మహిళలందరికీ ‘వైయ‌స్ఆర్‌ చేయూత’

బాబును నమ్మి మోసపోయామని డ్వాక్రా సంఘాల మహిళలు కన్నీటిపర్యంతం

డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో వారిని అప్పులపాలు చేసిన చంద్రబాబు

గుదిబండగా మారిన అప్పుల మొత్తాన్ని 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇచ్చేస్తానని వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మళ్లీ తమ బతుకుల్లో వెలుగు వస్తుందని డ్వాక్రా సంఘాల ఆశాభావం

నవరత్నాలు – 7

 

చంద్రబాబు వైఖరి చూస్తుంటే ‘ఏరు దాటే వరకుఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’అన్నట్లుందంటున్నారు డ్వాక్రా మహిళలు. ‘డ్వాక్రామహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీచేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరికనిశ్చింతగా ఉండొచ్చు’ అని 2014 ఎన్నికల ముందుచంద్రబాబు ఊరూరా నమ్మకంగా చెప్పడంతో లక్షలాదిమంది మహిళలు ఆయన మాటలు నమ్మారు. తీరాఅధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తలేదు. వడ్డీతో సహాకట్టాల్సిందేనని బ్యాంకర్లు నోటీసుల మీద నోటీసులుఇవ్వడంతో పాటు అవమానాలకు గురి చేస్తోండటంతోఅధిక వడ్డీకి బయట అప్పులు తెచ్చి కడుతున్నారు.బాబు మోసంతో నిండా మునిగాం.. కాపాడండంటూకన్నీటిపర్యంతమవుతున్నారు.

అమరావతి  : రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఇప్పుడు 9.37 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు బ్యాంకులు 9.02 లక్షల లోను ఖాతాల ద్వారా రూ.21,479 కోట్లు అప్పుగా ఇచ్చాయి. చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. దీంతో అప్పట్లో చాలా సంఘాలు అప్పులు చెల్లించడం ఆపేశాయి. దీనికితోడు మహిళలు డ్వాక్రా వ్యవహారాలకు దూరంగా జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెలా రూ.21 కోట్ల మేర సంఘాల పేరిట జరగాల్సిన పొదుపు రూ.7 లక్షలకు పడిపోయింది. సంఘాల్లో మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు, ప్రతి నెలా సమావేశాల ఏర్పాటు, బ్యాంకు లోను తిరిగి చెల్లింపుల ఆధారంగా సంఘాలకు గ్రేడింగ్‌లు ఇస్తే.. 2015, 2016 సంవత్సరాల్లో దాదాపు 90 శాతం సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకే పరిమితమయ్యాయి. మరోవైపు కొత్తగా పొదుపు సంఘాలలో చేరే మహిళల సంఖ్య క్రమంగా సన్నగిల్లింది. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని అంచనా ఉండగా, పొదుపు సంఘాల్లో కేవలం 93.74 లక్షల మందే సభ్యులుగా ఉన్నారు. గత నాలుగున్నరేళ్లలో కొత్త సంఘాల్లో చేరిన సభ్యుల సంఖ్య కేవలం ఐదు లక్షలు కూడా లేకపోవడం గమనార్హం. 


జగన్‌ హామీతో మహిళలకు భరోసా
‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం కింద డ్వాక్రా మహిళల అప్పుల మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న జగన్‌ హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు పది మంది సభ్యులున్న వెంకటేశ్వర పొదుపు సంఘం పేరిట ఎన్నికల నాటికి రూ.5 లక్షలు అప్పు ఉందనుకుంటే, ఒక్కొక్కరికి రూ.50 వేల మొత్తాన్ని 4 దఫాలుగా చెల్లిస్తారు. సున్నా వడ్డీ రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఉదాహరణకు ఓ డ్వాక్రా సంఘం రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే దానికి నెల నెలా దాదాపు రూ.4 వేలు వడ్డీ అవుతుందనుకుంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఇలా బ్యాంకులకు వడ్డీ డబ్బులు చెల్లించక పోవడంతో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. వైఎస్సార్‌ పథకం వల్ల  రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళల కుటుంబాలకు దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఎన్నికల నాటికి సంఘాల పేరిట ఉండే దాదాపు రూ.22 వేల కోట్ల అప్పు డబ్బులను మహిళలకు నేరుగా అందజేసే అవకాశం ఉండగా.. జీరో వడ్డీ రూపేణా ఏటా రూ.1,200 నుంచి రూ.1,500 కోట్ల చొప్పున ఆరేడు వేల కోట్ల రూపాయల మేర మహిళలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా.   
♦ డబ్బు నేరుగా మహిళల చేతికే అందడంతో ఆ డబ్బుతో కొత్త వ్యాపారమో, పాడి గేదెలు, ఆవుల కొనుగోలు, లేదా స్వయం ఉపాధి కార్యక్రమంపై పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులో ఉన్న అప్పును దీనిపై వచ్చే ఆదాయంతో చెల్లించవచ్చు.  
♦ వ్యాపారం, స్వయం ఉపాధి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత నెలవారీ కిస్తీల చెల్లింపునకు పోను మిగిలేది కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవడం ద్వారా కొత్తగా బయట అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.   
♦ ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న లక్ష్యంతో 2005 – 07 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  పావలా వడ్డీ పథకానికి రూపకల్పన చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనమై మహిళలు పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల్లో చేరారు. రేపు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకం అమలవ్వడం ద్వారా ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడంతో పాటు, కొత్తగా పెద్ద సంఖ్యలో మహిళలు సంఘాల్లో చేరే అవకాశం ఉంటుంది. 


కోర్టు చుట్టూ తిప్పుతున్నారు..
విజయనగరం జిల్లా ఎస్‌.రాయవరం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో 40 కుటుంబాలున్నాయి. 250 మందికి పైగా జనాభా ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న వారంతా నిరుపేదలే. కూలీ పనులు చేసుకునే వారే. ఇక్కడ శ్రీచైతన్య, శ్రీదుర్గ, వెంకటేశ్వర –1,  వెంకటేశ్వర – 2 పేరిట నాలుగు డ్వాక్రా సంఘాలున్నాయి. దాదాపు 80 శాతం కుటుంబాల్లోని ఒకరిద్దరు ఈ సంఘాల్లో సభ్యులే.  2014 వరకు ఈ సంఘాలు చక్కగా పని చేశాయి. తొలుత రూ.50 వేల చొప్పున రుణాలు పొందాయి. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించేవారు. 2010 నాటికే ఒక్కో సంఘం రూ.4.50 లక్షల వరకు రుణ పరపతిని పొందే స్థాయికి ఎదిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయిపోతాయని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణ మాఫీని అట కెక్కించారు. దీంతో వడ్డీతో సహా పేరుకుపోయిన రుణ బకాయిలు తలకు మించిన భారం కావడంతో వారు చెల్లించలేకపోయారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఎస్‌.రాయవరం స్టేట్‌ బ్యాంక్‌ చివరకు కోర్టు నుంచి నోటీసులు జారీ చేయించింది. రూ.4.50 లక్షల రుణం తీసుకున్న శ్రీచైతన్య సంఘానికి రూ.9,42,098, రూ.3.60 లక్షల రుణం తీసుకున్న శ్రీ దుర్గ సంఘానికి రూ.7,36, 280, రూ.4 లక్షల రుణం తీసుకున్న వెంకటేశ్వర –1 సంఘానికి రూ.7.5 లక్షలు, రూ.4 లక్షల రుణం తీసుకున్న వెంకటేశ్వర –2 సంఘానికి రూ.7,60,645 బకాయిలున్నాయని నోటీసులు అందాయి. వెంటనే చెల్లించకపోతే జప్తు నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని అందులో హెచ్చరించాయి. ఇప్పుడు వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

చచ్చిపోయినా వదలట్లేదు
మా డ్వాక్రా సంఘానికి 2010 పాడేరు యూనియన్‌ బ్యాంకు పావలా వడ్డీపై రూ.3 లక్షలు రుణం మంజూరు చేసింది. 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తాము అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఆనందపడ్డాం. అసలు, వడ్డీ చెల్లించలేదు. 2014లో ఆయనకే ఓట్లు వేసాం. చంద్ర బాబు సీఎం అయ్యాడు. ఆరు నెలల్లోనే రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చాడు. రుణమాఫీ చేయలేదు. దీంతో వడ్డీకి చక్రవడ్డీ కలిపి తడిసి మోపెడైంది. మేము చెల్లించాల్సిన అప్పు వడ్డీతో సహా కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతం అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షల 67 వేలు చెల్లించాలని యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నోటీసులు ఇచ్చారు. చివరకు మా వ్యక్తిగత ఖాతాలో ఉన్న పొదుపు సొమ్ము రూ.19 వేలు కూడా జమ చేసుకున్నారు. మా గ్రూప్‌లో అప్పు తీసుకున్న ఓ సభ్యురాలు లలితాకుమారి చనిపోయింది. ఆమె అప్పు కూడా మిగతా సభ్యులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని నమ్మించి చంద్రబాబు చివరకు ఇలా తీవ్ర అన్యాయం చేశారు.– జంపరంగి వనజ, అధ్యక్షురాలు,ఉమా నీలకంఠేశ్వర డ్వాక్రా సంఘం, అడ్డుమండ, హుకుంపేట మండలం, విజయనగరం జిల్లా.

అప్పు కడితేకాని పుస్తెలతాడు ఇవ్వమంటున్నారు
మా ఆయన నా పుస్తెల తాడు తాకట్టు పెట్టి రూ.10 వేలు తెచ్చాడు. ఆ డబ్బులతో గేదె కొన్నాం. ఆ తర్వాత వడ్డీ రూ.2 వేలతో సహా అప్పు మొత్తం తీర్చేశాం. ఈలోగా మా ఆయన కూడా కాలం చేశాడు. మా ఆయన పెట్టిన నా పుస్తెల తాడు ఇమ్మని బ్యాంకోళ్ల దగ్గరకు పోతే.. ముందు నీ డ్వాక్రా అప్పు కట్టు.. ఆ తర్వాత నీ పుస్తెలతాడు ఇస్తామంటున్నారు. మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు. బ్యాంకోళ్లు నరకం చూపిస్తున్నారు. లక్షల్లో ఉన్న అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – గారా రమణమ్మ,శ్రీ చైతన్య డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు,వెంకటాపురం. విజయనగరం జిల్లా.

జగన్‌ వస్తే అభాగ్యులకు చేయూత
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిని చదివించలేక చదువు మాన్పించి పెద్దమ్మాయికి పెళ్లి చేసి పంపాం. ప్రస్తుతం పూట గడవని పరిస్థితితో అల్లాడిపోతున్నాం. ఇప్పుడు 65 ఏళ్లు దాటితేనే పింఛను వస్తుంది. జగనన్న వస్తే వైఎస్సార్‌ చేయూత పేరుతో 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ  నాలుగేళ్లలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తానని చెప్పడం సంతోషం. ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. మాలాంటి నిరుపేద మహిళలకు దీని ద్వారా చేయూత దొరుకుతుంది.– మీసాల ఏసమ్మ, కేశానుపల్లి, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా

బడుగు వర్గాలకు ఎంతో మేలు
వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడున్న కార్పొరేషన్ల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. పలుకుబడి ఉన్నోళ్లకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. జగన్‌ రాగానే కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి పారదర్శక ప్రమాణాలు తీసుకు వస్తారని నమ్ముతున్నాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఎంతో మేలు జరుగుతుంది. డ్వాక్రా సంఘాల వాళ్లకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం ఎంతో మంచిది.– జి.విజయసుందరి,సత్తెనపల్లి,గుంటూరు జిల్లా

ఇంతగా మోసం  చేస్తారనుకోలేదు..
ఆంజనేయస్వామి మహిళా సంఘంలో 12 మంది సభ్యులమున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో మేము చాలా సంతోషించాం. ఇక మా కష్టాలన్నీ తీరినట్లేనని సంబరపడ్డాం. మా సంఘానికి బ్యాంకులో  రూ.3.60 లక్షలు అప్పు ఉండేది. రుణమాఫీ అవుతుందని సంఘ సభ్యులందరం ఆశతో అప్పు చెల్లించలేదు. మాతో ఓట్లు వేయించుకుని చంద్రబాబు అధికారంలోకి అయితే వచ్చారు కానీ మాకు ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులో మాత్రం అసలు, వడ్డీ కలిపి రూ.4.44 లక్షలు అయ్యింది. అంతా చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశారు. గత్యంతరం లేక సభ్యులందరం బయట అప్పు తెచ్చి బ్యాంకులో కట్టాం. ప్రతి రోజు కూలి పని చేసుకొని కష్టపడి సంపాదించిన సొమ్మంతా వడ్డీకే సరిపోతోంది. బయట తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతూనే ఉన్నాం. అసలు ఎప్పుడు చెల్లిస్తామో తెలీదు. బతకడం కష్టమైంది.– ఆంజనేయస్వామి మహిళా సంఘం సభ్యులు, యర్రగుంట్ల, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా.   

అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటా 
♦ 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రాఅక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం.
♦ మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును అక్కచెల్లెమ్మల తరఫున మేమే బ్యాంకులకు కడతాం. ‘వైఎస్సార్‌ ఆసరా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తాం. 
♦ 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు పెన్షన్‌ ఇస్తామంటే కొందరు వెటకారం చేశారు. అందులో
ఉన్న స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయారు. అయినా వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని తీసుకొస్తున్నాం.
♦ వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కలందరికీ తోడుగా ఉంటాం.
♦ ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా,
♦ కొందరికో అరకొరగా ఇస్తూ.. అది కూడా లంచం లేనిదే ఇవ్వనిపరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకొస్తాం.
♦ 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ఈ పథకం ద్వారా రూ.75,000 ఉచితంగా ఇస్తాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఈ మొత్తాన్నిఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందజేస్తాం.   – వైఎస్‌ జగన్‌

తాజా వీడియోలు

Back to Top