దశ వసంతం

ఘనమైన చరిత్రకు శ్రీకారం..వైయస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రస్థానం

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటికి పదేళ్లు

నాడు ఇద్దరితో ప్రారంభం..నేడు పార్లమెంట్‌లో అతిపెద్ద నాలుగో పార్టీ 

దేశానికే దిక్కూచిగా నిలిచిన పార్టీ అధినేత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌: దేశ రాజకీయాల్లో విప్లవం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం... కాంగ్రెస్ అనే భారతదేశ అతిపెద్ద పార్టీకి నూట పాతికేళ్ల నిండు చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని పెను సవాలు. ఇవన్నీ యెడుగూరి సందింటి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి  పర్యాయ పదాలు. జాతీయ పార్టీని ఎదురించి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తల్లి  వైయస్‌ విజయమ్మతో కలిసి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్థాపించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు మహా వృక్షంగా ఎదిగింది. ఈ వృక్షం కింద ఎందరికో రాజకీయ భవిష్యత్‌ ఇస్తోంది. మార్చి 11, 2011న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాది వద్ద ప్రారంభమైన పార్టీ నేడు పార్లమెంట్‌లోనే అతిపెద్ద పార్టీల సరసన చేరింది. 

వైయస్‌ జగన్‌ అంటే జనం..జనం అంటే వైయస్‌ జగన్‌
జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. తన తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నవాళ్లు ఆ చెట్టు మీదే రాళ్లేస్తుంటే సహించలేకపోయిన నిజమైన వారసుడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇసుమంతైనా తెలీని శక్తులు తనపైనా, తన విశ్వాసాలపైనా ఆధిపత్యం చెలాయించబోతే ఎదురు తిరిగిన నిజమైన విప్లవకారుడు. అందుకే ఇపుడాయన హీరో. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానిస్తున్న నిజమైన కథానాయకుడు. ఈ రోజు ఆయన ఒక శక్తి. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి లేరు... ఇక తమని ఆపేవారెవరు..? అని గంతులేయబోయిన దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. ఇపుడు ఆయన పేరు తలవనిదే ఆయనను అభిమానించే వారికే కాదు శత్రువులకూ రోజు గడవదు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా పదేళ్లు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ విజయమ్మతో ప్రారంభమైన ఓ ప్రాంతీయ పార్టీ నేడు దేశంలోని అతిపెద్ద పార్టీల సరసన చేరింది. రాష్ట్ర చరిత్రలోనే 51 శాతం ఓట్లు, 80 శాతం పైగా సీట్లతో 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలతో, భారత లోకసభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఈ తొమ్మిది నెలల్లోనే చారిత్రాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక చట్టాలు చేసి ప్రజా రంజక పాలన అందించి బెస్ట్‌ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు అన్నింటి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్మాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతిని రూపుమాపేందుకు రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థను తీసుకువచ్చారు.  సంక్షేమ పథకాలను గడప వద్దకే చేర్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నారు. అధికార వికేంద్రీకరణ నిర్ణయంతో ముందుకు వెళ్తున్న వైయస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. దటీజ్‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి..ఇటీజ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటూ పార్టీ శ్రేణులు కాలర్‌ ఎగిరేస్తున్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత నేను వేసిన ప్రతి అడుగులో నా వెన్నంటే నిలిచిన లక్షలాది వైయస్ఆర్ సీపీ శ్రేణులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. రాజన్న ఆశయాల కోసం పుట్టిన ఈ పార్టీలో మీ అందరితో కలిసి పయనించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చింది.. రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషిచేసి.. మీ అందరూ నా పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేందుకు పాటుపడతాను.

- వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి
 

Back to Top