అన్నకు తోడుగా చెల్లెమ్మ

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఏడేళ్లు పూర్తి

వైయ‌స్ షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం 
 
 మొదటిసారి పాదయాత్ర చేసిన మహిళగా చరిత్రకెక్కిన షర్మిల   

 శ్రీ‌కాకుళం: కుటిల రాజకీయాలు జఠిల సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఒంటరిని చేసి వేధిస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్న కు అండగా, కుటుంబానికి తోడుగా, పార్టీకి ఓ ధైర్యంగా ఓ అతివ అడుగులు వేశారు. తండ్రి చూపిన బాటలో రాష్ట్రమంతా కలియదిరిగారు. అన్న పెట్టిన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి తన నడకతోనే ఇంధనం నింపారు. ఆమే వైఎస్‌ షర్మిల. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. చెల్లెమ్మలకు అండగా ఉండే అన్నల కథలు అందరికీ తెలిసినవే. కానీ అన్నకు బలంగా నిలిచిన చెల్లెలి కథ ఆమెది.

మ‌హానేత వైయ‌స్  రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించారు. అది మొదలు ఆయనపై కుట్రలు మొదలైపోయాయి. ఒక్కడినే చేసి అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధాన దాడు లు చేయడం మొదలుపెట్టాయి.  అలాంటి దుర్మార్గ, దుశ్చర్యలకు నిరసనగా అన్నకు తోడుగా నిలిచి జగనన్న విడిచిన బాణంగా ప్రజల మధ్య నడిచి నాయకులకు భరోసా కలిగించింది వైఎస్‌ షర్మిల. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్న వదిలిన బాణంలా అన్ని గ్రామాలు కలియదిరిగారు. 2012 అక్టోబర్‌ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు.

 

నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్‌సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top