తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా టీడీపీ అనుకూల మీడియా, వారి సోషల్ మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పాస్‌పోర్ట్‌పై వస్తున్న ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. వారం రోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోషిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌కు ఈ ఏడాది నవంబరు వరకు గడువు ఉందని, అయితే ఆ పదవి నుంచి దిగిపోయిన పరిస్థితుల్లో, ఆయన తన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను స్వచ్ఛందంగా అప్పగించారని పొన్నవోలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్తగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయగా, అది పోలీస్ వెరిఫికేషన్‌కు వెళ్లిందని తెలిపారు. వైయస్ జగన్ పై ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఉందన్న విషయాన్ని పోలీసులు తమ వెరిఫికేషన్‌లో రాశారని అన్నారు. గతంలో సాక్షి మీడియాలో వచ్చిన ఒక కథనం ఆధారంగా 6 ఏళ్ల క్రితం ఇప్పటి టీడీపీ మంత్రి నారాయణ కోర్టులో ప్రైవేటు కేసు వేయగా, ఆ విషయాన్ని పోలీసులు వెరిఫికేషన్‌లో పేర్కొన్నారని తెలిపారు. దీనిపై దిగువ కోర్టులో కేసు వేయగా, కోర్టు ఎన్‌ఓసీ ఇస్తూ, ఏడాది కాలపరిమితికి పాస్‌పోర్ట్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసిందని పొన్నవోలు వెల్లడించారు. కాగా, సీబీఐ కోర్టు వైయస్ జగన్ పాస్‌పోర్ట్‌కు ఐదేళ్లు ఎన్‌ఓసీ గడువు ఇచ్చిన విషయాన్ని మళ్లీ హైకోర్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఏడాది పాటు ఎన్‌ఓసీ ఇస్తూ దిగువ కోర్టు ఆర్డర్‌ను సవరించమని కోరామని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. విజయవాడ వరదల నియంత్రణ, సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించడానికి ఈ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్ ప్రకారం వాస్తవంగా ఎఫ్‌ఐఆర్ నమోదై, కోర్టు పరిగణలోకి తీసుకున్న కేసుల్లోనే పాస్‌పోర్ట్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని తెలిపారు. కాగా, పోలీస్ వెరిఫికేషన్‌లో పేర్కొన్న కేసు కేవలం ఒక ప్రైవేటు కేసు అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రకటనలో స్పష్టం చేశారు.