జీవనాడికి జవసత్వాలు..

నేడు జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో కలసి పోలవరం పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

టీడీపీ సర్కార్‌ ప్రణాళికా రాహిత్యంతో దెబ్బతిన్న ఈసీఆర్‌ఎఫ్‌ డయాఫ్రమ్‌ వాల్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌

డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పనుల పూర్తికి చర్యలు

  అమరావతి: ఉత్తుంగ గోదావరిపై ఎనిమిది దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. స్పిల్‌ వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌తో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. జలాశయం, అనుసంధానాల పనులు 80.6 శాతం, కుడి కాలువ పనులు 92.57 శాతం, ఎడమ కాలువ పనులు 71.11 శాతం పూర్త య్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పను లు 20.19 శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68 శాతం పనులు పూర్తయ్యాయి.

గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి లేమితో చేపట్టిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డయాఫ్రమ్‌ వాల్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ 2019, 2020లో గోదావరి వరద ఉధృతికి కొంత భాగం దెబ్బతింది. కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్, జెట్‌ గ్రౌటింగ్‌లను డ్యా మ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్, సీడబ్ల్యూసీ మార్గదర్శ కా ల మేరకు బాగుచేసి జలాశయాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీడ బ్ల్యూసీ, ఆర్‌సీసీ (రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ) ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

వైయ‌స్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌..
సీఎంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్‌ 20న పోల వరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలు త వరద మళ్లించే స్పిల్‌ వేను పూర్తి చేసి తర్వాత కాఫర్‌ డ్యామ్‌లు, సమాంతరంగా పునరావాస పను లు, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరద సమయంలోనూ పనులు కొనసాగించడం ద్వారా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. టీడీపీ సర్కార్‌ నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన ప నులను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షించారు. తాజాగా శుక్రవారం రోజు ఐదోసారి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పోలవరం పనుల పరిశీలనకు తొలిసారిగా రానుండటం గమనార్హం.


ప్రణాళికాయుతంగా పనులు..
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు తీయించింది. స్పిల్‌వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాదే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. గతేడాది జూన్‌ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్, స్పిల్‌వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ మీదుగా 6.6 కి.మీ. పొడవున మళ్లించింది. జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్‌ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. 

పునరావాసంపై ప్రత్యేక దృష్టి..
పోలవరంలో పునరావాసం, భూసేకరణకు రూ.35,669.08 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం లెక్కించగా.. అది రూ.33,163.28 కోట్లుగా సీడబ్ల్యూసీ తేల్చింది. టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలో అతి కష్టమ్మీద 1,846 ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 4,505 కుటుంబాలకు పునరావాసం కల్పించి రూ.6,654.39 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 38.41 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. తక్కువ ధరకే 960 మెగావాట్ల జలవిద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, ఉత్తరాంధ్ర తాగునీటి కష్టాలు తీర్చవచ్చు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top