అన్నదాతకు వెన్నుదన్నుగా..

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి

జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం 

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

అమరావతి: అన్నదాతకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. జూలై 8వ తేదీ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిన రైతు దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవంలా జరపాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జూలై 8న ఈ ఉత్సవం కొనసాగుతుందన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం జమ్మలమడుగులో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొంటారన్నారు. సీఎం చేతుల మీదుగా ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణం చేసిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు ప్రకటించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. రైతు భరోసా, ఉచిత బోర్లు, వడ్డీలేని రుణాలు, పంట బీమా, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల బీమా, ప్రమాదాల బారినపడిన రైతులకు బీమా ప్రకటించడం జరిగిందన్నారు.  అదేవిధంగా శనగ రైతులు మార్కెట్‌ పడిపోయి సరుకంతా గోదాములో ఉండి బ్యాంకులు జప్తు చేసే పరిస్థితి వస్తే ఒక్క క్వింటాల్‌కు రూ. 15 వందలు అదనంగా ఇచ్చి ఒక రైతుకు సుమారుగా రూ. 45 వేల వరకు మేలు చేసేలా కార్యక్రమాన్ని ప్రకటించారన్నారు. పామాయిల్‌ రైతులకు తెలంగాణతో సమానంగా మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విత్తన సేకరణలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్షణమే కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించడం జరిగిందన్నారు.

 

Back to Top