చ‌దువుల విప్ల‌వం

విద్యార్థుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అండ‌

100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
 
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ  

మధ్యంతర ఫీజులను ప్రకటించిన ఉన్నత విద్యాశాఖ  

ప్రస్తుతం ఉన్న ఫీజులు పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్‌   

ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో ఊరట 

 అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం మొద‌లైంది. పేద విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌గా నిలిచారు. ‘పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం..’ అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  హామీని తు.చ. తప్పకుండా అమల్లోకి తెస్తూ బడుగు, బలహీనవర్గాలు, దళిత, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురందించారు. వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్ధుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో  38 విడుదల చేసింది. 

ఈ విద్యా సంవత్సరానికి గతేడాది ఫీజులే..
రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలపై ప్రభుత్వం నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కాలేజీ ఫీజులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించింది. విద్యా సంస్థల్లో ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఫీజులు తదితర అంశాలపై కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తోంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రమాణాల పరిశీలన, ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కోసం చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మధ్యంతర ఫీజులను ప్రకటించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు కసరత్తు
2018–19 ఫీజులే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని జీవోలో పేర్కొన్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. 

ఫీజులు 30 శాతం పెంచిన టీడీపీ సర్కారు
టీడీపీ అధికారంలో ఉండగా కాలేజీల యాజమాన్యాలకు మేలు కలిగేలా ఫీజులను 30 శాతం మేర పెంచింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసింది. అదిపోగా మిగతా భారం మొత్తం విద్యార్ధి భరించాల్సి వచ్చేది. ఫలితంగా ఒక్కో విద్యార్థి కుటుంబం కోర్సు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షలకు వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయేది. యాజమాన్యాలు అడిగిందే తడవుగా సరైన పరిశీలన చేయకుండానే గత ప్రభుత్వం ఫీజులను పెంచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు కనిష్ట ఫీజు రూ.35 వేల నుంచి రూ.60 వేల లోపు ఉండే కాలేజీలు 225కిపైగా ఉండగా వాటి సంఖ్య ఏకంగా 25 వరకు పడిపోయింది. రూ.70 వేలనుంచి రూ.లక్ష లోపు ఫీజులు వసూలు చేసే కాలేజీల సంఖ్య ఏకంగా 200కి పెరిగింది. ఎం.ఫార్మాలో కనిష్ట ఫీజు రూ.64 వేలు ఉన్న కాలేజీ ఒక్కటి మాత్రమే కాగా మిగతా కాలేజీల్లో రూ.1.10 లక్షలకు పైగానే ఫీజులను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇక గత ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంటును రూ.45 వేలకు పెంచుతామంటూ ఒక జీవోను విడుదల చేసి విద్యార్ధులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి గత ప్రభుత్వం రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంటును కూడా కాలేజీలకు చెల్లించకపోవడంతో రూ. వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఇప్పటికే కోర్సు పూర్తిచేసి కొలువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులు సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో అప్పు చేసి చెల్లిస్తున్నారు.

తల్లిదండ్రులకు ఎంతో ఊరట         
పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుకు వీలుగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చదువుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి తల్లిదండ్రులకు తప్పుతుందని విద్యార్ధులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫీజులెలా చెల్లించాలని ఆందోళన చెందకుండా చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క ఫీజులతో పాటు విద్యార్ధుల వసతి, భోజనాలకోసం ఏటా రూ.20 వేలు చొప్పున చెల్లించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్ధుల చదువులపై తల్లిదండ్రులకు భరోసా ఏర్పడుతోంది.

ప్రమాణాలు పాటించని కాలేజీలు
ప్రస్తుత ఫీజుల నిర్ధారణ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కనీస ప్రమాణాలు పాటించకపోవడంతోపాటు మౌలిక సదుపాయాలూ లేని కాలేజీలకు రూ.లక్షల్లో ఫీజులను నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలను కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలికి తప్పుడు పత్రాలు సమర్పించి ఫీజులను పెంచుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఒకే రకమైన కోర్సును బోధించే కాలేజీల ప్రమాణాల్లో వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్ధులకు సమాన విద్యావకాశాలు కల్పించాలన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు ఇది ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలు సమాన ప్రమాణాలు పాటించాలని, ఒకే రకమైన నిర్వహణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం వరకు గత ఏడాది ఫీజులనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల అనంతరం కొత్త ఫీజుల విధానం అమల్లోకి రానుంది.

Back to Top