వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల జయకేతనం

అమ‌రావ‌తి:  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వాను త‌ట్టుకొని వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డికి  99,774 ఓట్లు రాగా.. 6,619 ఓట్ల మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 93,155 ఓట్లు లభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 68,170 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 48,832 ఓట్లు వచ్చాయి.

 
అరకు అసెంబ్లీ వైయ‌స్ఆర్‌సీపీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మత్స్యలింగంకు 65,658 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోశన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డికి 12,805 ఓట్ల మెజార్టీ లభించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బూసినె విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, రీకౌంటింగ్‌ చేయాలని టీడీపీ ఏజెంట్లు పట్టుబట్టారు. ప్రతీ రౌండ్‌లోనూ ఏజెంట్లు సంతకాలు చేశాకే.. ఆ తర్వాతి రౌండు లెక్కించారు. దీంతో ఎన్నికల అధికారి సృజన రీకౌంటింగ్‌ను తిరస్కరించారు. తంబళ్లపల్లెలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి టీడీపీ నుంచి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

వైయ‌స్‌ జగన్‌ ఘన విజయం 
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు ఎదురే లేదని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 1,77,580 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో వైయ‌స్‌ జగన్‌కు 1,16,315 (65.50 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్‌ రవిపై 61,687 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 54,628 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డికి 10,083 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండులోనూ వైయ‌స్‌ జగన్‌ తన ఆధిక్యతను చాటుకోవడం విశేషం. పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో వైయ‌స్ఆర్ కుటుంబం ఎంతో కృషి చేసింది. అందుకే పులివెందులలో వైయ‌స్ఆర్  కుటుంబానికి ప్రజలు 1978 నుంచి పట్టం కడుతూనే ఉన్నారు.

కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
 యర్రగొండపాలెం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.య‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్‌ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.

అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.

 తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్‌ వదిన, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు.

కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి..

 తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి
 మంత్రాలయం: యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి నాల్గవ సారి సైతం విజయ బావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి ఎన్‌ రాఘవేంద్ర రెడ్డి గట్టెక్కలేకపోయారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి మధ్య ప్రధాన పోటీ సాగింది. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 2,08,350 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు, 1,02,155 మంది, మహిళలు 1,06,172 మంది , ఇతరులు 23 మంది ఉన్నారు. అందులో 1,76,077 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 84.51 శాతం పోలింగ్‌ నమోదైంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి. విశ్వనాథ్‌ నేతృత్వంలో ఓట్ల లెక్కింపు సాగింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌటింగ్‌ మొదలైంది. 

17 రౌండ్ల గణన ప్రక్రియ జరిగింది. మొదటి రౌండ్‌లో టీడీపీ 341 ఓట్ల మెజార్టీతో బోణీ చేసుకుంది. తక్కిన రౌండ్లలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగించింది. 17వ రౌండ్‌ ముగిసిన సమయానికి 12,805 ఓట్ల మెజార్టీతో బాలనాగిరెడ్డి విజయం సాధించారు. మంత్రాలయం నుంచి విజయం సాధించిన వై. బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్‌. రాఘవేంద్ర రెడ్డికి 74,857 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి మురళీ కృష్ణంరాజుకు 4,660 ఓట్లు , బీఎస్పీ అభ్యర్థి గుడిపి సామేల్‌కు 3589 ఓట్లు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఆర్‌. రాఘవేంద్ర రెడ్డికి 608 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఎం. రాఘవేంద్ర రెడ్డికి 624 ఓట్లు, కె. నాగిరెడ్డికి 353 ఓట్లు, సి. పరమేష్‌కు 297 ఓట్లు , నోటాకు 2,674 ఓట్లు వచ్చాయి.

-

 

నాలుగు ఎంపీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం
రాష్ట్రంలో నాలుగు లోక్‌స‌భ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. వరుసగా మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికై వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్‌ సాధించారు. కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైయ‌స్‌ అవినాష్‌రెడ్డికి 5,97,101 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి 5,31,611 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. అవినాష్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్‌రెడ్డిపై 65,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బద్వేలు, పులివెందుల నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భూపేష్‌ ఆధిక్యత సాధించారు.

మాజీ సీఎం నల్లారిపై మిథున్‌రెడ్డి జయకేతనం
రాజంపేట వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి,  బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని మట్టి కరిపించారు. దాదాపు 76,071 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లు మిథున్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్టు కనిపించింది. తొలిసారిగా మిథున్‌రెడ్డి 2014లో 1,74,062 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన ఓడించారు. 2019లో మిథున్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజార్టీ సా«ధించారు. ముచ్చటగా మూడోసారి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విజయబావుటా ఎగురవేశారు.

తిరుపతి ఎంపీగా గురుమూర్తి
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. మద్దిల గురుమూర్తికి 6,32,228 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 6,17,659 ఓట్లు పోలయ్యాయి. ఎంపీ మద్దిల గురుమూర్తి 14,569 మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.

అరకు ఎంపీగా తనూజారాణి
అరకు లోక్‌సభ స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గుమ్మ తనూజారాణి విజయకేతనం ఎగురవేశారు. అరకు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు తనూజారాణి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనూజారాణికి 4,77,005 ఓట్లు రాగా, కొత్తపల్లి గీతకు 4,26,425 ఓట్లు లభించాయి.

Back to Top