40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇంత అసహనమా?

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు

దత్తపుత్రుడు పవన్‌ మాదిరిగానే చంద్రబాబు ఊగిపోతున్నారు

కర్నూలులోచంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారు

చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారు

ఆదాయం అంతా ఒకే చోట కేంద్రీకృతం కావద్దనేది మా అభిమతం

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది

శాస్తీ్రయ విధానంతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం

కర్నూలులో న్యాయ రాజధానిని అడ్డుకోవద్దని స్థానికులు కోరారు

స్థానిక ప్రజలను బెదిరిస్తూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది

అన్ని చిట్‌ఫండ్స్‌ మాదిరిగానే మార్గదర్శిలో తనిఖీలు చేస్తే కక్షసాధింపు అని గగ్గోలు

ఇదేం కడుపు మంట బాబు

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  చంద్రబాబు ప్రజల  మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులతో పాటు ప్రజలపై దాడికి పాల్పడటం అన్యాయమన్నారు.  40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇంత అసహనమా అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు పవన్‌ మాదిరిగానే చంద్రబాబు కూడా నిన్న కర్నూలులో ఊగిపోయారని తప్పుపట్టారు. న్యాయ రాజధానిపై వైఖరి అడిగితే సమాధానం చెప్పాలన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉందని చెప్పారు. కర్నూలు వెళ్లినప్పుడు న్యాయ రాజధానిపైన ప్రజలు అడగరా అని ప్రశ్నించారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారిస్తా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 దత్తపుత్రుడు చెప్పు చూపిస్తే.. చూపించాలని ఉందని బాబు అంటున్నాడు
            కర్నూలు వెళ్లి చంద్రబాబు చేసిన విన్యాసాలు ప్రజలంతా  చూశారు. ఏకంగా ప్రజల మీద బూతులతో అసభ్యకరమైన రీతిలో దాడికి పాల్పడటం అన్యాయం, దారుణం. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయనకు అది సరికాదు. అంతకు ముందు కూడా ఆయన దత్తపుత్రుడికి అంతే రీతిలో కోపం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సభ్యత అడ్డం వస్తుంది కాబట్టి చెప్పులు చూపించలేకపోయాను అన్నారని వాళ్ల పత్రికల్లోనే చూశాం. అంటే పవన్‌ కళ్యాణ్‌ అసభ్యంగా వ్యవహరించాడని చంద్రబాబు ఒప్పుకున్నట్లు ఉంది. లేకపోతే చంద్రబాబుకు చెప్పులు చూపించాలని కోరిక ఉన్నట్లుంది. చంద్రబాబు కర్నూలు వెళ్లేటప్పుడే ఒక నిస్పృహతో వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పర్యటనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. కర్నూలుకు న్యాయరాజధాని రావడానికి అడ్డంకులు సృష్టించి, ఒకే రాజధానిని రాష్ట్రమంతా కోరుకుంటుందని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అబద్దం అని చెప్పేందుకు, అక్కడి ప్రజలు నిరసన తెలిపారు. న్యాయ రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటని అక్కడి ప్రజలు ప్రశ్నించారు. వాస్తవంగా చంద్రబాబుకి అదొక అవకాశం కూడా. రాష్ట్రం మొత్తం ప్రజల మన్ననలు పొందాలనుకుంటే చంద్రబాబుకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. వాటికి ఆయన తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాలి. ప్రజలను కన్విన్స్‌ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కర్నూలులో వచ్చిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది. 

వికేంద్రీకరణ.. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్ష :
    మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి, మా పార్టీకి వికేంద్రీకరణపై స్పష్టత ఉంది. అది ఆషామాషీ నిర్ణయం కాదు. వికేంద్రీకరణ డిమాండ్‌కు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది.  సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందరూ వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణ అనే అంశం ఈ రోజు పుట్టింది కాదు. 1937లో శ్రీబాగ్‌ ఒడంబడిక నుంచీ ఈ నినాదం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత, హైదరాబాద్‌లో కేంద్రీకృతమై రాజధాని పెట్టడం వల్ల జరిగిన అనర్ధాలు చూసిన తర్వాత వికేంద్రీకరణ మాత్రమే సరైన నిర్ణయమని అందరూ భావించారు. రాష్ట్ర విభజన తర్వాత వికేంద్రీకరణపై విస్తృతమైన చర్చ జరిగింది. అప్పుడైనా రాజకీయ పార్టీలు ఇంగితంతో వ్యవహరించాల్సింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క దివంగత నేత వైఎస్‌  రాజశేఖరరెడ్డి మాత్రమే అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. చంద్రబాబునాయుడు ఏనాడూ వికేంద్రీకరణ అనే అంశంపై ఆలోచన చేయలేదు. విభజన తర్వాత రాజధాని, వికేంద్రీకరణ అనే అంశాలపై శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు ఎవరూ లేని చోట, సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని చోట రాజధాని నిర్మాణం చేపట్టాడు. 

అమరావతిలో లక్ష కోట్లు పెట్టడం సాధ్యం కాదు
    అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. లక్ష కోట్లు పెట్టి ఆ ప్రాంతంలో రాజధాని కట్టడం అసాధ్యం అని చెప్పారు. ప్రజల్లో శతాబ్ధ కాలంగా ఉన్న ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేశారు. ఇదే తరుణంలో అమరావతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయడంతో పాటు శాసన రాజధానిని కూడా అమరావతిలోనే పెట్టేందుకు శ్రీ వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే బైపాస్‌ రోడ్డు నిర్మాణం, కరకట్ట రోడ్డు విస్తరణ చేపట్టారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా వారికున్న అపోహలు తొలగించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. 

కర్నూలు వెళ్ళి ప్రజలను తిట్టడానికి ఏం హక్కు ఉంది..?:
    కర్నూలు ప్రజలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది. కానీ అక్కడి ప్రజలను బరితెగించివిధంగా, లెక్కలేనితనంగా మాట్లాడారు. రాయలసీమకు వెళితే న్యాయ రాజధానిపై ప్రజలు అడగకుండా ఎందుకుంటారు...అడుగుతారని నువ్వు గుర్తించలేకపోతే చంద్రబాబు ఏం రాజకీయ నాయకుడో అర్ధం చేసుకోవాలి. కర్నూలు వెళ్లి తిట్టడానికి చంద్రబాబుకు ఎటువంటి హక్కు ఉందో చెప్పాలి. సమాధానం చెప్పలేక డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు లేనిపోని ఆవేశం తెచ్చుకున్నాడు. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు. చంద్రబాబు తిట్టడంతో పాటు పట్టాభి నుంచి పవన్‌ కళ్యాణ్‌ వరకూ ఏమేమి తిట్టాలో కూడా చంద్రబాబే చెప్తున్నాడు. ఎవరైనా బాధ కలిగి రియాక్ట్‌ అయితే.. మళ్లీ ఎదురుదాడికి దిగుతాడు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వాళ్లకి వాళ్లే రాళ్లేయించుకుని, మాపై దాడులు చేసి మళ్లీ దాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై రుద్దుతారు. 

పవన్‌ వెళ్లగానే..చంద్రబాబూ వస్తాడు..:
    సమస్యే లేని ఇప్పటం గ్రామం వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ హడావుడి చేశాడు..హైవేపై కార్లమీద నానా హంగామా చేసి మళ్లీ హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. పవన్‌ కళ్యాణ్‌ అలా వెళ్లిపోగానే చంద్రబాబు కర్నూలు పర్యటన పెట్టుకుంటాడు. చంద్రబాబు పోలీసులను, ప్రజలను తిట్టడంతో పాటు చివరి అవకాశం అంటాడు. ఆయన అనుకూల మీడియాలో..  ఇది ప్రజలకు చివరి అవకాశం అంటూ రాతలు రాసి, సమర్ధించుకుంటారు. 2024లో చివరి అవకాశంగా గెలిపించకపోతే నాశనమై పోతారని చంద్రబాబు, ఆయన మీడియా శాపనార్ధాలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీపై చట్ట ప్రకారం దాడులు చేస్తే రాజకీయ కక్ష సాధింపు అంటూ మాపై విమర్శలకు దిగుతున్నారు. రామోజీ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని డైవర్ట్‌ చేశాడని ఆరోపణలు వస్తే చెక్‌ చేయకూడదా..? అది ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదా..? 

- చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనలేదు...అసలు ఆ విషయం ప్రజలకు ఏమి అవసరం అనేది చంద్రబాబు తెలుసుకోవాలి. ఇదేంటని మేం ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారు. చంద్రబాబు, రామోజీ, పవన్‌ కళ్యాణ్‌..ఈ గ్యాంగ్‌ మొత్తానికి ఈ రాష్ట్రం వారి సొంత హక్కులా ప్రవర్తిస్తారు. వీళ్లు ఏం చేసినా మోయాల్సిందే. ఈ వైఖరే గత ఎన్నికల్లో వాళ్లకు ఓటమిని చవిచూపింది. 

ఆక్వా రైతుల పక్షాన శ్రీ జగన్‌.. వ్యాపారుల పక్షాన చంద్రబాబు:
    ఇదేం ఖర్మ కాదు ‘‘ఇదేం ఖర్మరా... బాబూ..!’’ అని పేరు పెట్టుకోవాల్సింది. లేదంటే ఇదేం కడుపుమంట.. అంటూ పేరు పెట్టుకోవాల్సింది. అర్జంటుగా జగన్‌ గారిని దించేసి ఈయన సీటెక్కాలని వీళ్ళంతా భావిస్తున్నారు. ఇదేం విచిత్రమో 30  లక్షల ఇళ్లు కట్టించాను అంటాడు... ఎక్కడ కట్టాడో రికార్డులు చూపించాలని కోరుతున్నాను. చంద్రబాబు తాను ఏం చేశాడో చెప్పుకుని, ఏం చేయబోతున్నాడో చెప్తే బాగుండేది. కానీ లేనిపోని అబద్దాలు మాట్లాడటంలో చంద్రబాబు పెట్టింది పేరు. ఆక్వా రైతుల విషయంలోనూ వ్యాపారుల పక్షాన చంద్రబాబు నిలబడితే... ఆక్వా రైతుల పక్షాన మా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ నిలబడ్డారు. 

అమరావతిలోనే రాజధాని రావాలని జగన్ గారు చెప్పలేదు:
    ప్రజలను తిట్టడమే తన పనిగా కాకుండా, వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలి. అమరావతి రాజధాని పేరుతో ప్రజలను భ్రమలో పెట్టి, భూములన్నీ పూలింగ్‌ పేరుతో లాక్కుని వారిని మోసగించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, వేల, లక్షల కోట్లు సంపాదించాలని ప్రయత్నం చేశాడు. ఒక్క అమరావతే కాదు విజయవాడ, గుంటూరు ప్రాంతాల వారికి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు. ఆ ప్రాంతాల్లోనూ ధరలు పెరగకుండా కట్టడి చేసి, ఒక్క తాను ఎన్నుకున్న రాజధాని రియల్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోనే ధరలు పెరిగేలా చూశాడు. మళ్లీ వచ్చి మీకు సిగ్గులేదంటూ గుంటూరు, విజయవాడ వాసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, రెండు చోట్లా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. జగన్మోహన్‌రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని రావాలని ఎప్పుడూ అనలేదు. రాజధాని ఎక్కడ అనేది ఆ నాడు చంద్రబాబు ఏ పార్టీతో మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయించాడు. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుంది అని మాత్రం శ్రీ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆనాడు అమరావతికి శ్రీ వైఎస్‌ జగన్‌ ఒప్పుకోవడం కాదు అభ్యంతరం చెప్పలేదు అంతే. వికేంద్రీకరణ జరగాలనేది మా విధానాల్లో భాగం. మేం గడప గడపకి పరిపాలన తీసుకెళ్లడం వద్ద నుంచి.. జిల్లాల పునర్విభజన వరకూ వికేంద్రీకరణ దిశగా వెళ్తున్నాం. మూడు రాజధానులు ఎందుకు అనేది మేం చెప్తూనే ఉన్నాం. కానీ చంద్రబాబు ఒక్క  రాజధాని ఏ రకంగా కరెక్టో చెప్పలేకపోతున్నాడు. అలా చేయాల్సింది పోయి ప్రజల్ని దబాయిస్తున్నాడు.

రైతులకు చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి..:
        రైతులకు విత్తనాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వరకూ గ్రామాల్లోనే జరిగేలా ఆర్బీకే కేంద్రాల ద్వారా ఏర్పాటు చేశాం.  బాబు హయాంలో ధరలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు, రైతులు గమనించాలి. మూడున్నరేళ్ల క్రితం ఆత్మహత్యలు ఎన్ని.. ఇప్పుడెన్ని అనేది లెక్కలు తీయాలి. చంద్రబాబు ఏమీ చేయకపోగా, ఇప్పుడు రైతులకు మేము అన్ని పథకాలు క్యాలెండర్‌ పెట్టి మరీ ఇస్తున్నా ఆబద్దాలు చెప్తున్నాడు. రైతు ఆ రోజు కంటే నేడు ఆనందంగా ఉన్నాడో లేదో బేరీజు వేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండకూడదు అని మేం కోరుకోవడం లేదు..ప్రతిపక్షం ఉండదు అని కూడా అనుకోవడం లేదు. చంద్రబాబు ఒక మోసగాడిగా చరిత్రలో ఎలా ఉన్నాడో గుర్తు చేసి మా పరిపాలనను బేరీజు వేసుకోవడానికి ప్రతిపక్షం మాకు అవసరం. కానీ ప్రజల మన్ననలు ఎలా పొందాలనేది మాత్రం చంద్రబాబు గుర్తించడం లేదు.

సినిమాల్లో విలన్ లా.. బాబు చిల్లర రాజకీయం
    "చంద్రబాబు మాత్రం పెద్ద లీడరు.. మిగిలిన వాళ్లు అంతా ఉడతలు" అన్నట్లు మాట్లాడుతున్నారు.  చంద్రబాబును గెలిపించడం చారిత్రక అవసరం అన్న అహంకారం టీడీపీ, ఎల్లో మీడియా వారి తలకు బాగా ఎక్కింది. ఈ ఉడతలన్నీ కలిసి చంద్రబాబు పల్లకీ మోయాలి... చంద్రబాబు ఎలాగోలా వచ్చి కుర్చీలో కూర్చోవాలి అనేది టీడీపీ వాళ్ల భావనలా ఉంది. సినిమాల్లో విలన్‌లా చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నాడు. వికేంద్రీకరణపై చంద్రబాబు నాయుడు స్టాండ్‌ ఏమిటి అనేది చర్చలకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వేదిక మీదనుంచైనా, మీడియా ముందైనా వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరి ఏమిటనేది స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top