే కార్యక్రమమని నిపుణుల ఉవాచ.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా ప్రకటించే కుటుంబ ఆస్తుల వివరాల ప్రకారం, 2014– 15లో వాటి విలువ రూ. 528.86 కోట్లు. కాగా ప్రతి ఏటా ఆస్తులను ప్రకటించే ఏకైక రాజకీయవేత్తను దేశంలో తానేనని చెబుతూ 2017–18 నవంబర్‌లో తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 165.13 కోట్లు అన్నారు. కాగా తాజాగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫి డవిట్‌లో 2018–19లో తన కుటుంబ ఆస్తుల విలువను రూ.1042.24 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు 100 శాతం పెరిగినట్లు ఖరా రయింది. కాగా అయిదు నెలల కిందట ఆయన వెల్లడించిన ఆస్తుల విలువతో పోల్చితే నేటి ఆయన ఆస్తుల విలువ 531 శాతం పెరిగినట్లు తేలింది.
– కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రబాబు 22.03.2019న నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం అందులో పేర్కొన్న ఆస్తుల సారాంశం.

ఎన్నికల కమిషన్‌ను సైతం మోసం చేయగల ‘చిత్రగుప్తుని’ లెక్కలు చూపటంలో చంద్రన్న హస్తకౌశలం (చేతివాటం) ఎలాంటిదో ఇప్పటి కైనా ప్రజలకు, పాఠకలోకానికి తెలిసిపోయి ఉంటుంది! అందుకే తాజా ఆలోచన. బాబు పోతూనే రాష్ట్ర ఖజానాను కూడా ఖాళీ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి నవీన్‌ చావ్లా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ భారత రిపబ్లిక్‌ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారి దేశంలోని పాలకులు పార్లమెంటు లాంటి రాజ్యాంగ శాసన వ్యవస్థల్ని అసమర్థతతో నిర్వహిస్తున్నారని, అందుకు పాలకులు బాధ్యత వహిం చాల్సిందేనని శఠించవలసి వచ్చింది. సరిగ్గా ఈ సందర్భంగానే ‘‘ఆంధ్రప్రదేశ్‌ రెండంకెల (డబుల్‌ డిజిట్‌) వృద్ధి రేటుతో దూసుకెళు తోంద’’ని ప్రజల్ని నమ్మింపచేయడానికి చేసిన ప్రయత్నం వెనక రహస్యం.. ఎన్టీఆర్‌తో సంబంధం ఏర్పడక ముందు తనకున్న రెండె కరాల ఆస్తిని కాస్తా రెండేసి, మూడేసి, నాలుగేసి డిజిట్లు విలువలో వేల కోట్లకు (2018–19కి రూ. 1042.24 కోట్లకు) పెంచుకున్న వైనం కనపడకుండా ప్రజల కళ్లు కప్పడానికే! 

లేకపోతే విభజనానంతరం తాడు బొంగరం లేని ఒక రాజధానిని నిర్మించే ప్రయత్నంలో భాగంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే సదవకాశాన్ని ‘‘ఓటుకు కోట్లు’’లో అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి సచివాలయం నుంచి అకస్మాత్తుగా బిచాణా ఎత్తివేసుకుని అమరావతికి చేరిన బాబు ఆచరణలో చేసిన పని ఏ నిర్మాణాన్నీ పూర్తి చేయలేక ఏపీ ప్రజలముందు ‘అర్థనారీశ్వర’ రూపంలో నాటకమాడుతున్నారు! ఈ క్రమంలో సాధికార సర్వేలు పేర్కొనని రాష్ట్ర ప్రగతిని సొంత ఊదర సర్వేల ‘‘జంతర పెట్టె’’లో జనాలకి చూపడమే కాదు, ఎన్నికల కమిషన్‌ను సహితం మభ్య పెడుతున్నారు. బాబు నిరంకుశ నిర్ణయాల ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపత్తి దెబ్బతిని, రాష్ట్రంలోని చిన్న, పెద్ద, మధ్యతరగతి వర్గాల ప్రజలు, రైతులు, సకల వృత్తిదారులూ బాధలలో ఉన్నారన్నది నగ్న సత్యం. ఈ క్రమంలోనే, తన ప్రజావ్యతిరేక పాలనా విధానాలను ఆత్మవిమర్శతో సవరించుకునే బదులు, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీతో పొత్తు ద్వారా ఏర్పడిన కృత్రిమ స్వల్ప మెజారిటీని అంతే కృత్రిమంగా పెంచుకోవడానికి ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపు దారులను ప్రోత్సహించడానికి గజ్జకట్టాడు బాబు.

ఆ దుర్మార్గ ఫలితంగా వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎంఎల్‌ఏలను, ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని వందల కోట్ల రూపాయల తోనూ, పదవుల ఎరతోనూ కొనే శాడు. ఇప్పుడిక ఆయన ఎత్తిన తాజా అవతారం పదవీరక్షణ కోసం జగన్‌ పార్టీ మినహా అన్ని పార్టీల నుంచి గీతదాటే విభీషణుల కోసం ఎదురుతెన్నులు చూడటం, బెదిరించడం, బాహాబాహీ ఘర్షణలను సృష్టించడం ద్వారా అశాంతి వాతావరణంలో తిరిగి అధికార కైవసం కోసం అత్యాచారాలకు తెరలేపటం! జగన్‌ చారిత్రాత్మక సుదీర్ఘపాద యాత్ర ద్వారా కోట్లాదిమంది ప్రజలను జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాల పైన, కబ్జాలపైన పంట పొలాల విధ్వంసం పైన చైతన్య వంతుల్ని చేస్తూ రావడంతో ప్రశాంత కిశోర్‌ అన్నట్లు నిజంగానే తన ‘ఓటమి తప్పద’న్న ఆలోచనకు బాబు వచ్చాడు. 

దానికితోడుగా ‘మునిగిపోయేవాడు గట్టి పోచ’ను పట్టుకున్నట్లుగా ‘పవన్‌’ అనే ఒక సినీ నటుడి ఆసరాతోనూ, శివాజీ అనే ఓ ‘గరుడపక్షి’ అండతోనూ, బాబు ఎన్నికల యాత్ర ప్రారంభించారు. తనపై పేరు కుపోయిన 17 కేసుల్ని గూర్చి ప్రజలకు వివరించకుండా, కేంద్ర కాంగ్రెస్‌ నాయకత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు ఉమ్మడిగా జగన్‌పైన కృత్రిమ కేసులు బనాయించడం ద్వారా, వైఎస్సార్‌ మరణానంతరం జగన్‌ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకు రాకుండా నిరోధించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు, కాలక్రమంలో జగన్‌పై కేసుల విషయంలో భాగస్వాముల్ని చేసిన వారంతా దాదాపు విడుదలవగా, సీబీఐ స్పెషల్‌ కోర్టు, గౌరవ న్యాయమూర్తులు ‘ఎక్కడ మీ సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు’ అని పలు మార్లు ప్రశ్నించడంతో సీబీఐ చప్పుడు కాకుండా ఉండిపోవలసి వచ్చింది.

గత పదేళ్లుగా న్యాయస్థానాలను గౌరవిస్తూ, పాదయాత్రల మధ్యనే హాజరవుతూ, తన సుదీర్ఘ ప్రజా సమీకరణ యాత్రను జయప్రదం చేసుకుంటున్న సందర్భంలో– ప్రతిపక్ష నాయకుని సుడిగాలిని తట్టు కోలేని చంద్రబాబు జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో తలపెట్టిన ‘కత్తి పోటు’ ఘటనలోనూ,  అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న జగన్‌ పినతండ్రి వివేకానందరెడ్డి హత్యాకాండ పూర్వాపరాల మధ్య– ‘ఓట్లు’ అనే పరిగలను ఏరుకోడానికి చంద్రబాబు వర్గం ప్రయత్నించడంతో కుట్రపూరిత రాజకీయం బట్టబయలయింది. 

ఇప్పుడు వేరే మరో కథ నడుస్తోంది, కథలో అంతర్నాటకం– దాని పేరు. రాష్ట్రం అప్పు రూ. రెండున్నర లక్షల కోట్లు అని తేలగా, దాన్ని ఎన్నికల తరుణంలో తట్టుకోడానికి చేసిన పని.. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో సిబ్బంది జీతాలు మినహా మిగతా అలవెన్సులు, వైద్య బిల్లులు, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వగైరా నిధులన్నింటినీ గత రెండు, మూడు మాసాలుగా నిలిపేసినట్లు అధికార వర్గాల భోగట్టా. బహుశా లోటు బడ్జెట్‌నూ, ఎన్నికల కోసం పాలకపక్షం చేస్తున్న అమాంబాపతు కోట్లాది రూపాయలనూ వచ్చే ప్రభుత్వానికి అప్పులను బదలాయించే కార్యక్రమంగా రాష్ట్ర ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఏపీకి సంబంధించి ఈ వరుసలో దొరికిపోయినవారు చంద్రబాబు అనుంగు మిత్రులు, మాజీ మంత్రులు– సుజనా చౌదరి, నామా నాగేశ్వ ర్రావు, సీఎం రమేష్‌ వగైరాలు. 98 కాలేజీల్లో విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు నిలిచిపోయాయి.

ఆఫీసర్ల టీఏ బిల్లులు, వారి ప్రైవేటు వాహనాల బిల్లుల చెల్లింపులు ఆగి పోయాయి. మరి ఆ డబ్బులు ఎటు మళ్లాయి? పసుపు–కుంకుమకు, డ్వాక్రాలకు మళ్లాయి. అలాగే అన్నదాత సుఖీభవ. వీటిపై రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీ చెల్లించమంటే ప్రభుత్వం కట్టలేదు. అందుకే అది జీతాలు ఆపేసింది. మున్సిపాలిటీల బిల్లులు, డ్వాక్రా మహిళలకు చెల్లించాల్సిన బిల్లులు, వైద్య ఖర్చుల కింద రోగుల బిల్లులు, కేంద్ర పథకాల బిల్లులు వగైరాలు ఆగిపోయాయని సర్వత్రా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. ‘తనను వెంటాడుతున్నప్పుడు సాధారణ నేరస్తుడు ఎప్పుడూ అపరాధ భావంతోనే చూస్తాడని, నేరస్తుల మనస్తత్వం అలాగే ఉంటుందని చెప్పిన పెద్దమనిషి’ కూడా చంద్రబాబే. ఆ భావనలోనే ఉన్న వ్యక్తులు ఎదుటివారిపై నిందలు వేస్తారట, పైగా తాను ఆశించిన ఫలితాలు రానప్పుడు ఎదుటివారిపైన నిందలను రక్షణ కవచంగా వాడుకుంటా రని చెప్పిందీ బాబే.

బహుశా ఆ నేరస్త మనస్తత్వం మామ ఎన్టీఆర్‌ను కడతేర్చిన బాబుకన్నా హెచ్చు మోతాదులో మరి ఎవరికుంటుందో? ఆ ‘అపరాధ’ భావన నలుగురు పెళ్లికూతుళ్లను చూసి, సంబంధాలు ఒప్పుకుని మరీ మధ్యలో కాడి కింద పడవేసిన నీతిబాహ్యులకే తెలియాలి. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్‌ (ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) ఆయన స్పెషల్‌ సెక్ర టరీగా ఉన్న అత్యంత సౌమ్యజీవి రాఘవేంద్రరావు మరణం కూడా ఎలా సంభవించిందో ‘అపరాధ భావన’లో ఉన్నవారికే తెలిసి ఉండాలి. అలాగే ‘నోటుకు ఓటు’, జగన్‌పై ‘కోడికత్తి’ పోటు, వివేకానందపై గొడ్డలి వేటు ఏ ‘అపరాధ భావన’లో ఉన్న అంతరాత్మకు తోడూ, నీడై ఉండాలో? ‘బడి పిల్లలకు నా పేరు చెప్పి, మరిచిపోవద్ద’ని చెప్పమని పంతుళ్లను ప్రాధేయపడే ముఖ్యమంత్రినీ, మనం ‘అపరాధ భావన’తో తీసుకుంటున్న వారిలోనే చూస్తాం.

ఇక మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న తండ్రికి తగిన తనయుడిగా అధికారిక ఎన్నికల తేదీని ఏప్రిల్‌ 11 నుంచి ఏప్రిల్‌ 9కి స్వచ్ఛందంగా మార్చి చరిత్ర సృష్టించుకున్న ఘనుడు. అలాగే బందరు ఓడరేవు(పోర్ట్‌)ను సరాసరి మన లోకేశ్‌ హైదరాబాద్‌కి తరలించేస్తాడట. బహుశా ఇన్ని రకాలుగా అవతరించిన ‘దేశం’ ‘మేధావుల’ అనుభవం తర్వాతనే కాబోలు వేలాదిమంది కీలక నేతలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి క్యూలు కడుతున్నారు. వీరంతా అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులే. వీరిలో 69 మంది అసెంబ్లీ స్థానాలకు, 310 మంది మండలస్థాయికి, 752 మంది గ్రామ స్థాయికి చెందిన నాయకులు ఉన్నారు. ఇది ఈ కాలపు సునామీ!

 


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top