వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం లేదు

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేశారు

చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారు

అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే యత్నం

ప్రాజెక్టుల్లో కెపాసిటీని బట్టి నీటిని నిల్వ చేస్తారు

నీళ్లన్ని వదిలి ఉంటే ప్రాజెక్టులు ఖాళీ అయ్యేవి

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

విజయవాడ: వరదల వల్ల ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. వరదలపై చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లు వరద నీటిని వదిలేసి ఉంటే ఈ రోజు డ్యాముల్లో నీరు ఉండేది కాదన్నారు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామని, ఈ మాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో శనివారం అనిల్‌కుమార్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు.

ప్రెస్ మీట్లో చం ద్రబాబు చెప్పిన ప్రతి అంశంపై వివరణ ఇస్తామన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో వరద నీటిని నిల్వ చేసుకోగలిగిందన్నారు. మీడియా సమావేశంలో గంట సేపు చంద్రబాబు  అబద్ధాలు పదే పదే చెప్పారన్నారు. జులై 29నాటికి 419 టీఎంసీలు మూడు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉందని, ఆగస్టు 3వ తేదీ శ్రీశైలానికి వరద వస్తే 6వ తేదీ నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని వదిలారని చెప్పారు. శ్రీశైలం జలాశయానికి వచ్చిన 890 టీఎంసీల వరద నీటిని చంద్రబాబు చెప్పినట్లుగానే 580 టీఎంసీలు నింపుకున్నా..దాదాపు 300 టీఎంసీలుపైగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరివ్వాలంటే పోతిరెడ్డిపాడు 474 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ ద్వారా ఇబ్బందులు లేకుండా 2,500  క్యూసెక్కులు , ఇలా రెండు కలిపితే 3 వేల క్యూసెక్కుల నీరు అవుతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు 20 రోజుల్లో ఆ మొత్తం నీరు తీసుకున్నా కూడా 80 టీఎంసీలు మాత్రమే అవుతాయన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.."శ్రీశైలానికి వచ్చిన వరద నీటిని వెంటనే వదిలి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు'' అన్నారని గుర్తు చేశారు. ఆగస్టు 3వ తేదీ నుంచి సీడబ్ల్యూసీ వివరాలు మీడియా ముందు ఉంచారు. 881 టీఎంసీలు వస్తేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.  ప్రాజెక్టులు అన్నీ కూడా పటిష్టంగా ఉంటేనే ఈ నీటిని తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ 886 అడుగులు ఉండాలన్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు వదిలేసి ఉంటే ఏ విధంగా రాయలసీమకు నీరిచ్చేవాళ్లమని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 845 అడుగుల వద్ద కేవలం కేవలం వెయ్యి క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమన్నారు. నీళ్లన్ని దిగువకు వదిలేసి ఉంటే రాయలసీమకు నీరిచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. జూరాల, అల్మట్టి డ్యామ్‌లు ఒక హెచ్చరిక బోర్డు పెట్టుకొని దిగువకు నీటిని వదులుతారన్నారు. 9వ తేదీన 878 అడుగులు నిండిన తరువాత శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామన్నారు. నాగార్జున సాగర్‌ నుంచి 546 అడుగులు దాటిన తరువాత నీటిని వదలాల్సి ఉందన్నారు. 12వ తేదీ ఉదయం నాగార్జున సాగర్‌ నుంచి నీటిని వదిలామన్నారు. పులిచింతల నుంచి నీటిని వదిలి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. 12వ తేదీ పులిచింతల స్టోరేజీ 3.3 టీఎంసీలు అయితే నాగార్జున సాగర్‌ నుంచి పులిచింతలకు నీరు రాకముందే 12800 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. 13వ తేదీన ప్రకాశం బ్యారేజి గేట్లను ఎత్తామన్నారు.

గత ఎనిమిది రోజుల పాటు దాదాపు 8 లక్షల శ్రీశైలం నుంచి విడుదల చేశామన్నారు. రెండు రోజులు మాత్రమే 7 లక్షల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. నాగార్జున సాగర్‌లో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఉంటే వరదను అరికట్టే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిపారు. 13వ తేదీన 250, 14వ తేదీన 290 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. రోజు వచ్చే ఫ్లో చూస్తే 6 లక్షల క్యూసెక్కులు ఉండేదన్నారు. ప్రతి రోజు 70 టీఎంసీలు వస్తుంటే..మూడు రోజుల్లో సాగర్‌ నిండే అవకాశం ఉందన్నారు. ఈ నీటిని వదిలేసి ఉంటే నీటి నిల్వ పెరిగేదా? తగ్గేదా అని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలా? వద్దా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి మొదటిసారిగా 42 వేల క్యూసెక్కులు తీసుకున్నది చరిత్రలో మొదటి సారి అని గుర్తు చేశారు. విస్తరణ పనులు పూర్తి కాకపోయినా ఈ స్థాయిలో నీటిని తీసుకున్నామన్నారు. వెలుగోడు బ్యాలెల్సింగ్‌ రిజర్వాయర్‌లో 14 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. గోరుకల్లు రిజర్వాయర్‌లో 7 టీఎంసీలు, అవుకు, గండికోట రిజర్వాయర్‌కు నీటిని తరలించామని చెప్పారు.

గండికోట నుంచి రేపు నీటిని విడుదల చేయబోతున్నామని తెలిపారు. సోమశిలలో 13 టీఎంసీల నీరు ఉందన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు కనిపిస్తున్నాయో లేదో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా గతంలో పని చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. పులిచింతలకు వచ్చిన నీరు వచ్చినట్లు వదిలి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చంద్రబాబు అంటున్నారన్నారు.  ప్రకాశం బ్యారెజీలో 3 టీఎంసీలు ఉండగా 6 టీఎంసీలు ఉంచారని చంద్రబాబు అన్నట్లు తెలిపారు. దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన తరువాత ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎక్కి ప్రవహించిందన్నారు. దాన్ని నిల్వ చేయడం అని ఎలా అంటారని నిలదీశారు. నీటిని నిల్వ చేసి నా ఇల్లు ముంచారని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు పదే పదే తనను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారని, పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నది నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. 1999లో శ్రీశైలంలోని పవర్‌ హౌస్‌ ముంచిన విషయం నేర్చుకోవాలా అన్నారు. ఇప్పుడు వచ్చిన  వరదలకు ఒక్క పశువు కూడా చనిపోలేదని, ప్రాణ నష్టమే లేదన్నారు. కొన్ని ఇళ్లు నీట మునిగాయి. పంటలు నీట మునిగాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top