ఆధారాలతో నిరూపిస్తా.. చర్చకు వచ్చే దమ్ముందా

తప్పని తేలితే తండ్రీకొడుకులిద్దరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలి

చంద్రబాబు, లోకేష్‌లకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సవాల్‌

ఎన్టీఆర్‌ను బాబే చంపాడు.. ఇది బహిరంగ రహస్యం

ఎన్‌బీకే బిల్డింగ్‌ నుంచి విషప్రచార కుట్ర జరుగుతుంది

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేక దుష్ప్రచారం

చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపాటు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్‌మీడియాలో చంద్రబాబు, లోకేష్‌ విషప్రచారం చేయించారని ఆధారాలతో నిరూపిస్తా. తప్పని తేలితే పెద్దబాబు, చిన్నబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సవాలు విసిరారు. చంద్రబాబు బహిరంగ చర్చకు పిలిచారని, బాబు నిర్ణయించిన ప్రదేశంలో, అనుకూలమైన చానళ్ల సమక్షంలో చర్చకు వచ్చేందుకు సిద్ధమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నందమూరి బాలకృష్ణకు సంబంధించిన బిల్డింగ్‌లో సుమారు 2 వేల మందిని నియమించుకొని సోషల్‌ మీడియాలో పదే పదే సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిలమ్మ, చివరకు వైయస్‌ భారతమ్మను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టించిది చంద్రబాబేనని వాస్తవాలతో సహా నిరూపిస్తానన్నారు. చర్చకు రావాలని మీడియా సమావేశం నుంచి చంద్రబాబుకు ఛాలెంజ్‌ విసిరారు.

వైయస్‌ఆర్‌ సీపీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఏ విధంగా వేధించి, వేంటాడి కించపరిచేలా ఎలా అవమానాల పాలు చేశాడో.. సాక్షాధారాలతో వస్తామని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు కూడా ఆధారాలతో సహా రావాలన్నారు. తప్పు జరిగిందని తేలితే చంద్రబాబు, లోకేష్‌ మీరిద్దరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. బాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారన్నారు. విమర్శలను దీటుగా ఎదుర్కొని సాక్షాధారాలతో చట్టపరమైన చర్యలకు వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. సోషల్‌ మీడియాలోని పోస్టింగ్‌లపై చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి అసభ్యకరమైన పదాలు చదువుతుంటే ప్రజలు చెవులు మూసుకుంటున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పిన చంద్రబాబు మహిళలను కించపరిచేలా ఉన్న పదాన్ని ఎలా పలికారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రశ్నిస్తుందన్నారు.  

మంచి పనులు చేయడం, మంచి జరగడం చంద్రబాబుకు ఇష్టం ఉండదని, సీఎం వైయస్‌ జగన్‌ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని కడుపుమంటతో దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాలుగు నెలల పాలనలోనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే నీకు సిగ్గుందా చంద్రబాబూ అని విమర్శించారు. బాబు వస్తే జాబు అన్నాడు.. నిరుద్యోగ భృతి అన్నాడు.. చిట్టచివరకు యువతను నట్టేట ముంచాడని, అసలు చంద్రబాబు ఎలా బతకగలుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.  

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుతూ సీఎం వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారన్నారు. దుబారా ఖర్చులే లేకుండా, రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఖాజానాకు ఆదాయాన్ని సమకూర్చుతున్నారన్నారు. ఇవన్నీ చర్చకు వస్తాయని దిగజారుడు వ్యవహారాన్ని చంద్రబాబు తీసుకువచ్చాడన్నారు. పోలవరం టెండరింగ్‌లో దొరికిపోయావు. అక్రమ కట్టడంలో నివసించి దొరికిపోయావు. రాజధాని భూముల విషయంలో దొరికిపోయావు. ప్రతి చోటు దొరికిపోయి సిగ్గుతో తలవంచుకొని ఇంట్లో కూర్చోకుండా ఎవరో పెట్టిన పోస్టును తీసుకువచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు ఇంకా దిగజారిపోయాడన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నారు.

చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లుందని, దయచేసి ఒకసారి డాక్టర్లకు చూపించుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూచించారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూడడం, కొడుకు చేతగానివాడు కావడం, వయస్సు మీద పడడంతో మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉండొచ్చన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తి పార్టీ పతనావస్థలో ఉన్నప్పుడు పిలవని పేరంటానికి వచ్చినట్లుగా వెతుక్కుంటూ వస్తాడన్నారు. ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకున్నాడనే అక్కసుతో పత్రికాబలంతో ఎన్టీఆర్‌ను వెంటాడి, మానసిక క్షోభ పెట్టి చంపిన వ్యక్తి చంద్రబాబు అని జగమెరిగిన బహిరంగ రహస్యమన్నారు.  

వైయస్‌ షర్మిలమ్మపై సోషల్‌ మీడియాలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నైతికత ఏమైందని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రశ్నించారు. పథకం ప్రకారం.. 2 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారితో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయించడం, వైయస్‌ జగన్‌ కుటుంబం గురించి మాట్లాడడం, వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్న కుట్ర అని ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. చంద్రబాబు విచారణకు సిద్ధం కావాలని, నాలుగు రోజుల గడువు ఇస్తా. నువ్వు చెప్పిన ప్రదేశానికి వస్తా. స్థాయి తగదనుకుంటే ఓడిపోయిన నీ కుమారుడిని పంపించు చంద్రబాబూ అని మరోసారి సవాలు విసిరారు.  

 

Back to Top