‘విశ్వసనీయత – అవకాశవాదం’ మధ్యే  పోటీ

జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటాం

మేమెవ్వరికీ వ్యతిరేకం కాదు

ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికీ మా మద్దతు

రాష్ట్రంలో ఒంటరిగానే పోరాడుతాం

హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ..రెండూ మోసం చేశాయి.

అందుకే..ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదు

ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేము

‘ఇండియా టుడే కాంక్లేవ్‌’లో  వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

 

న్యూ ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదం మధ్యనే ఎన్నికలు జరగబోతున్నాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, దాన్ని ప్రజలెవ్వరూ స‌హించడం లేదని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో తటస్థంగానే ఉంటామని, ఆ తర్వాత రాష్ట్రానికి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే, వారికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.  తామెవ్వరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోరాడతామన్న జననేత, రాష్ట్రానికి హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ మోసం చేశాయని ఆక్షేపించారు. అందుకే ప్రజలెవ్వరూ నమ్మడం లేదని, ఇంకా మోసపోయేందుకు  సిద్ధంగా లేరని యస్‌ జగన్‌ తేల్చి చెప్పారు. ‘ఇండియా టుడే’ 18వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కాంక్లేవ్‌లో  వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు సాగిన సదస్సులో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్ కన్వల్‌ అడిగిన ప్రశ్నలకు వైయస్‌ జగన్, సూటిగా సమాధానం చెప్పారు. ప్రతి అంశాన్ని స్పష్టంగా వివరించిన ఆయన, అహుతులందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
 రాహుల్‌ కన్వల్‌: సుదీర్ఘ పాదయాత్ర ద్వారా మంచి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు. దాదాపు 3648 కిమీ పాదయాత్ర ద్వారా అధికారం చేపడతామని భావిస్తున్నారా?
 వైయస్‌ జగన్‌: పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తామా? లేదా? అన్న దాని గురించి నేను ఆలోచించడం లేదు. కానీ ఈ సుదీర్ఘ పాదయాత్ర
ప్రజల్లో ఒక విశ్వాసం పెంచింది. తమ కష్టాలు చూసేందుకు, వినేందుకు ఒకరు వచ్చారన్న ఆశ వారిలో కనిపించింది. అవి పరిష్కారమవుతాయన్న నమ్మకం కూడా వారిలో ఆవిష్కృతమైంది. ప్రజల్లో ఉన్న ఆ ఆశ, విశ్వాసమే నన్ను ముందుకు నడిపించింది.
ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక కల ఉంది. ఆశయం ఉంది. అదే.. ప్రజల కష్టాలు తీర్చాలని, వారి సమస్యలన్నీ పరిష్కరించాలని.. ఆ విధంగా మా నాన్న మాదిరిగా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే నా లక్ష్యం. అందు కోసం ప్రజలకు నేను ఎంతో మంచి చేయాల్సి ఉంది. ‘తెలుగులో ఒక సామెత ఉంది. ఆరు నెలలు ఒకరితో కలిసి  ఉంటే వారు వీరవుతారని..’ అలాంటిది నేను ప్రజలతో ఏకంగా 14
నెలలు గడిపాను. ఆ విధంగా వారిలో ఒకడినయ్యాను. వారి సమస్యలన్నీ తెలుసుకున్నాను. నా 9 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ రోజులు ప్రజల్లోనే గడిపాను. కానీ ఈ సుదీర్ఘ పాదయాత్ర నాకు ప్రజల సమస్యలు, బాధలు స్వయంగా తెలుసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చింది.
రాహుల్‌: మీరు అధికారం చేపడితే పాలన ఎలా ఉండబోతుంది?
 వైయస్‌ జగన్‌:  ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం,  సుపరిపాలన వల్ల అనేక సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ చంద్రబాబు చేసిందేమిటుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి  ఉండకపోవడం. గత ఎన్నికల్లో ప్రజలకు ఆయన ఎన్నెన్నో వాగ్ధానాలు చేశారు. కానీ వాటిని అమలు చేయకుండా విశ్వాసం కోల్పోయారు. ఉదాహరణకు.. రైతు రుణ మాఫీ. సాధ్యం కాదని తెలిసినా వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ వాస్తవానికి ఏ ప్రభుత్వానికి కూడా అంత మొత్తం రుణాలు పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని, అధికారం చేపట్టగానే అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు రైతులను నమ్మించిన చంద్రబాబు ఆ తర్వాత మాట నిలబెట్టుకోకుండా, వారిని మోసం చేశారు. చంద్రబాబు చేసిన మరో మోసం. రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందించకపోవడం. గత ప్రభుత్వాలు బ్యాంకులకు వడ్డీ మొత్తం చెల్లిస్తే అవి రైతులకు వడ్డీ లేని రుణాలిచ్చేవి. కానీ చంద్రబాబు ఆ వడ్డీని బ్యాంకులకు చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు రైతులకు సున్నా వడ్డీ రుణాలందడం లేదు. అదే విధంగా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ప్రతి రంగంలోనూ సమస్యలు నెలకొన్నాయి. అవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది.
రాహుల్‌: నా ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. మీరు సీఎం అయితే మీ తండ్రి మాదిరిగా పథకాలు అమలు చేస్తారా? అసలు
మీరేం చేయబోతున్నారు?.
  వైయస్‌ జగన్‌: ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలేవీ అర్హులకు అందడం లేదు. లబ్ధిదారులను పార్టీల పరంగా చూస్తున్నారు. అందుకే గ్రామ స్థాయిలో పరిపాలనలో భారీ మార్పు తీసుకు రాబోతున్నాము. ఆ ప్రక్రియలో భాగంగానే కొత్తగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబోతున్నాము. అవి ప్రతి అర్జీని వెంటనే (72 గంటల్లో) పరిష్కరిస్తాయి. గ్రామ సచివాలయాలు పూర్తి నిష్పాక్షికంగా పని చేస్తాయి.
ఆ విధంగా పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి అర్హుడికి సంక్షేమ, అభివృద్ధి పథకం, కార్యక్రమం అందాలన్నదే మా లక్ష్యం. అదే విధంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా..నవరత్నాలు ప్రకటించాము. అవన్నీ ప్రజల కష్టాల నుంచే పుట్టుకొచ్చాయి. కాబట్టి వాటిని అమలు చేస్తే, అందరి సమస్యలు తీరుతాయి.
రాహుల్‌: ఇక జాతీయ స్థాయిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
 వైయస్‌ జగన్‌: మా రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) మోసం చేశాయి. నమ్మక ద్రోహం చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్థంభమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అసలు రాష్ట్ర విభజనను కూడా చాలా దారుణంగా చేశారు. పార్లమెంటు తలుపులు మూసి, అసలు లోపం ఏం జరుగుతుందో కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. అడ్డగోలుగా విభజన చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారిని సస్పెండ్‌ చేశారు. విభజన సందర్భంగా ఆనాడు రాజ్యసభలో కూడా అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ రెండూ ఒక్కటయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోరిన వారికే రాజధాని అప్పగించడం, గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆ విధంగా మేము హైదరాబాద్‌ను కోల్పోయాం. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. ఇవాళ మా రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది.
రాహుల్‌: ఏపీ ఎంతో సంపన్న రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు హోదా ఎందుకు కోరుతున్నారు?
  వైయస్‌ జగన్‌: రాష్ట్ర విభజన సమయంలో ఈ వివరాలన్నీ వాళ్లకు (నాటి కేంద్ర ప్రభుత్వానికి) తెలియవా? అప్పటికే జార్ఖండ్‌ వంటి వెనుకబడిన రాష్ట్రాలున్నాయి. అయినప్పటికీ విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని, కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు అధికార కాంగ్రెస్‌తో పాటు, విపక్ష బీజేపీ కూడా స్పష్టం చేశాయి. కానీ మాట నిలబెట్టుకోకుండా ఇవాళ జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ను ప్రస్తావిస్తూ, ఏపీ కంటే అవి చాలా వెనుకబడి ఉన్నాయంటున్నారు. కాబట్టి హోదా ఇవ్వలేమని చెబుతున్నారు. ఆ విధంగా పార్లమెంటులో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా మోసం చేశారు. అలాంటప్పుడు పార్లమెంటుపై ఎలా విశ్వసనీయత ఉంటుంది?
రాహుల్‌: 2019 ఎన్నికల్లో బీజేపీ, షా ద్వయం, మరోవైపు కాంగ్రెస్ కూటమి.. ఇంకా స్పష్టత రాని మూడో ఫ్రంట్‌ గురించి కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎటువైపు ఉండబోతున్నారు?
వైయస్‌ జగన్‌: మేము ఇప్పటికే తటస్థంగా ఉన్నాము. మా డిమాండ్‌ ఒక్కటే. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. దాని కోసమే మేము
పోరాడుతున్నాము. నేను కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఇన్నాళ్లూ అందరి మాటలు నమ్మి మోసపోయాం. ఎన్నికల ముందు ఎన్నో హామీలు
ఇచ్చిన వారు, ఆ తర్వాత అన్నీ మర్చిపోయారు. అవన్నీ చూసి మేము విసుగెత్తి ఉన్నాము. అందుకే నేను రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా చెబుతున్నాను. మేము ఎవ్వరినీ నమ్మబోము. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే మద్దతు ఇస్తాము. నిజానికి మేము ఇప్పటికే 5 ఏళ్లు కోల్పోయాము.
రాహుల్‌: అంటే మీరు పూర్తి పారదర్శకంగా ఉన్నామంటున్నారు. ఎవరు ప్రధాని అయినా సరే, ఎవరైతే హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తామంటున్నారు. అది మోదీ అయినా, రాహుల్‌గాంధీ అయినా లేక మాయావతి అయినా కూడా.. 
 వైయస్‌ జగన్‌: ఔను ప్రధాని ఎవరన్నది మాకు అనవసరం. మాకు హోదా ఎవరిస్తే వారికే మద్దతు ఇస్తాము. రాహుల్‌గాంధీ ప్రధాని అయినా 
మాకేం అభ్యంతరం లేదు. చివరకు మీరు (జర్నలిస్టు రాహుల్ కన్వల్‌) ప్రధాని అయినా సరే నీకే మా మద్దతు ఉంటుంది.
రాహుల్‌:  నేను ప్రధాని కావాలనుకోవడం లేదు.. ఓకే మీరు పూర్తి పారదర్శకంగా ఉండి ముందే ఎవరితోనూ ముందుగానే పొత్తు పెట్టుకోరన్న మాట. అంటే మీరు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు పొందాలని, మరోవైపు కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ
రాకుండా మీపై ఆధారపడాలని.. ఆ విధంగా ఇక్కడ బలమైన ప్రభుత్వం కాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారా? 
 వైయస్‌ జగన్‌: నా ఉద్దేశం ఒక్కటే. పార్లమెంటులో ఇచ్చిన మాటకు పాలకులు కట్టుబడి ఉండాలి. దానికి విలువ ఇవ్వాలి. విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాబట్టి ఏపీకి హోదా ఇవ్వాలి. దీన్ని నేతలు అర్ధం చేసుకోవాలి. అదే నా అభిమతం.
రాహుల్‌:  ఏపీ పెద్ద రాష్ట్రం. పరిశ్రమలూ ఏర్పాటవుతున్నాయి. మరోవైపు ఏపీ సంపన్న రాష్ట్రం అని చెబుతున్న చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అసలు ప్రత్యేక హోదా కోసం
ఎందుకంత డిమాండ్‌ చేస్తున్నారు?.
వైయస్‌ జగన్‌: అసలు మేము ఎందుకు మోసపోవాలి? విభజనతో మాకు  ఎందుకు అన్యాయం చేశారు. మా అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారు. ఆ విధంగా చాలా నష్టం చేశారు. మాకు అన్యాయం జరిగింది కాబట్టి, మీ అంతట మీరే రాష్ట్రానికి హోదా ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మోసం చేస్తున్నారు?  పైగా ఎందుకు సమర్థించుకుంటున్నారు?. నాడు హోదా ఇస్తామని చెప్పే రాష్ట్రాన్ని విడగొట్టారు కదా. ఇవాళ మేము హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరుతో కానీ పోటీ పడలేము. హైదరాబాద్‌ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి 60 ఏళ్లు పట్టింది. ఇవాళ ఏపీలో డిగ్రీ పొందిన వారు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు. అందుకు పరిష్కారం ఒక్కటే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అది  వస్తే ప్రత్యేక రాయితీలు వస్తాయి. నూరు శాతం పన్నుల మినహాయింపులు వస్తాయి. తద్వారా వివిధ రంగాలలో పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు మా కంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎంతో ముందున్నాయి. హోదా లేకపోతే మా దగ్గర పెట్టుబడులు ఎవరు పెడతారు?
రాహుల్‌: మీ పార్టీ కాంగ్రెస్‌ నుంచి వేరు పడి ఏర్పాటైంది. మీ తండ్రి  మరణం తర్వాత మీకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి, వేరే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని, కలిసి పని చేద్దామని రాహుల్‌గాంధీ ఆహ్వానిస్తే మీ స్పందన ఎలా ఉండబోతుంది?
 వైయస్‌ జగన్‌: మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అలాగే మేము రాహుల్‌గాంధీకి కానీ లేక మరొకరికి కానీ వ్యతిరేకం కాదు. అదే 
విధంగా చాలా సూటిగా ఉన్నాము. మేము ఎవ్వరినీ విశ్వసించబోము. ఇప్పటికే 5 ఏళ్లు కోల్పోయాము. కాబట్టి రేపు
ఎవరికైనా మా మద్దతు కావాలంటే, హోదా ఇవ్వాల్సిందే. అందుకే ముందే ఎవరితోనూ జత కట్టలేదు. పొత్తు పెట్టుకోవడం లేదు.
రాహుల్‌: గతంలో మీ నాన్న గారు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. ఆ విధంగానే మీరు తిరిగి కాంగ్రెస్‌లో చేరి, ఆ స్థాయికి ఎదుగుతారా? ఆ అవకాశం ఉందా? 
వైయస్‌ జగన్‌: కాంగ్రెస్‌ శకం ముగిసింది. ఏపీలో అసలు పార్టీ ఎక్కడుంది. ఆ పార్టీ అవసరం మాకేముంటుంది?. నిజానికి కాంగ్రెస్‌కే మా అవసరం ఉంటుంది.
రాహుల్‌:  గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌ కేవలం 2.94 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ఆ తర్వాత పార్టీ ఎదిగింది అని మీరు
అనుకుంటున్నారా?
 వైయస్‌ జగన్‌: కాంగ్రెస్‌ శ్రేణుల్లో వారికి వారి పైనే నమ్మకం లేదు. ఆ పార్టీకి అంత నమ్మకం ఉంటే, తమకు వ్యతిరేకంగా 35 ఏళ్లుగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీతోనే పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? 35 ఏళ్లుగా తమకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో ఎలాంటి నైతికత లేకుండా జత ఎలా కడుతుంది? ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ గురించి ఏ మాత్రం విలువలు లేని ఆయన వ్యక్తిత్వం గురించి ఒక విషయం చెబుతాను. ‘చంద్రబాబు అవినీతిపై గత ఏడాది అంటే.. 2018 జూన్‌ 8న  ఏపీ కాంగ్రెస్‌ ఒక పుస్తకం విడుదల చేసింది. దానిపై రాహుల్‌ బొమ్మ కూడా ప్రచురించింది. ‘అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు’ అంటూ కాంగ్రెస్‌ ఆ పుస్తకం ముద్రించింది’. ‘ఆ తర్వాత సరిగ్గా మూడు నెలలకే తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ప్రజలు ఏమనుకుంటారన్న స్పృహ కూడా వారికి లేదు. ప్రజలను ఫూల్స్‌ చేద్దామనుకున్నారా? మరి అలాంటి వాళ్లను ప్రజలు ఆదరిస్తారా? లేదు. కచ్చితంగా తిరస్కరిస్తారు.
రాహుల్‌:  ఏపీలో కూడా టీడీపీ కాంగ్రెస్‌తో జత కడితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అది మీపై ఎలాంటి ప్రభావం చూపే
వీలుంది? 
 వైయస్‌ జగన్‌: నేను ప్రజలను నమ్ముతాను. దేవుడ్ని విశ్వసిస్తాను. ఓట్లు వేసేది ప్రజలు. గత ఎన్నికల్లో అందరూ కలిసి పోటీ చేసినా, నేను ఒంటరిగా పోరాడాను. టీడీపీ, బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ జనసేన ఒక వైపు ఉంటే, ఇటు వైపు నేను ఒక్కణ్నే ఎదుర్కొన్నాను. కేవలం 1 శాతం ఓట్లతో అధికారం చేపట్టలేకపోయాము. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టినా మాకు పెద్దగా వ్యత్యాసం ఉండబోదు. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన స్వప్రయోజనాల కోసం మాట మార్చి, ఇష్టానుసారం పొత్తులు పెట్టుకుని రాజకీయం చేశారు. మరి ఆయనకు ప్రజలు ఎలా ఓటేస్తారు? ‘రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు విశ్వసనీయత, అవకాశవాదం మధ్య పోటీగా ఉండబోతున్నాయి. ఆయన (చంద్రబాబు) 
స్వప్రయోజనాల కోసం ఎప్పటిప్పుడు మాట మార్చారు. ఒక నాయకుడిగా చేయకూడనివన్నీ చేశారు. మరి ప్రజలు ఆయనకు ఎలా
ఓటు వేస్తారు’?.
రాహుల్‌: ఏపీలో మీదే విజయమని స్పష్టమవుతోంది. మరోవైపు సుదీర్ఘ పాదయాత్రలో విజయవంతంగా కోట్ల మంది ప్రజలను కలుసుకున్నారు. ఆ విధంగా జనంలోకి వెళ్లారు. గత ఎన్నికల సమయంలో మీ అఫిడవిట్‌లో మీపై 15 కేసులున్నట్లు ప్రకటించారు. అవి మీ రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు?
  వైయస్‌ జగన్‌:  మా నాన్న గారు బ్రతికి ఉన్నప్పుడు నాపై ఎలాంటి కేసులు లేవు. ఆయన మరణం తర్వాత, నేను కాంగ్రెస్‌ను వీడిన తర్వాతే నాపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు కూడా పెట్టింది ఎవరు? టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి నాపై కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. వారన్నీ చూస్తున్నారు. మా నాన్నను ప్రజలు వరుసగా రెండోసారి (2009)లో కూడా ఎన్నుకున్నారు. నాడు ఏపీ నుంచి కాంగ్రెస్‌ పక్షాన 33 మంది ఎంపీలు గెల్చారు కాబట్టే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది.  మా నాన్న తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో కూడా లేను. బెంగళూరులో నా వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నాను. 
రాహుల్‌: మీపై పలు ఆరోపణలతో పలు కేసులున్నాయి కదా? మరి వాటినేమంటారు?
 వైయస్‌ జగన్‌: మనం విపక్షంలో ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు  వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కేసులు పెట్టడం చాలా సులభం. అందుకే నాపై ఆ కేసులు పెట్టారు. మా నాన్నగారు చనిపోయాక, నేను కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీ పెట్టాకనే నాపై కేసులు నమోదు చేశారు. అధికారంలో ఉన్న వారు ఏది కావాలంటే అది చేస్తారు? ఎవ్వరిపై అయినా కేసులు పెడతారు. నాపై నమోదైనవన్నీ రాజకీయ కేసులు. ఇవన్నీ ప్రజలకు తెలుసు.
రాహుల్‌: ఇప్పుడు కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భారత్ పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితి.. రాష్ట్రంలో ఎన్నికలపై ఏమైనా ప్రభావం
చూపుతాయని భావిస్తున్నారా? 
 వైయస్‌ జగన్‌: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీకి కొంత మైలేజీ వచ్చి ఉండొచ్చు. కానీ ఏపీకి సంబంధించి చేసిన మోసం, హోదాపై ఇచ్చిన మాట తప్పడం మోదీని దిగజార్చాయి. 
రాహుల్‌: మీ దృష్టిలో రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీలో అధముడు ఎవరు?
  వైయస్‌ జగన్‌: ఏపీకి సంబంధించి ఇద్దరూ వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రానికి మోసం చేశారు.
రాహుల్‌:  అమరావతిలో చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారు. రేపు మీరు సీఎం అయితే దాన్ని కొనసాగిస్తారా? లేక మరేచోట నిర్మిస్తారా?
వైయస్‌ జగన్‌: ఏపీ రాజధాని నిర్మాణం ఒక పెద్ద కుంభకోణం. మొత్తం  అవినీతిమయం. 2014 మే నెలలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తామన్నది ఆయనకు స్పష్టంగా తెలుసు. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించారు. రాజధాని అక్కడ, ఇక్కడ అంటూ లీక్‌లు ఇచ్చారు. ఆ లోగా సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారు. ఆ విధంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.
రాహుల్‌: మరి అందుకు చంద్రబాబును మీరు జైల్లో పెట్టిస్తారా?
వైయస్‌ జగన్‌: చంద్రబాబు చేసింది పూర్తిగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌. అదే విధంగా పాలనా వ్యవహారాలలో ఎక్కడా స్వప్రయోజనం ఆశించకుండా,
నిర్ణయాల్లో గోప్యత పాటిస్తామంటూ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణాలను భంగ పర్చడమే. ప్రమాణ స్వీకారం చేసే ఏ ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని ప్రమాణం చేస్తారు. అదే విధంగా గోప్యత పాటిస్తామని కూడా ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపర్చారు. రాజధాని వచ్చే చోట తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారు. ఇంకా తన బినామీలతో కూడా తక్కువ ధరలకు భూములు కొనిపించారు. ఈ కుంభకోణం అంతటితో ఆగిపోలేదు. భూసమీకరణ పేరుతో భూసేకరణ చేశారు. అలా సేకరించిన భూమిని తనకు ఇష్టమొచ్చిన వారికి, ఎంత భూమి అంటే అంత, ఏ ధర అంటే ఆ ధరకు ఇచ్చారు. ఆ విధంగా 1600 ఎకరాలలో ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వచ్చాయి.ఇదీ చర్చ అంటూ రాహుల్‌ ముగిస్తుండగా..  వైయస్‌ జగన్‌ 
జోక్యం చేసుకుని ఒక్క నిమిషం మాట్లాడారు. ‘తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్‌ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అలాంటి నాయకుడు దేశంలో మరెవరైనా ఉన్నారా? ఆ టేపులో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్‌ పరీక్షలో కూడా తేలింది. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి వాస్తవం ఏమిటన్నటి ఇక్కడ ఉన్నమేధావులంతా ఆలోచించాలి. అది వారికే వదిలేస్తున్నాను’ అని వైయస్‌ జగన్‌ ముగించారు.  

Back to Top