సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

మహిళల రక్షణ, భద్రతకు వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు

దశలవారీగా మద్య నిషేధం వైపు అడుగులు

మహిళల జీవితాల్లో మార్పు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతి అని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల జీవితాల్లో మార్పులు తెచ్చే నిర్ణయాలను సీఎం తీసుకుంటున్నారని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు సంబంధించి ఏదైనా నేరం జరిగిన తరువాత మహిళా కమిషన్‌ వస్తుందన్న భావన పోవాలని, నేరం జరుగకముందే, నేరం జరుగకుండా ఈ సమాజంలో మహిళా కమిషన్‌ కొన్ని చర్యలు తీసుకోగలిగిందన్న చైతన్యం తీసుకురావాలన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ యంత్రాంగంలో కదిలిక తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళా నేరాల్లో అగ్రస్థానంలో ఉండటం బాధాకరమన్నారు. కచ్చితంగా దీనిపై క్షేత్రపరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు, మహిళల పట్ల నేరాలు, దానికి కారణాలు ఏంటి? ఏం చేస్తే ఇది జరుగకుండా ఉంటుందన్నది పరిశీలించాల్సి ఉందన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఈ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను సరిదిద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మహిళలకు సంబంధించిన ఆర్థిక స్వయం శక్తికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సూచనలు చేస్తామన్నారు. ఎక్కడైనా అలసత్వం ఉంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తామన్నారు. మహిళా కమిషన్‌ రాష్ట్రంలో ఒక భావజాలపరంగా, సంస్కృతిపరంగా మార్పు తెచ్చే దిశగా అడుగులు వేస్తుందన్నారు.  

దశలవారీగా మద్యపాన నిషేధం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు తొలగించిందని చెప్పారు. మహిళలకు నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఇవాళ చంద్ర మండలానికి ప్రయాణం చేయగలుగుతున్నాం కానీ మహిళల పట్ల చిన్నచూపు బాగా పెరిగిపోతుందన్నారు. ఇంతకుముందు కంటే వివక్షత, అవమానం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఎవరిని తిట్టాలనుకున్నా మహిళలను ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. భాషా, సంస్కృతి అన్నది మారాలన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు నడుం బిగించారన్నారు. ఇంట్లో ఉండే అన్నా..చెల్లి అందరూ సమానమే అన్న భావన చిన్నతనం నుంచే కల్పించాలన్నారు. 

Back to Top