నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  

అందుకే నా భద్రతను భారీగా కుదించారు 

3–6–24 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి

హైకోర్టులో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌  

నాకున్న ప్రాణహానిని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు 

టీడీపీ నేతల బహిరంగ బెదిరింపులనూ పరిగణనలోకి తీసుకోలేదు 

నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు 

ఇంటి వద్ద, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు 

దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులే ఉన్నారు 

ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం కూడా సరిగ్గాలేదు 

నా సొంత బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం వాడుకుంటానన్నా అనుమతివ్వలేదు 

వారిచ్చిన వాహనాన్నే వాడాలని చెప్పారు

అమరావతి: గతంలో తనకున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. 

అంతేగాక.. పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్‌ అసాల్ట్‌ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. వైయ‌స్‌ జగన్‌ తన పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే..  

నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. 
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్‌ ప్లస్‌ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది. 

ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది. 

నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. 

వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడంవల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్‌పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. 

ఈ విషయంలో టీడీపీ సీనియర్‌ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు.  

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భద్రత కుదింపు.. 
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. అందులో భాగంగానే నాపై ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయి దాడి జరిగింది. గతంలో నాపై కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నింటి దృష్ట్యా నాకు 3–6–2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయండి.  

నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు..
రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్‌ ప్లస్‌ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు. 

నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్‌ ఆక్టోపస్‌ టీమ్స్‌ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. 

గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్‌ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. 

వెనుక డోర్‌ తెరు­చుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితిలేదు. మధ్యలో ఆగి­పోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్య­­లో ఆగిపోవడంతో పర్యటనను అ­ర్థాం­­తరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్‌ప్రూఫ్‌ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతినివ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు.   

Back to Top