అవినీతి జరగకపోతే కాంగారు ఎందుకు?

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి

రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు..ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?

పోలవరం కాలువ పనులు 75 శాతం వైయసార్‌ హయాంలో పూర్తి 

గత ప్రభుత్వ తప్పులను సీఎం వైయస్‌ జగన్‌ సరిచేస్తున్నారు

వ్యవసాయానికి బడ్జెట్‌లో 13.6 శాతం నిధులు

విజయవాడ: సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరుగకపోతే టీడీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు.  పోలవరం కాలువ పనులు 75 శాతం వైయసార్‌ హయాంలో పూర్తి చేశారని, చంద్రబాబు కేవలం 25 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రియదర్శిని, జూరాల, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు పూరై్తయితే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గత ప్రభుత్వ అసమర్ధత కారణంగా అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరం లాంటిదని, అలాంటి ప్రాజెక్టులో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అవినీతిమయం చేశారన్నారు. గత ప్రభుత్వ తప్పులను సీఎం వైయస్‌ జగన్‌ సరిచేస్తున్నారని తెలిపారు. శనివారం విజయవాడలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  
 తెలంగాణ ప్రభుత్వం 2014 తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారని, చంద్రబాబు అసమర్ధుడు కాబట్టే పోలవరం పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలకు రైతులు సంక్షోభంలో పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఆ ఆవినీతిని వెలికి తీస్తామంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం నుంచి 2018 నాటికి నీళ్లు  ఇస్తామని గొప్పలు చెప్పిన టీడీపీ నేతలు ఇంతవరకు ఒక్క షెట్టర్‌ కూడా బిగించలేకపోయారని, కాపర్‌ డ్యామ్‌ సగం నిర్మించి ప్రాజెక్టు అంతా పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. లక్ష మందికి ఇంకా రిహబిలిటేషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 25.75 మీటర్లు స్పీల్‌ వే అయితే, 20 మీటర్ల షెట్టర్ల చొప్పున 40 మీటర్ల ఉండాల్సి ఉందన్నారు. ఆ తరువాత మళ్లీ కాంక్రీట్‌ పిల్లర్స్, రోడ్డు ఏర్పాటు చేయాలంటే 54 మీటర్లకు నిర్మించాలన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా చేయకుండానే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసెంబ్లీలో ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఓడిపోయిన తరువాత చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, విలువలు గుర్తుకు వస్తున్నాయని దుయ్యబట్టారు. మీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమా..రాసుకో జగన్‌ అని అసెంబ్లీలో శపథం చేశారు కదా? గుర్తు లేదా అని ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ మీద నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు కదా అని నిలదీశారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టును వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఆరో ప్రాణంగా తీసుకొని యుద్ధప్రాతిపాదికన పనులు చేయించేందుకు ముందుకు వచ్చారన్నారు. పోలవరం పూర్తి కావాలంటే ఇంకా రెండు వర్కింగ్‌ సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటికే పనులు మొదలయ్యాయని చెప్పారు. రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ప్రతి సారి సంక్రాంతికి నీళ్లు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు.
వ్యవసాయాన్ని ఒక చిత్తశుద్ధితో వైయస్‌ జగన్‌ చేపట్టారని, తొలి బడ్జెట్‌లోనే వ్యవసాయానికి 12.6 శాతం నిధులు కేటాయించారని వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ఇచ్చేందుకు 40 శాతం ఫీడర్స్‌కు పగలు 9 గంటలు ఇవ్వడానికి రూ.1700 కోట్లు పవర్‌ బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి 13.6 శాతం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని వివరించారు. ప్రతి రూపాయికి ముఖ్యమంత్రి జవాబుదారిగా ఉంటారని చెప్పారు. అవినీతిని నియంత్రిస్తానని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే సామాన్య విషయం కాదన్నారు. దీనికి ఆత్మ విశ్వాసం, చేస్తామనే చిత్తశుద్ధి ఉండాలన్నారు. ఇవన్నీ చేస్తామంటే చంద్రబాబుకు భయం, వణుకు పుడుతోందని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు ట్విట్టర్‌లో స్పందిస్తున్నారని, రైతులు వీరి ట్విట్టర్‌ చూస్తారా అని ప్రశ్నించారు.  మీరు ప్రజలను మభ్యపెట్టారని తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడినట్లుగా లేదు చంద్రబాబు వ్యవహారమని ఫైర్‌ అయ్యారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ అర్హత పత్రాలు ఇచ్చి దగా చే శారని విమర్శించారు. దేశానికి తిండిపెట్టే రైతును మోసం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్నీ కూడా 40 రోజుల్లోనే అమలు చేశారన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిని తప్పనిసరిగా బయటకు తీస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయించాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండు చేశారు.

 

Back to Top