సంచలనాత్మక నిర్ణయంపై సర్వత్రా చర్చలు

 

భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసి దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రితో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి ఉండటం సాధారణమే. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉప ముఖ్యమంత్రి అన్న పదవే లేదు. తొలిసారిగా ఆంధ్రరాష్ట్రంలో 5మందికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కాక అందులో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండేలా చూసారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నికల ముందే ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించినా ఆచరణలోనూ చేసి చూపుతారని ఎవ్వరూ ఊహించలేదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఈ ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల జాబితా ఇది. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, షేక్ అంజాద్ బాషా, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పా శ్రీవాణి, కళత్తూరు నారాయణ స్వామి.

గతంలో డిప్యూటీలు

నిజానికి డిప్యూటీ సీఎం అనే పదవి ఉత్త అలంకార ప్రాయం అనే భావన ప్రజల్లో ఉంది. కొన్ని పార్టీలు అసంతృప్తుల కోసమో, కన్ని సామాజిక వర్గాల ఓట్ల కోసమే డిప్యూటీ సీఎం పదవిని ఆశ చూపడం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. వాస్తవంలో డిప్యూటీ సీఎంలకు ఎలాంటి అధికారాలూ ఉండటం లేదు. కేవలం మరబొమ్మలుగా మిగిలిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత‌్వం ఇద్దరు డిప్యూటీలను ఏర్పాటు చేసింది. కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఈ ఇద్దరూ డిప్యూటీలుగా ఉన్నా వారు తమ మార్కు చూపేలా ఏమీ చేయలేకపోయారు. అసలు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ముఖ్యమంత్రిగా ఉన్న ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అధికారాన్ని పూర్తిగా అనుభవించాలని, మరొకరికి ఆ అధికారంలో భాగం పంచకూడదని భావించేవారే ఎక్కువ. అంతేకాదు ఉప ముఖ్యమంత్రలు మరో పవర్ సెంటర్ గా తయారై ఎక్కడ పాలనకు, తమకు అడ్డంకిగా మారతారో, తమ సీటుకే ఎసరు పెడతారో అన్న భయం కూడా ఉంటుంది. అందుకే పేరుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా అధికారాలకు వారిని ఆమడ దూరం పెడతారు.

జగన్ గారి కాబినెట్ లో డిప్యూటీలకు ప్రాముఖ్యత

అయితే మాట ఇచ్చిన ప్రకారం ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులను చేసిన వైఎస్ జగన్ మోహన రెడ్డి గారు మాత్రం ఈ తరహా అలంకార ప్రాయమైన పదవులను కేటాయించలేదు. కళత్తూరు నారాయణ స్వామికి ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ కోటాలో పాముల పుష్పా శ్రీవాణి గారికి గిరిజన సంక్షేమ శాఖ, షేక్ అంజాద్ బాషా మైనారిటీ వ్యవహారాలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు, ఆళ్ల నాని గారికి వైద్య, ఆరోగ్య శాఖలను అప్పగించారు. అంటే కీలకమైన శాఖలన్నిటినీ ఉప ముఖ్యమంత్రులకు కేటాయించారన్నమాట. వివిధ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ డిప్యూటీలను చేయడం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

దేశ వ్యాప్తంగా చర్చ

యువ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం దేశం మొత్తం మీద పెద్ద చర్చనే లేవనెత్తింది. ఆయా సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యంతో ఇచ్చిన పదవుల వల్ల వారికి గౌరవం పెరగడమే కాదు, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలాగే కేంద్రంలోనూ ఉప ప్రధాని పదవిని దక్షిణాది వారికి కేటాయించడం ద్వారా ఉత్తరాది దక్షిణాది ప్రాంతాల మధ్య ఉన్న దూరాలను తగ్గించుకోవచ్చునంటూ విలేకరులు వాఖ్యానిస్తున్నారు. ఎన్నో కారణాల వల్ల దేశంలోని ఉత్తర దక్షిణ భాగాల రాజకీయాల్లో అంతులేని అగాధం ఉంది. రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయంలాగే ప్రధాని కూడా దక్షిణాది వారికి డిప్యూటీ పీఎంగా అవకాశం ఇస్తే ఈ వైషమ్యాలను తొలగించిన వారౌతారంటున్నారు కొందరు సీనియర్ జర్నలిస్టులు. ముందు ముందు  ఈ విషయంపై మరింత లోతుగా విశ్లేషణలు, చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్కు పరిపాలనతో దేశ వ్యాప్తంగా సరి కొత్త ఆలోచనలకు దారులు వేస్తున్నారనడంలో సందేహం లేదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top