బాబూ..అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో చెబుతారా?

40 ఏళ్ల నాటి ముచ్చట గురించి చెప్పిన మాటలు అవకాశవాదానికి పరాకాష్టండీ! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: టీడీపీని స్థాపించినప్పుడు చంద్ర‌బాబు ఏ పార్టీలో ఉన్నీరో చెబితే జనం సంతోషిస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌.టి.రామారావు 40 ఏళ్ల క్రితం 1983 జనవరి 9న తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నాయుడు సోమవారం గుర్తుచేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ కార్యక్రమంలో చెప్పిన మాటలు ఆయన స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. ‘నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలను చూసిన ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు,’ అని చంద్రబాబు సెలవిచ్చారు. నిజానికి ఏపీలో అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌–ఐలో చంద్రబాబు సభ్యుడు. టీడీపీ స్థాపన సమయంలో (1982 మార్చి) ఆయన కాంగ్రెస్‌ మంత్రివర్గంలో మంత్రి. 1983 జనవరి మొదటి వారంలో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్న చంద్రబాబు తన మామ గారి పార్టీలో వెంటనే చేరలేదు. అంతేకాదు, ‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే నా మామ ఎన్టీఆర్‌ పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయడానికి నేను సిద్ధమే,’ అని నాటి యువ మంత్రి నారా వారు ప్రకటించారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాతే చంద్రబాబు టీడీపీలో తెర వెనుక ‘కీలక’ పాత్ర పోషించడం మొదలుబెట్టారు. తాను సహాయ మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారనీ, అందుకే ఎన్టీఆర్‌ తెలుగుదేశం ప్రారంభించారని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు మరి అప్పుడు అలాంటి ‘దుర్మార్గ ప్రభుత్వం’ నుంచి ఎందుకు వైదొలగలేదో చెప్పకపోవడం విశేషం. టీడీపీ స్థాపన ద్వారా తెలుగు ప్రజలను ఎన్టీఆర్‌ కాపాడారని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. మరి అదే నిజమైతే ఆయన వెంటనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరాల్సింది. కాని, ఆ పనిచేయకుండా–‘నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం స్థాపన చరిత్రాత్మక సందర్భం’ అని ఇప్పుడు టీడీపీ చివరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్ణించడం అవకాశవాదానికి పరాకాష్ట. తెలుగుదేశం స్థాపన సమయంలో దానిపై అవాకులు చెవాకులు పేలిన చంద్రబాబు గారు ఇప్పుడు ఈ పరిణామాన్ని గొప్పగా ప్రశంసించడం ఏపీ రాజకీయ చరిత్ర తెలిసినోళ్లను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించినప్పుడు తాను కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం, ఆ పార్టీలో కొనసాగడం తప్పేనని ఇప్పుడైనా చంద్రబాబు ఒప్పుకుంటే జనం ఆయనను మెచ్చుకుంటారు. అంతేగాని, తాను 40 సంవత్సరాల క్రితం విమర్శించిన పార్టీ ఆవిర్భావాన్ని ఆ పార్టీ ‘జాతీయ అధ్యక్షుడి’ హోదాలో చంద్రబాబు పొగడడం– వయసుతోపాటు ఆయన ఏ మాత్రం మారలేదని రుజువుచేస్తోంది. కనీసం నవ్యాంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందైనా–టీడీపీతో మొదటి నుంచీ తనకు ఉన్న సంబంధాలు, ఆ పార్టీలో చేరిన పద్ధతి గురించి చంద్రబాబు వెల్లడిస్తారని భావించడం అత్యాశే అవుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top