బాబు సొంత పుత్రుడితో దీక్ష.. దత్తపుత్రుడితో లాంగ్‌ మార్చ్‌

టీడీపీతో పవన్‌ ఐదేళ్లుగా లాంగ్‌ మార్చ్‌ చేస్తూనే ఉన్నాడు

ఇసుక కొరత వచ్చిందని బాబు, లోకేష్, పవన్‌లకు సంతోషం

కార్మికులపై అప్పుడు లేని ప్రేమ.. ఇప్పుడెందుకో..

చంద్రబాబు ఎజెండా అమలు చేయడానికే కపట ప్రేమ

వరదలోంచి ఇసుక ఎలా తీయాలో లక్షల పుస్తకాలు మేధావి చెప్పాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉంటే ఇసుక ఎలా తీస్తారో లక్షల పుస్తకాలు చదివిన మేధావి, ఆయనకు వంతపాడే అనుభవజ్ఞాని చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ మాత్రం సంతోషంగా ఉన్నారన్నారు. రాజకీయం చేయడానికి ఒక పాయింట్‌ దొరికిందని, ఏదో విధంగా బురదజల్లవచ్చని వారు ఆనందపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేష్‌తో నాలుగు గంటల దీక్ష చేయిస్తే.. విశాఖలో దత్తపుత్రుడు పవన్‌తో లాంగ్‌ మార్చ్‌ చేయిస్తున్నాడన్నారు. లాంగ్‌ మార్చ్‌ కొత్తగా చేసేది ఏమీ లేదని, బాబుతో కలిసి ఐదేళ్లుగా పవన్‌ లాంగ్‌మార్చ్‌ చేస్తూనే ఉన్నాడన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి మొదలుకొని కుంధూ వరకు నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా రాష్ట్రం ఆకుపచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. చివరకు కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం కూడా వరదలను చూసింది. ఒక పక్క ఈ పరిస్థితులు చాలా సంతృప్తికరంగా ఉన్నా.. మరోవైపు దీని వల్ల ఇసుక కొరత ఏర్పడింది. డిమాండ్‌కు సప్లయ్‌కు మధ్య అంతరం ఉన్న మాట అందరికీ తెలుసు. వరదలు ఎప్పుడైతే తగ్గుతాయో.. తగ్గిన వెంటనే ఏ విధంగా ఇసుకను తీయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఇసుక కొరత వచ్చిందని చంద్రబాబు, లోకేష్, పవన్‌లు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఒక పాయింట్‌ దొరికిందని సంబరపడిపోతున్నారు. గుంటూరులో సొంత పుత్రుడితో దీక్ష చేయించి.. దత్తపుత్రుడితో విశాఖలో లాంగ్‌ మార్చ్‌ చేయిస్తున్నాడు. లాంగ్‌ మార్చ్‌ కొత్తగా చేసేది ఏముంది.. బాబుతో కలిసి ఐదేళ్ల నుంచి పవన్‌ లాంగ్‌ మార్చ్‌ చేస్తూనే ఉన్నాడు. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు జనసేనతో కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీల కార్యదర్శలు లాంగ్‌ మార్చ్‌కు రావడం లేదని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరుకాలేమని చెప్పినట్లుగా వార్తల్లో చూశాం. మిగిలింది పవన్, చంద్రబాబు, వీరిద్దరూ కలిసి విశాఖ వీధుల్లో మార్చ్‌ చేయడానికి చూస్తున్నారు. పవన్‌ కార్యక్రమానికి టీడీపీ నేతలు జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.

వరదలు వస్తుంటే ఇసుక ఎలా తీయగలుగుతారనే కనీస ఆలోచన కూడా చంద్రబాబు, పవన్‌లకు లేదు. మూడు రోజుల క్రితం రాజమండ్రిలో ఇసుక తీయడానికి ప్రయత్నిస్తే.. లారీ కూరుకుపోయింది. ఏదో విధంగా తీయాలని ప్రయత్నిస్తే.. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో చూశాం. ఆ దోపిడీని అరికట్టాలని, సీఎం వైయస్‌ జగన్‌ నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్న క్రమంలో వరదలు వచ్చాయి. దాదాపు 267 రీచ్‌లకు అనుమతి ఇస్తే.. కేవలం 60 రీచ్‌లలో మాత్రమే తీయగలుగుతున్నారు. వాగుల్లో, వంకల్లో, చిన్న కాల్వల్లో ఇసుక ఉంటే స్థానిక అధికారుల అనుమతితో తీసుకోవచ్చు అని చెప్పాం. కానీ రాజకీయ లబ్ధికోసమే ప్రయత్నించే చంద్రబాబు, పవన్‌ కుట్రలు చేస్తూనే ఉన్నారు.

అప్పుడెందుకు ప్రశ్నించలేదు...

– సింగరేణి గనులు తవ్వినట్లుగా చంద్రబాబు హయాంలో ఇసుకను నదుల్లో తవ్వారు. ఇసుక దోపిడీని అరికట్టేందుకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే చంద్రబాబు కేబినెట్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చాడు. ఆ రోజు పవన్‌కు దీక్ష చేయాలని అనిపించలేదా..?
– 2017లో అప్పటి విశాఖపట్నం భవన నిర్మాణ సంస్థకు చెందిన అసోసియేషన్‌ అధ్యక్షుడు.. విపరీతమైన ఇసుక మాఫియా జరుగుతుంది. దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పాడు. అప్పడూ పవన్‌ పట్టించుకోలేదు.
– తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఇసుక మాఫియాపై వార్త రాస్తే ఆ విలేకరిపై దాడి చేసి వేధింపులకు గురిచేశారు. అప్పుడూ పవన్‌ మాట్లాడలేదు.
– ఫిబ్రవరిలో భవన నిర్మాణ కార్మికులంతా కలిసి చలో కలెక్టర్‌ అని కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్మికులకు రావాల్సిన రూ.900 కోట్లు చంద్రబాబు దారి మళ్లించాడని ధర్నా చేస్తే సంఘీభావం తెలపడానికి పవన్‌కు నోరు రాలేదు. భవన నిర్మాణ కార్మికుల నిధులను పక్కదారి పట్టించి చంద్రన్న బీమా అని మలుచుకుంటే నోరు విప్పలేదు.
– ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికివదిలేశారని రాజ్యసభలో కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ ప్రకటన చేశారు. అప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పవన్‌ మాట్లాడలేదు.
– రూ.1543 కోట్ల భవన నిర్మాణ కార్మికుల డబ్బును కేవలం రూ. 400 కోట్లు ఇచ్చి మిగతాది చంద్రబాబు దారి మళ్లించాడు.. అది పవన్‌కు తప్పు అనిపించలేదా..?
– తూర్పుగోదావరి జిల్లాలో కోరుమిల్లి అనే ప్రాంతంలో ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలను డ్వాక్రా మహిళలు అడ్డుకుంటే సాక్షాత్తు తెలుగుదేశం శాసనసభ్యుడు వారి అనుచరులతో కలిసి పోలీసులతో లాఠీ చార్జీలు చేయించిన సంఘటనలు ఎవరూ మర్చిపోలేదు. అప్పుడు కూడా పవన్‌కు మాట్లాడే ఆలోచన రాలేదు.
– ఏర్పేడు మండలంలో ఇసుక లారీలతో 17 మందిని తొక్కించారని పెద్ద వార్తలు వస్తే ఆ రోజు ఎక్కడైనా పవన్‌ మాట్లాడాడా..? అదే జిల్లాలో 17 వందల ఎకరాల దళితులు, బలహీనవర్గాలకు చెందిన భూమిని ఇసుక మాఫియా ధారాదత్తం చేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ రోజు పవన్‌కు వెళ్లడానికి మనసు రాలేదు. కార్మికులపై ప్రేమ ఉంటే వీటన్నింటిపై పవన్‌ కల్యాణ్‌ స్పందించాలి కదా..?

చంద్రబాబు ఎజెండా అమలు చేయడానికి పవన్‌కు కార్మికులపై ప్రేమ పుట్టుకొచ్చింది. దేశ చరిత్రలో ఎవరూ ప్రతిపక్షాన్ని తిట్టి ఉన్న సంఘటనలు ఉండవు. కానీ పవన్‌ కల్యాణ్‌ 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ జగన్‌ను తిట్టారు. మళ్లీ ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌పై మళ్లీ రాజకీయ దాడి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ ఒక్కటేనని ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమన్నారు. వరదల్లోంచి ఇసుక ఎలా తీయాలో లక్షల పుస్తకాల చదివిన మేధావి, అనుభవజ్ఞాని తెలియజేయాలని మంత్రి కన్నబాబు కోరారు.

Read Also:పవన్‌ది లాంగ్‌ మార్చా..? రాంగ్‌ మార్చా?

Back to Top