బాబు ఇంటిని ముంచడానికి ప్రభుత్వమే వరదలు సృష్టించిందట

కృష్ణానదికి వచ్చిన వదరలు కృత్రిమమైనవట

ప్రజల నుంచి ఏదోక విధంగా సానుభూతి పొందాలని బాబు ప్రయత్నం

కమల వనంలో చేరిన పచ్చపుష్పాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి

మేం సర్వ మతాలు, సర్వకులాలు కోరుకునే వైయస్‌ఆర్‌ వారసులం

దేవాలయం లాంటి శాసనభను కూడా కోడెల దోచేశారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి:  ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచడానికి ప్రభుత్వమే కృత్రిమ వరదలు సృష్టించిందని చెప్పడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కృష్ణానదికి వచ్చిన వరదలు కృత్రిమమని పేర్కొనడం విడ్డూరంగా ఉందని, చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తప్పుపట్టారు. వరదలతో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 
కృష్ణానదికి వచ్చిన వరదలు కృత్రిమమైనవని, నా  ఇల్లు ముంచడానికే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ వరదలు సృష్టించిందని, జలాశయాలు పూర్తిగా నింపుకోకుండానే నీళ్లు వదిలేశారని టీడీపీ నేతలు పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి సింఫతీ పొందాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తన ఇల్లు కూల్చాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు కృత్రిమంగా వరదలు సృష్టించారని చెబుతున్నారన్నారు. ఎవరైనా వరదలను కృత్రిమంగా సృష్టిస్తారా అని ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన ఘనకార్యాలు ఉంటే చెప్పాలన్నారు. మొదటి రోజే వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నానని, చేయికి నొప్పిగా ఉంటే హైదరాబాద్‌ వెళ్లానని చెబుతున్నారన్నారు. చెయ్యి నొప్పి వస్తే హైదరాబాద్‌కే వెళ్లాలా అని ప్రశ్నించారు. తన ఇంటికి వరద ప్రమాదం వచ్చింది కాబట్టే ఆయన పారిపోయారు. నీ వారసుడైన లోకేష్‌ ఎందుకు ముంపు ప్రాంతాల్లో తిరగలేదన్నారు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో వరద ముప్పు వస్తే ఎందుకు రాలేదని నిలదీశారు. వరదను కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుది దుర్మర్గమైన ఆలోచన అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుకూలమైన పత్రికల్లో రాయించి భ్రమల్లో ఉన్నారని, ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. డ్రోన్‌తో ఫొటోలు తీయవచ్చని, బాంబులు కూడా వేయవచ్చు అని క్రియేట్‌ చేసి లబ్ధిపొందాలని దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నదీగర్భంలో అక్రమ కట్టడంలో నివశిస్తూ..మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. 
2014, డిసెంబర్‌ 31న ప్రత్యేక లాంచీలో పర్యటించిన అప్పటి ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమా అప్పట్లో మాట్లాడుతూ..నదీగర్భంలో ఉన్న 21 కట్టడాలను తొలగిస్తామని చెప్పింది వాస్తవం కాదా అన్నారు. 2015 మార్చిలో మీ ప్రభుత్వం అక్రమ కట్టడాలకు నోటిసులు ఇచ్చారని గుర్తు చేశారు. కూల్చకపోగా, అక్రమ కట్టడంలోనే అధికార నివాసం ఏర్పర్చుకున్నారంటే..మీరు గడ్డి తిన్నారనే అర్థం కదా అని ప్రశ్నించారు. చౌకబారు ఎత్తుగడలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలని హితవు పలికారు. వైయస్‌ జగన్‌ను విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరన్నారు.

మాణిక్యాలరావు అప్పుడేం చేశావ్‌
బీజేపీ నేత మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో హిందు దేవాలయాలు కూలగొడితే అప్పుడు ఏం చేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడు వైయస్‌ జగన్‌ హిందు వ్యతిరేకి అని కామెంట్‌ చేయడం బాధాకరమన్నారు. అమెరికాలో వైయస్‌ జగన్‌ పర్యటిస్తున్నారని, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఒక కార్యక్రమంలో జ్యోతిని వెలిగించలేదని, దీంతో ఆయన హిందు వ్యతిరేకి అంటూ, ఇది అన్యాయం అంటూ టీడీపీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఓ ఎంపీ తన  అధికారిక సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారని తెలిపారు. మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా కామెంట్‌ చేశారని చెప్పారు.  దున్నపోతు ఈనిందనగానే కట్టేయండి అన్న సామెత మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తప్పు అన్నారు. వైయస్‌ జగన్‌ పాల్గొన్న హాల్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మాత్రమే జ్యోతిని వెలిగించే అవకాశం ఉందన్నారు. అగ్గిపుల్లలు, నూనె ఒత్తులతో జ్యోతి వెలిగించకూడదని, అలా చేస్తే చట్టవ్యతిరేకమని అక్కడ ఉందన్నారు. వైయస్‌ జగన్‌ అక్కడ టచ్‌ చేసి ఎలక్ట్రానిక్‌ పరికరంతో వెలిగించి వెనక్కి వెళ్లారని వివరించారు. దీన్ని దుమారం రేపేసి..వైయస్‌ జగన్‌ హిందు వ్యతిరేకి అంటూ కామెంట్లు చేయడం బాధాకరమన్నారు. కమలదళంలో ఉన్న పచ్చపుష్పాలు ఇలాంటి కామెంట్లు చేశారని ధ్వజమెత్తారు. మీరా వైయస్‌ జగన్‌ను కామెంట్‌ చేసేది అని ప్రశ్నించారు. మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో హిందువులకు ఏ మేలు చేశారని నిలదీశారు. చంద్రబాబు హయాంలో 40 హిందు దేవాలయాలను కూలగొడితే ఏం చేశారని ప్రశ్నించారు. హిందుధర్మాన్ని గాలికి వదిలేసి పదవిని పట్టుకుని వేలాడారని విమర్శించారు. సదావర్తి ఆస్తులు కొట్టేస్తుంటే ఏం మాట్లాడావని ప్రశ్నించారు.  సర్వమతాలు, సర్వకులాలు, అందరూ బాగుండాలని కోరుకునే వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసులమని చెప్పారు. మా మేనిఫెస్టోలోనే మా నాయకుడు పేర్కొన్నారని, కులం, మతం చూడమని చెప్పామని గుర్తు చేశారు. మమ్మల్ని హిందు వ్యతిరేకులుగా ముద్రవేస్తే మీరే నష్టపోతారని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని, సీఎంపై కామెంట్లు చేసే ముందు ఆలోచించాలన్నారు. పచ్చరక్తం ప్రవేశించిన తరువాత బీజేపీ నేతలు యాక్టివ్‌ అయ్యారన్నారు. చూసి..అన్ని పరిశీలించి మాట్లాడాలని హితవు పలికారు.

కోడెల వంటి స్పీకర్‌ను ఎప్పుడూ చూడలేదు
కోడెల శివప్రసాద్‌ నాపై రెండుసార్లు పోటీ చేశారన్నారు. 2014లో స్వల్ప ఆధిక్యంలో నాపై గెలిచారని, 2019లో 25 వేల ఓట్ల అధిక్యంతో గెలిచానని చెప్పారు. అంబటికి, నాకు పోలిక అని గతంలో కొడెల కామెంట్‌ చేశారన్నారు. కొడెల స్థాయి తగ్గిపోయిందని, సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన వారే క్రిమినల్‌ కేసులు పెట్టారన్నారు. తాజాగా ఒక విషయం బయటపడిందన్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి అసెంబ్లీ షిప్ట్‌ అయ్యే సమయంలో అక్కడి పర్నీచర్‌ నేరుగా కొడెల ఇంటికి చేరిందన్నారు. ఈ విషయం ఆయనే ఒప్పుకున్నారన్నారు. స్పికర్‌గా ఉన్న కొడెల ఐదేళ్లు పూజారిగా వ్యవహరించారన్నారు. దేవాలయంలోని వస్తువులు కూడా ఎత్తుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారని, హుండి డబ్బులు కూడా ఎత్తుకెళ్లారని, గుడిలో లింగాన్ని కూడా మింగేశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన అసిస్టెంట్‌ పూజారులు రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. నీచమైన రాజకీయాలు చేసే కొడెల ఇప్పుడు తిరిగి ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కొడెల కుటుంబం దోచుకుంటుంటే చంద్రబాబు కళ్లప్పగించి చూశారన్నారు. విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయరన్నారు. 

తాజా వీడియోలు

Back to Top