కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, పవన్‌ అందరూ దోషులే..

టీవీ9 ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌

 

నాలుగున్నరేళ్ల అవినీతిపై ఆధారాలెన్నో ఉన్నాయి

అధికారంలోకి రాగానే దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తాం

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం

చంద్రబాబు, పవన్‌ ముసుగు తొలగించి పోటీచేయాలి

 

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా అంతులేని అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి రాగానే ఆ కుంభకోణాలన్నిటిపైనా సమగ్రమైన విచారణ జరిపిస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన చేశారు. టీవీ 9 చానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి చాలా ఆధారాలే ఉన్నాయని, వాటన్నిటినీ దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. 

 

ప్రశ్న: పాదయాత్ర ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? పాదయాత్ర మొదలు పెట్టి ఒక సంవత్సరం రెండు నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలో మీరు తెలుసుకున్న కొత్త విషయాలేంటి? 
జగన్‌: ప్రజల తరుఫున పోరాటంలో పాదయాత్ర అన్నది అత్యంత బ్రహ్మాస్త్రంలాంటిది. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే కాకుండా, పాదయాత్ర చేసిన నియోజకవర్గం దాటే లోపు ప్రతి మూడు, నాలుగు రోజులకు బహిరంగ సభ కూడా జరుపుతున్నాం. విషయాలను బహిరంగ సభలో చెబుతూ, ఆ విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తున్నాం.  

ప్రశ్న: మీరు ప్రజల మధ్య ఉండడం కొత్త కాదు కదా.. ఇంతకు ముందు ఓదార్పు యాత్ర చేశారు. అనేక సభలు, ధర్నాలు చేశారు. వాటికీ, దీనికి తేడా ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? 
జగన్‌: పాదయాత్ర సమయంలో నేను ప్రజల్లో ఉంటూ.. ఫలానా చోట నేను ఉంటాను, ఫలానా చోట నేను పడుకుంటానని తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారి గుండా పోయే సమయంలో ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. వినే మనిషి ఒకరు ఉన్నారు.. రేప్పొద్దున ఆ మనిషి మంచి పొజిషన్‌లోకి వస్తే ఏదైనా చేస్తారన్న భరోసా ఆ ప్రజల్లో కలుగుతోంది.  

 

ప్రశ్న: మీ పాదయాత్ర 3,600 కిలోమీటర్లు పూర్తయిందంటే, కొన్ని వేల సమస్యలు, కొన్ని వేల వినతులు విని ఉండొచ్చు. రేపు అధికారం వస్తే అవన్నీ పరిష్కారించడానికి మీ దగ్గర ఏదన్నా మార్గం ఉందా? 
జగన్‌: మెజార్టీ సమస్యలు పరిష్కరించదగ్గవే. 99.99 శాతం సమస్యలు సమాజంలో ఈ రోజు పడుతున్న అగచాట్లే. ఇవన్నీ ప్రభుత్వం స్వయంగా చేసిన తప్పిదం వల్ల వచ్చిన సమస్యలే. ఉదాహరణకు పింఛను ఇవ్వడం.. ప్రభుత్వం స్వయంగా దగ్గర ఉండి చేసిన పాపమే. జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు అడగడం. మరుగుదొడ్లకు సైతం లంచాలు తీసుకునే పరిస్థితి. మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న వారికి నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే వారికి నెలల తరబడి సరుకుల బిల్లులు ఇవ్వకపోవడం.. ఆరు నెలలకు పైగా వారికి ఇచ్చే గౌరవ వేతనం ఎగరగొట్టడం.. ఇలాగైతే వారు పిల్లలకు భోజనం ఎలా పెడతారు? మేం శాచ్యురేషన్‌ మోడ్‌లో మా నాన్న ఇంతకు ముందు చేసిన పద్ధతిలో ఈ సమస్యను అధిగమిస్తాం. మేం అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. అదీగాక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అదే గ్రామంలో పది మందికి ఉద్యోగాలిస్తాం. గ్రామ సచివాలయం ఆ గ్రామంలోనే ఉంటుంది. ఆ గ్రామంలో పది మంది ఉద్యోగం చేస్తా ఉంటారు. ప్రభుత్వ పథకమేదైనా కావాలన్నా, ఆ గ్రామానికి చెందిన ఏ సమస్య అయినా గ్రామ సచివాలయంలోనే పరిష్కారమవుతుంది. 72 గంటలలోనే లంచాలు లేకుండా పని జరుగుతుంది. 

ప్రశ్న: 2014కు ముందు చంద్రబాబు కూడా ఇలానే చెప్పారు. వినడానికి చాలా బాగున్నాయి. అప్పుడు చంద్రబాబుకు ఓటు వేశారు. ఇప్పుడు కూడా మీరు చెబుతున్నారు. వినడానికి బాగున్నాయి. ఇప్పుడు మీకున్న ఆలోచనలను ఇదే తరహాలో చేరవేయగలిగే పరిస్థితి ఉంటుందా? 
జగన్‌: చంద్రబాబును ఇంకొక నాయకుడితో పోల్చకూడదు. ఒక పిల్లవాడి వద్దకు వెళ్లి చంద్రబాబు గురించి చెప్పమని మీ టీవీ ఇంటర్వ్యూలో ఎవరినన్నా అడగండి. ఒక్కసారి మైక్‌ పెట్టి చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటని అడగండి. వారి నోట్లో నుంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? చంద్రబాబు లాంటి మోసగాడు ఉండరు నాయనా అనే అక్క అయితే, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడయ్యా, మాఫీ కాలేదు, మా సున్నా వడ్డీ డబ్బులు కూడా పోయాయయ్యా అంటోంది. రైతును అడిగితే.. మా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడయ్యా. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడయ్యా. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు కానీ, వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. ఆయన చేసిన రుణమాఫీ మా వడ్డీలకు కూడా చాలడం లేదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు మాకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకి డబ్బులన్నా ఇచ్చేవి. ఈయన వచ్చాక అదీ రావడం లేదయ్యా. ఆ డబ్బులు కట్టడం మానేశాడయ్యా. అన్యాయం చేశాడయ్యా.. అంటారు. చదువు అయిపోయి ఉద్యోగం వెతుక్కుంటున్న పిల్లవాడు అనేది ఏమిటో తెలుసా? ఉపాధి గానీ ఉద్యోగం గానీ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.

ఈ రోజు ఉద్యోగం లేదు, రూ.2 వేల నిరుద్యోగ భృతి లేదు, అడ్డగోలుగా మోసం చేశాడన్నా.. అంటాడు. చదువుకుంటున్న పిల్లవాడ్ని అడిగితే, ఈ రోజు ఇంజనీరింగ్‌ చదవాలంటే లక్ష రూపాయలు ఫీజు కట్టాలి.. ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.30 వేలన్నా.. అది కూడా ఇవ్వక రెండేళ్లవుతోంది. మిగతా రూ.70 వేలు సంవత్సరం సంవత్సరం మా తల్లిదండ్రులు ఎక్కడ నుంచి తేవాలన్నా.. నాలుగేళ్లలో మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి.. అప్పుల పాలవుతూ, చదువుకునే పరిస్థితి ఈ రోజు లేదన్నా.. బీసీలపై ప్రేమ అని ఆ పెద్ద మనిషి అంటాడు.. ఇక్కడ చదువే లేక మేం ఉంటే ఏ రకమైన ప్రేమన్నా ఆయనది.. బీసీలపై ప్రేమ అంటే నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదన్నా.. పిల్లలను అప్పుల పాలు కాకుండా చదివించాలి.. చదివి ఉద్యోగం చేయాలి.. కాస్తో కూస్తో ఇంటికి పంపే పరిస్థితి రావాలి.. అప్పుడే బీసీలపై ప్రేమ అంటారు గానీ, ఇదేమి ప్రేమన్నా.. ఇంత మోసగాడు మరొకరు ఉండరంటారు. ఇంకా కాస్త లోతుకు పోయి అడిగితే, అన్నా.. మమ్మల్ని ఎస్సీలో చేర్చుతానన్నారు.. మమ్మల్ని ఎస్టీలుగా చేస్తానన్నాడు.. మమ్మలి బీసీలుగా చేస్తాడని ఇంకొందరు అంటారు. ఏదీ కాదు అని తెలుసు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చరిత్ర ఉంది. అనుభవం ఉంది. కానీ, ఓట్ల కోసమని, అడ్డగోలుగా మోసం చేసిన పరిస్థితుల్లో ఆయనంత మోసగాడు ఉండరు. ఆయన ముఖ్యమంత్రి కావడమే తన సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచే కదా.. ఇంకా అడిగితే.. తొమ్మిదేళ్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి.. ఇంతే గొప్పగా చెప్పాడు.. మా ఖర్మ ఏంటంటే, పదేళ్లు గ్యాప్‌ వచ్చింది.. ఆయన చేసిన మోసాలు మరిచిపోయాం.. కాబట్టి మా ఖర్మకొద్ది ఆయనకు ఓటు వేశామని చెబుతారు.  

ప్రశ్న: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెబుతున్నారు.. మీరు 46 ఇయర్స్‌ యంగ్‌మాన్‌.. క్లాష్‌ అవుతున్న తీరు ప్రజలు ఎట్లా రిసీవ్‌ చేసుకుంటారు. 
జగన్‌: త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు ఎవరిని ఎలా రిసీవ్‌ చేసుకోబోతున్నారనేది తెలుస్తుంది కదా.. ఓటు ఎవరికి వేయబోతున్నారు అనేది తెలిసిపోతుంది. 

 

ప్రశ్న: 2014లో మేము అధికారంలోకి రావాల్సిన వాళ్లం అని మీరంటున్నారు. చంద్రబాబు లాస్ట్‌మినిట్‌లో అధికారంలోకి వచ్చారు. ఈసారి మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అధికారంలోకి వస్తానని. చంద్రబాబు నాయుడు పవర్‌ను నిలబెట్టుకోడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు. 
జగన్‌: నిలబెట్టుకునే దానికే కదా రోజుకో డ్రామా వేస్తున్నాడు. మామూలుగా తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఐదారు రిలీజ్‌ అవుతూంటాయి. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్, మహేష్‌బాబు ఇలా ఒకటీ లేదా రెండు సినిమాలు రిలీజ్‌ చేస్తుంటారు. కానీ ఆరు మాసాల్లో ఎన్నికలనే సరికే చంద్రబాబు నాయుడు వారానికో సినిమా. పెన్షన్‌లు రావడం లేదా.. అయ్యో ఇప్పుడే మంజూరు చేస్తా. అయ్యో మీకు ఇళ్లు మంజూరు కాలేదా.. ఇప్పుడే మంజూరు చేస్తున్నా. పోనీ ఇచ్చారా అంటే అదీ లేదు. అంతా డ్రామా. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? నాలుగేళ్లయి పోయింది. ఇంతవరకూ ప్రత్యేక హోదా రాలేదా? నేను ధర్మపోరాట దీక్ష చేస్తా. అదీ ఒక సినిమా. రాజధాని..అయ్యో ఇంతవరకూ కట్ట లేదా? బాహుబలి సినిమా అయిపోయింది ఇంతవరకూ కట్టడాలు లేవా? అదొక సినిమా అయిపోయింది. గ్రాఫిక్స్‌ చూపిస్తారు. అయ్యో పోలవరం.. పునాది దాటి ముందుకు పోలేదా.. నా మనవడిని కూడా తీసుకెళ్లి చూపిస్తా. స్పీడు పెంచుతా. 2018 జూన్‌ కంతా నీళ్లిస్తా. ఇదీ ఒక డ్రామా. ఇన్ని కొత్త సినిమాలు ప్రపంచంలో ఏ హీరో కూడా తీసి ఉండరు. బీజేపీలో కలుస్తాడు కాంగ్రెస్‌ను తిడతాడు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీజేపీని తిడుతున్నాడు. బీజేపీతో ఉన్నప్పుడు జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో ఉంటూ.. జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అంటాడు.అటు బీజేపీతో, ఇటు కాంగ్రెస్‌తో సంసారం చేసింది చంద్రబాబునాయుడు గారే. ఇద్దరితో కాపురం చెయ్యని వ్యక్తి, చెయ్యని పార్టీ ఏదన్నా ఉందంటే జగన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే.  

ప్రశ్న: మీకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని పదే పదే చంద్రబాబునాయుడు చెబుతున్నారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి పదే పదే మోడీని కలుస్తున్నారు. అపాయింట్‌మెంట్‌లు ఈజీగా దొరుకుతున్నాయి అంటున్నారు. దాన్ని బ్రేక్‌ చెయ్యడానికి, ఖండించడానికి మీదగ్గరేమైనా ఆధారాలున్నాయా? 
జగన్‌: విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ప్రధాన మంత్రిని ఎన్నిసార్లు కలిశాడో చెప్పమనండి.. ఒకసారి నేను కూడా తెలుసుకుంటా. ప్రధాన మంత్రి ఖాళీగా ఉన్నారు.. ఎప్పుడడిగితే అప్పుడు అప్పాయింట్‌మెంట్‌ ఇస్తున్నాడు అంటూంటే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నిసార్లు కలిశాడో చెబితే.. ఈ టెలికాస్ట్‌ ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. అంత ఖాళీగా ప్రధాని ఉంటున్నాడంటే నేను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తా. నాకు తెలిసినంత వరకూ ప్రధానిని ఆయన 4 ఏళ్లలో 3 సార్లు కలిసి ఉంటారు. నాతోపాటు 2 సార్లు వచ్చి ఉంటాడు. అదికాక ఆయనేమన్నా లోకల్‌ సమస్యలపై ఒకసారో రెండుసార్లో కలిసి ఉంటాడు. అలాంటి అపాయింట్‌మెంట్‌ ఎవరికైనా ఇస్తారు. ప్రతి ఎంపీకి ఇస్తారు. దాన్ని వక్రీకరించాలనుకున్నప్పుడు అదే చేస్తారు.  

ప్రశ్న: ఆంధ్రా పాలిటిక్స్‌లో ఇదే జరుగుతోంది. బీజేపీ విషయంలో మరో క్లారిఫై చెయ్యాలి. మీరు నరేంద్రమోదీని ఎప్పుడూ విమర్శించరు. ఎన్డీఏ పాలసీని వ్యతిరేకించరు. జీఎస్టీ మీద మాట్లాడరు. దీన్ని బట్టి మీకు, వాళ్లకు అండర్‌ స్టాండింగ్‌ ఉందని అంటున్నారు. 
జగన్‌: ఎవడండీ అనింది.. నేను నోట్ల రద్దు మీద మాట్లాడలేదని చెప్పింది? ఒక్కసారి రికార్డులు వెనక్కు తియ్యండి. నావల్లే మోదీ నోట్ల రద్దు చేశాడు అన్నది చంద్రబాబు. ఆన్‌ రికార్డులో అన్నాడు. నోట్ల రద్దు కమిటీకి అధ్యక్షుడు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇంప్లిమెంటేషన్‌ మెకానిజం లేకుండా నోట్ల రద్దు అనేది తొందర పాటు చర్య అని, దీనివల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అని మొదటిసారి నేనే చెప్పా. జీఎస్టీకి దేశంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చారు. జీఎస్టీకి మద్దతు ఇవ్వకపోతే ఎలాంటి ఇంప్రెషన్‌ ఇచ్చారో తెలుసా? ప్రపంచమంతా జీఎస్టీని ఇంప్లిమెంట్‌ చేస్తోంది. దాన్ని అనుసరించకపోతే ఏ లెవెల్లో వెనకబడిపోతాం అన్నది మీడియా ఏ లెవెల్లో హైప్‌ ఇచ్చింది. ఒక్కసారి చూడండి. ఏ మీడియా కూడా జీఎస్టీని వ్యతిరేకించలేదు. ఏ ముఖ్యమంత్రి వ్యతిరేకించలేదు. కొన్ని సెక్టార్లకు అన్యాయం జరిగిందనేదే గ్రీవెన్స్‌. చేనేతలకు అన్యాయం జరుగుతోంది అని మేము ప్రధానికి లేఖ ఇచ్చాం. మా ఎంపీలు వెళ్లి ప్రధానిని కలిసి వివరించారు. అరుణ్‌ జైట్లీకి చెప్పారు. టాక్స్‌లు రద్దు చెయ్యండి అన్నారు.  

ప్రశ్న: హోదా మీద కూడా బీజేపీని సుతిమెత్తగా కొడుతున్నారట.. 
జగన్‌: చంద్రబాబు నాయుడు ఏ వీడియో టేపులు చూపిస్తున్నాడో.. బీజేపీ అన్యాయం చేసిందని ఏమి చూపిస్తున్నాడో.. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, అభిజిత్‌సేన్‌ ఏం చెప్పారు? ఇవన్నీ ముందు ఎవరు చెప్పారు? వీటన్నిటిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అవగాహన కల్పించింది ఎవరు? ఒక్క జగనే. అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విడగొట్టి ఒక తప్పు చేస్తే.. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడం రెండో తప్పు. ఒక వేళ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉండుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లి న్యాయం అడిగివుండే వాళ్లం. ఆ హక్కు కాంగ్రెస్‌ పార్టీ మాకు ఇవ్వలేదు. అది కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పు. బీజేపీ చేసిన తప్పు అధికారంలో ఉండి, చేయతగ్గ స్థానంలో ఉండి, మాట ఇచ్చి, పార్లమెంటులో ఉంటూ, ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పి, మేనిఫెస్టోలో పెట్టి, ఆ తర్వాత తిరుపతికి వచ్చి, సభలోనే ప్రత్యేక హోదాను ఇస్తానని మోడీగారే చెప్పి.. ఇప్పుడు ఆయన ఇవ్వకపోవడం మోడీ, బీజేపీ చేసిన తప్పు. మూడో హంతకుడు నారా చంద్రబాబు నాయుడు. పోరాటం చెయ్యాల్సిన వ్యక్తి, అడగాల్సిన వ్యక్తి నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశాడు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఏం చేశారండి? ప్రత్యేక హోదా సంజీవనా? అన్నాడు. ప్రత్యేక హోదా గురించి అడిగితే జైలులో పెట్టిస్తాను అన్నాడు. ప్రత్యేక హోదాతో మిగతా రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయ్‌ అన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఈ మాదిరిగా మాట్లాడితే.. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో నీకు తెలుసా ముఖ్యమంత్రీ? ప్రత్యేక హోదా వల్ల కలిగే మేళ్లు ఏమిటో నీకు తెలుసా ముఖ్యమంత్రి గారూ? అని నేను అసెంబ్లీలో చంద్రబాబుకు క్లాస్‌ పీకాను. కావాలంటే ఆ టేపులు రివైండ్‌ చేసి ఒక్కసారి వినండి. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, ప్రత్యేక హోదాను ఖూనీ చేసి, ప్రత్యేక హోదా కోసం పోరాడిన మా మీద వీళ్లు మాట్లాడుతా ఉంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యారు. ఈ పెద్ద మనిషి ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మళ్లీ ఇప్పుడు కొత్త సినిమా చూపిస్తున్నాడు.  

ప్రశ్న: మీరు హోదా ఎలా తీసుకొస్తారు? కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాను.. హోదా ఇస్తానని రాహుల్‌ గాంధీ చెప్పాడని చంద్రబాబు అంటున్నాడు. ఎంపీలు రాజీనామాలు చేశారు.. దేశ వ్యాప్త చర్చ తీసుకొచ్చానని మీరు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి అండ లేకుండా, జాతీయ పార్టీ లేకుండా హోదా రాదు. మీరు ఎవరివైపు ఉంటారు? 
జగన్‌: హోదా విషయంలో ఈ పార్టీలను నమ్మి నమ్మి సాలైపోయింది. కాంగ్రెస్‌ మోసం చేసింది. బీజేపీ మోసం చేసింది. చంద్రబాబు నాయుడు మోసం చేసాడు. పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి కూడా మోసం చేశాడు. అందరూ కలిసే ఈ మోసాలు చేశారు. నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అడిగేది ఒక్కటే. ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రజలనే మీ ద్వారా కోరుతున్నా. ఎవర్నీ నమ్మొద్దండి. 25కు 25 ఎంపీలు.. మొత్తం వైఎస్సార్‌ పార్టీకే తెచ్చుకున్న తర్వాత దేశంలో ప్రధాన మంత్రి ఎవరైనా కానీ.. ఐ యామ్‌ నాట్‌ బాదర్డ్‌. బీజేపీ, కాంగ్రెస్‌ ఎవరైనా కానీ, ఎల్లయ్య కానీ, పుల్లయ్యకానీ, ఫెడరల్‌ ఫ్రంట్‌ తరపున రజనీ కానీ ఎవరైనా సరే.. ప్రత్యేక హోదా ఇదిగో నేను సంతకం పెట్టబోతున్నాను. నీ మద్దతు ఇవ్వు అని చెబితే 25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలతో మద్దతు ఇవ్వడానికి సిద్ధం. మద్దతు ఇచ్చిన రెండు రోజుల్లో ప్రత్యేక హోదా తేవాలి. 25 మంది ఎంపీలు మన చేతిలో ఉంటే మన దగ్గర అధికారం ఉంటుంది. అలా కాకుండా ఎవరితోనో పొత్తు పెట్టుకుని, మళ్లీ అదే పరిస్థితి పునరావృతమై మళ్లీ మోసపోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.  

ప్రశ్న: మీకు పక్క రాష్ట్రం కేసీఆర్‌తో బాగా సాన్నిహిత్యం ఉందని ప్రచారం జోరుగా ఉంది. కేసీఆర్‌ కూడా చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్నాడు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది? 
జగన్‌: వాస్తవమేంటంటే.. కేసీఆర్‌ను ఇంత వరకు నేను ఎప్పుడూ కలవలేదు. మొన్న ఆయన గెలిచిన తర్వాత ఫోన్‌లో మాట్లాడి కంగ్రాచ్యులేట్‌ చేశా. ఇందులో తప్పేముంది? అంతకన్నా కేసీఆర్‌తో నాకు పరిచయం లేదు.  

ప్రశ్న: కానీ కేసీఆర్‌కు మీపై ప్రత్యేకమైన ప్రేమ ఉంది. గత ఎన్నికల్లో మీరే గెలుస్తారని చెప్పారు. ఇప్పుడు కూడా మీరంటే ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తున్నారు. కారణం ఏమై ఉంటుందో మీరు అబ్జర్వ్‌ చేశారా?   
జగన్‌: బేసిక్‌గా ఏంటంటే.. ఒక మనిషి సినిమాకు పోతాడు. అందులో హీరో క్యారెక్టర్‌ అంటేనే ఇష్ట పడతాడు. విలన్‌ క్యారెక్టర్‌ నచ్చదు. సినిమా చూసినంతసేపు హీరోనే గెలవాలని చూస్తాడు. ఎందుకంటే ఆ మనిషి నైజాన్ని, క్యారెక్టర్‌ను బట్టి. చంద్రబాబు నైజం, క్యారెక్టర్‌ దేశ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా దగ్గరగా చూశారు. కేసీఆర్‌ కూడా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్‌ చంద్రబాబుపై అలా మాట్లాడి ఉండచ్చు. 

ప్రశ్న: సో.. కేసీఆర్‌ను ఆంధ్ర పాలిటిక్స్‌లోకి ఆహ్వానిస్తారా?  
జగన్‌: ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ప్రత్యేక హోదా అవసరం. దాని విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పవన్‌ కళ్యాణ్‌ కూడా మోసం చేశాడు. ఇంత మంది మోసం చేసినా కూడా కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేదు. అయినా కూడా తెలుగు ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తాను.. అవసరమైతే హోదా ఇవ్వాలని ప్రధానికి కూడా లేఖ రాస్తానని కేసీఆర్‌ ముందుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడాడు. అటువంటి మంచి మాటలు మాట్లాడిన వ్యక్తిని మనం స్వాగతించాలి. కేసీఆర్‌కు, బీజేపీ, కాంగ్రెస్‌కు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద బలమేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది స్వరం విన్పించడం ఒక ఎత్తు. వారికి తెలంగాణకు చెందిన ఎంపీలు 17 మంది మద్దతు పలకడం మరొక ఎత్తు. వారంతా జతై 42 మందిమి ఏకమై ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగితే అది ఇంకొక ఎత్తు. ఆ స్టేజ్‌కు ఎదిగితే ఆంధ్ర రాష్ట్రానికి జరిగే మేలు అంతకంటే మరొకటి ఉండదు. ఇందులో ఎస్యూరెన్స్‌ అనేది ఆయనే మీడియా ఛానళ్లలో చెప్పారు. కేసీఆర్‌ కూతురు, ఎంపీ కవిత పార్లమెంట్‌లోను ఏపీకి హోదా ఇవ్వాలని కోరారు.
 
ప్రశ్న: తెలంగాణాలో కేసీఆర్‌కు మీ క్యాడర్‌ సహకరించారు కాబట్టి, ఏపీలో కేసీఆర్‌ మీకు సహకరిస్తారా? అనే రాజకీయ చర్చ జరుగుతోంది.. 
జగన్‌: కేసీఆర్‌కు ఒకరి సపోర్టు అవసరం లేదు. జగన్‌ సపోర్టుతో ఆయన గెలిచారని చెప్పడం కూడా కేసీఆర్‌ను తగ్గించినట్టు అవుతుంది. తెలంగాణలో ఒక పార్టీకి సపోర్టు చేయమని మేం పిలుపునివ్వలేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఎవరికి ఓటెయ్యాలనేది, ఎవరి వల్ల మేలు జరుగుతుందో చూసుకుని ఓటేసేలా వారి మనస్సాక్షికి వదిలేశాం. అయితే నేచురల్లీ నాన్నగారిని ప్రేమించే వ్యక్తులు, మా పార్టీని ప్రేమించే వ్యక్తులకు టీడీపీతో కూడిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటెయ్యాలంటే చెయ్యిపోదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా టీడీపీతో పోరాడిన కాంగ్రెస్‌.. అదే టీడీపీతో కలిసి పోటీ చేయడం. దీంతో సహజంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేసి ఉంటారు.  

అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి.. నేను కచ్చితంగా చెప్పాలి. 2014లో ఫస్ట్‌ బీజేపీ మాతో ఎప్రోచ్‌ అయ్యింది.. చంద్రబాబు కన్నా ముందు. నేను పార్టీలో ఉన్న 25 మంది సీనియర్‌లను పిలిచాను. సోమయాజులు, మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ అందరిని పిలిచి అందరికీ పేపర్‌ ఇచ్చాను. ఏం చేద్దాం అని అడిగాను. 25 మందిలో 23 మంది నో చెప్పారు. అంతకన్నా ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయం తీసుకునే విధానం బహుశా ఏ పార్టీ చేసి ఉండదు.  

ప్రశ్న: మీకు, ఆయనకు ఇంత వ్యక్తిగత వైరమెందుకు? మీరు ఆయన గురించి ఆయన మీ గురించి విమర్శించుకుంటున్నారు. అసలు విషయాలు పక్కదారి పడుతున్నాయి..  
జగన్‌: నేనైతే చంద్రబాబునాయుడు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడి ఉంటే నాకు చెప్పండి. నేను మాట్లాడిన ప్రతి మాటలో ఆయన తప్పును ఎత్తి చూపించాను. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ మాటన్నారు, ఇది చేశారు.. ఇది అన్యాయం కాదా.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గుందా.. అన్యాయం అనిపించడం లేదా అని అన్నానుగానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ అనలేదు.

ఎలాగైనా లాభం మాకే

ప్రశ్న : మనం ఏపీ పాలిటిక్స్‌ను అబ్జర్వ్‌ చేస్తే పవన్‌ కళ్యాణ్‌ ఒక ఫ్యాక్టర్‌ అవుతోంది. అది పెద్ద ఫ్యాక్టరా..చిన్న ఫ్యాక్టరా అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. మీతో కలిస్తే బిగ్‌ ఫ్యాక్టర్‌ అంటున్నారు. మీతో కలవకుండా విడిగా పోటీ చేస్తే తెలుగుదేశానికి బిగ్‌ ఫ్యాక్టర్‌ అంటున్నారు. తెలుగుదేశం, పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే ఇంకో ఫ్యాక్టర్‌ అంటున్నారు. మీదాకా వచ్చే సరికి అబ్జర్వేషన్‌ ఏమిటి? ఏది జరిగినా ఈ ట్రయాంగిల్‌ పార్టీ సిస్టమే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో. ఏం జరిగే అవకాశం ఉందని మీరు అబ్జర్వ్‌ చేస్తున్నారా? 
జగన్‌: నేను మీకొక థియరీ చెబుతా.. పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడే అనుకో.. ఏమౌతుంది? లాస్ట్‌టైం ఇదే చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడు. నేను పూచీగా ఉన్నాను.. చంద్రబాబుకు ఓటెయ్యండని ఊరూరా తిరిగారు. ఇదే పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి అంతగా తిరిగినందువల్ల ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకే ఓటు వేశారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సపరేట్‌గా పోటీ చేస్తున్నాడంటే ఏం జరుగుతుంది? ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ను అభిమానించే వ్యక్తులే బహుశా పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ ఓటు వేసుకుంటారేమో.. అందులో కూడా బహుశా అందరూ వేయరేమో.. మెజార్టీ వాళ్లు వేస్తారేమో.. అప్పుడు ఓటు బ్యాంకు ఎవరిది తగ్గుతుంది? తగ్గేది చంద్రబాబు ఓటు బ్యాంకే తగ్గుతుంది కానీ మా ఓటు బ్యాంకు తగ్గే పరిస్థితి ఉండదు. రెండో సినారియోకొస్తాం..  పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వస్తుంది? వైఎస్సార్‌సీపీకే. ఓటరు దగ్గర ఉన్న ఛాయిస్‌లు రెండే రెండు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో వ్యతిరేక ఓటు ఉందంటే.. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బిహేవ్‌ చేసినా అట్లానే బిహేవ్‌ చేస్తారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పుడు 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చింది 26 స్థానాలు మాత్రమే. అంటే లెస్‌ ద్యాన్‌ 10 పర్సెంట్‌. అదే రకంగా 2004లో టీడీపీ ఓడిపోయినప్పుడు టీడీపీకి వచ్చిన స్థానాలు 47. అంటే లెస్‌ ద్యాన్‌ 15 పర్సెంట్‌. ఉన్న స్థానాలకు 15 పర్సెంట్‌ స్థానాలు కూడా రాలేదు. ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఇలా రెండే రెండు నిలుస్తాయి. చంద్రబాబు నాయుడు, ఆయన కూటమితో భాగస్వాములుగా ఉన్న వారందరికీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు.  

ప్రశ్న: జగన్‌ చుట్టూనే రాజకీయం జరుగుతుంది.. జగన్‌ ఏం చెబితే అదే నిర్ణయం అనే ఇంప్రషన్‌ ఇంకా కంటిన్యూ అవుతోంది. అది వాస్తవమా? కాదా? అంతర్గత ప్రజాస్వామ్యంపై మీరు ఏం చెబుతారు?
జగన్‌: రీజనల్‌ పార్టీల్లో ఎప్పుడూ కూడా లీడర్‌ను బట్టే ఓట్లు పడతాయి. ఆ పార్టీని లీడ్‌ చేసే వ్యక్తి గుణగణాలు ఎలాంటివి? ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏమిటి? అనే దానిపై ఆధారపడి ఓట్లు పడతాయనేది వాస్తవం. నేను ఇంకేదో చెబితే తప్పు చెప్పినట్టు అవుతుంది. నేచురల్‌గా నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా అన్నింటికంటే ఫస్ట్‌ ఎఫెక్ట్‌ అయ్యేది నేనే. అందుకే మంచి నిర్ణయం తీసుకోవాలనే ఎవరైనా అనుకుంటారు. మంచి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో నేను ఖచ్చితంగా అందరిని సంప్రదిస్తాను. సలహాలు తీసుకుంటాను. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటానో అన్నది నా ఇష్టానికి వదిలెయ్యాలి. నాకు శ్రేయోభిలాషులుగా ఉన్నవారు, పార్టీలో ముఖ్యులు, అడగదగ్గ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారిని కచ్చితంగా సంప్రదిస్తాను.  

ప్రశ్న: 2019లో మిమ్మల్ని చూసి ఓటెయ్యాలా? నియోజకవర్గంలో అభ్యర్థిని చూసి ఓటెయ్యాలా? ఎవరిని చూసి ఓటెయ్యాలి? 
జగన్‌: వాస్తవం ఏదంటే డిబేట్‌ ఏదైనా చేయొచ్చు. మీరు అనుకూలంగాను మాట్లాడొచ్చు. వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ఎనీ రీజనల్‌ పార్టీ గురించి మీకు చెబుతున్నా.. ఎమ్మెల్యే చేయగలిగిన పనులు చాలా లిమిటెడ్‌. ఒక పెన్షన్‌ ఇప్పించలేడు.. ఒక ఇల్లు ఇప్పించలేడు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి అనే వ్యక్తి మంచి వాడైతే, మనసున్న వ్యక్తి అయితే ఎమ్మెల్యేలు కాలర్‌ ఎగేసుకొని వాళ్ల నియోజకవర్గంలో తిరగగలుగుతారు. నాన్న టైంలో సాచురేషన్‌ పద్ధతిలో పెన్షన్‌ కావాలన్నా.. ఇళ్లు కావాలన్నా.. రేషన్‌ కార్డులు కావాలన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ ఇలా అన్నీ సాచురేషన్‌ పద్ధతిలో ఎవ్వరికి కష్టం వచ్చినా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ చూడ లేదు. అర్హుడై ఉంటే చాలు చేసేయమనేవారు. అప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి కాలర్‌ ఎగరేసుకొని తిరిగే వారు. 

ప్రశ్న: జగన్‌ మొండివాడు.. ఎవరి మాట వినడు.. అనే మాట ఎందుకు వచ్చింది? 
జగన్‌: మొండోడు జగన్‌ అని మా పార్టీ వాళ్లు ఎవరూ అనరు. గిట్టని వారు, ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ వాళ్లను అడిగితే ఒక నిర్ణయం తీసుకుంటే జగన్‌ గట్టిగా ఉంటాడు అంటారే తప్ప.. ఎవరినీ కలవడు, ఎవరితో మాట్లాడడు అని అనరు. నా అంత ఎక్కువగా అభిప్రాయాలు తీసుకునే వ్యక్తి ఎవరూ ఉండరన్నది మా పార్టీ వాళ్లకు తెలుసు.  

ప్రశ్న: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి జగన్‌కు మధ్య పోటీనా? మధ్యలో పవన్‌ కళ్యాణ్‌ రాడా..? 
జగన్‌: అబ్జల్యూట్లీ కరెక్ట్‌. పవన్‌ కళ్యాణ్‌ గురించి చంద్రబాబు గారే ఈ మధ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తెలంగాణలో తాను పోటీ చేస్తానన్నప్పుడు తెలంగాణలో జనసేన మద్దతు ఇచ్చిందని ఆయనంతకు ఆయనే ఓపెన్‌ డయాస్‌లో చెప్పుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. నేను, పవన్‌ కలుస్తానంటే జగన్‌కు అంత బాధ ఎందుకని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. సో చూస్తా ఉంటే ఇంతకుముందు కలిసి పోటీ చేసి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఆ నటన కూడా కాస్తా పక్కన పెట్టేసి ముగుసు తీసేసి మళ్లీ ఒక్కటయ్యే పరిస్థితి కన్పిస్తున్నట్టుగా చంద్రబాబు మాటలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. మరి ఏం జరిగినా కాని నాకైతే భయం లేదు. బాధ లేదు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఇంకా నేను సంతోష పడతా. 

ప్రశ్న: పవన్‌ మీతో వస్తాడని బయట పెద్ద ప్రచారం జరుగుతోంది.. మీతో అండర్‌ స్టాండ్‌ అయిపోయిందని. మధ్యలో ఎక్కడ బ్రేక్‌ అయింది? అసలు ఉందా? 
జగన్‌: అసలు పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తితో.. అక్కడ కూడా పాపం ఆయన మీతో వస్తాడంట అని అడగటం కూడా ధర్మం కాదు పాపం. ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌ నాతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. నేను ఆయనతో మాట్లాడింది లేదు. నేను ఆయన్ను చూసింది లేదు.. ఆయన నన్ను చూసింది లేదు. కాబట్టి అలా అనడం కరెక్టు కాదు.  

ప్రశ్న: పొత్తులు ఈ సారి మీరు వద్దనుకుంటున్నారా? లేకపోతే ఎవ్వరూ రావట్లేదా? 
జగన్‌: పొత్తుల గురించి మేము ఏరోజూ ఆరాట పడలేదు. నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే మనం మన కష్టాన్ని నమ్మాలి. ఎవ్వరి మీదో ఆధారపడకూడదనేది గట్టిగా నమ్ముతా. ఒక మనిషిగా నేను అదే పాలసీ పాటిస్తా. ఎప్పుడే విషయంలోనూ నేను ఎవ్వరిమీద ఆధారపడను. నా బలం మీదనే నేను ఆధారపడతాను. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఓట్లు వేసే వాళ్లు ప్రజలు. ఆశీర్వదించాల్సింది దేవుడు. వీళ్లిద్దరినీ నమ్ముకోవాలి కానీ ఎవ్వరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి.. వాళ్ల భుజాల మీద నేను నడవాలి అన్న ఆలోచన చేయడమే తప్పు అని నేను భావిస్తా. ఈ రోజు నాకు 175 నియోజకవర్గాల్లో ప్రతి చోటా మా పార్టీకి చెందిన అభ్యర్థి ఉన్నాడు. వాళ్లకు అన్యాయం చేసి పొత్తు పెట్టుకొని వేరే పార్టీకి టిక్కెట్లు ఇచ్చి మన జెండాను మోసిన వ్యక్తిని పక్కన పెట్టడం ధర్మం కాదని నేను భావిస్తా. కాబట్టి నేను ఎప్పుడూ ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకున్నా కాబట్టి పొత్తు గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఏ రోజూ రాలేదు.  

ప్రశ్న: మీరు అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద ఏం చేస్తారు? 
జగన్‌: చంద్రబాబు ప్రజలకు మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేరుస్తామన్నారు. రుణాలు మాఫీ, ఇంటింటికి ఉద్యోగాలని, రెండు వేలు నిరుద్యోగ భృతి అని, బ్యాంకులో పెట్టిన బంగారం తీసుకొచ్చి ఇస్తానని అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన వ్యక్తి. అంతే కాకుండా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి పాలనపై ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి వ్యక్తికి తోడుగా ఎవరు వచ్చినా, ఎంత పెద్ద కూటమి ఏర్పాటైనా రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు, కూటమికి గట్టిగా బుద్ధి చెబుతారు.  

ప్రశ్న: అవినీతిపై మీరు వేసిన పుస్తకంలో ఉన్నవి నిజమని నమ్ముతున్నారు కాబట్టి మీరు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు? 
జగన్‌: పుస్తకంలో ఉన్న ప్రతి అంశం మీద వివరంగా విచారణ చేయిస్తా. మొదట క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వస్తుంది. కోర్టుకు తీసుకుపోయి శిక్ష వేయించగలిగే ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఇవన్నీ కోర్టుకు తీసుకుపోతాము. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏజెన్సీలు బాగా ఉన్నాయి. నాకూ సీఐడీ ఉంది అంటూ అనర్గళమైన మాటలు చంద్రబాబు మాట్లాడారు. ఆ ఏజెన్సీలన్నీ యాక్టివేట్‌ అయి ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలు పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టు బోన్‌లో నిలబెట్టే కార్యక్రమం కచ్చితంగా చేస్తాం.  

ప్రశ్న: మీ మీద కత్తి దాడి జరిగింది, బాధితుడు మీరు.. ప్రత్యక్షి సాక్షి మీరు. మీరు విచారణకు ఎందుకు సహకరించడం లేదు? 
జగన్‌: దేశంలో అత్యంత సురక్షితంగా ఉన్న స్థలం ఏదని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఉజ్జాయింపుగా కొన్ని పేర్లు చెబుతారు. అటువంటి పేర్లలో ఎయిర్‌పోర్టులో వీఐపీ లాంజ్‌ కూడా ఉంటుంది. అత్యంత సురక్షిత స్థలం అని మనం అనుకునే ఏరియా అది. అటువంటి సురక్షిత ప్రాంతంలోని వీఐపీ లాంజ్‌లోకి కత్తి ఎలా వచ్చింది? ఇది ప్రాథమికమైన ప్రశ్న. ఆ కత్తి ఎలా వచ్చిందంటే, హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్‌ కోసం రేసులో ఉన్న వ్యక్తి. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు. ఆ ఎమ్మెల్యే గత చరిత్ర ఎలా ఉందంటే, వంగవీటి రంగా గారి హత్య కేసులో అతను నిందితుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన విజయవాడ వదిలిపెట్టి విశాఖపట్నం వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి చరిత్ర ఉన్న వ్యక్తికి ఈయన (హర్షవర్దన్‌) అత్యంత సన్నిహితుడు. హర్షవర్ధన్‌ చౌదరి... చంద్రబాబు, లోకేశ్‌తోనూ అత్యంత సన్నిహితంగా ఉన్నాడు.

రెస్టారెంట్‌ ఆయనది కాబట్టి, ఈ మనిషి (హత్యాయత్నం చేసిన వ్యక్తి) అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి ఆ కత్తి వీఐపీ లాంజ్‌లోకి రాగలిగింది. అక్కడ పని చేస్తున్న ఈ వ్యక్తి, హత్యాయత్నం చేసిన ఈ వ్యక్తిపై ఇదివరకే హత్యాయత్నం చేసిన ఆరోపణ ఒకటి ఉంది. అటువంటి వ్యక్తికి పోలీసులు ఎన్‌ఓసీ (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) ఎలా ఇచ్చారు? ఎన్‌ఓసీ ఉంటేనే ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌గానీ ఇంకెవరైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలి. నేను విశాఖపట్నంలోకి ప్రవేశించింది ఆగస్టు 14న. ఐదు నెలల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తిరుగుతున్నా. హత్యాయత్నం మధ్యలో మూడు నెలల తర్వాత జరిగింది. నేను విశాఖపట్నంలోకి ప్రవేశించడంతోనే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పని చేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత నామీద హత్యాయత్నం జరిగేదాకా అవి పని చేయలేదు. నేను విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాతే అవి పని చేయకుండా పోయాయి. హైకోర్టులో జడ్జి కూడా ఈ ప్రస్తావన చేశారు.

ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో హత్యాయత్నం జరిగితే ఒక గంట లోపే డీజీపీ, మంత్రులు, చంద్రబాబునాయుడు ముందుకు వచ్చి కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చారు. ఒక మార్ఫ్‌డ్‌ ఫ్లెక్సీని విడుదల చేశారు. ఫ్లెక్సీ వేసే అభిమాని ఎవరైనా గరుడ పక్షి ఫొటో పెడతారా? నువ్వే చెప్పు.. పెడితే మా అమ్మ ఫొటో లేకపోతే మా నాన్న రాజశేఖరరెడ్డి ఫొటో పెడతారు. ఇంకా ఎక్కువ అభిమానస్తుడైతే నా చెల్లెలు ఫొటో కూడా పెడతారు. అంతేగాని గరుడ పక్షి ఫొటో ఎవరు పెడతారు? వైసీపీ ప్లెక్సీ బ్లూ కలర్‌లో ఉంటుంది. సాధారణంగా పసుపు కలర్‌లో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బ్లూ కలర్‌లో వైసీపీ ఫ్లెక్సీలుంటాయి. ఈ ఫ్లెక్సీ పసుపు కలర్‌లో ఉంది. గంటలో మార్ఫ్‌డ్‌ ఫ్లెక్సీని విడుదల చేశారు. చేసిన తర్వాత ఈ మనిషి (హత్యాయత్నం చేసిన వ్యక్తి) నా అభిమాని అని తప్పుడు ప్రచారం చేశారు. నేను నిన్నే అడుగుతున్నా.. నిన్ను ప్రేమించేవాళ్లు ఎవరైనా నిన్ను చంపాలని ప్రయత్నిస్తారా? నన్ను ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాడంటూనే చంపడానికి ప్రయత్నించాడని వాళ్లే మళ్లీ అంటారు. 

ప్రశ్న: అందుకే మీరు మాట్లాడలేదా? 
జగన్‌: కాదు. ఘటన జరిగిన వెంటనే నేను జెంటిల్‌మెన్‌గా వ్యవహరించా. ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారో సడన్‌గా తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో నా నోటి నుంచి ఆవేశపూరితమైన ప్రకటనలు (వైల్డ్‌ స్టేట్‌మెంట్స్‌)  వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం, ఫలానా వాళ్లు చేయించారని తెలిసీ తెలియని మాటలు మాట్లాడితే దాని పర్యవసానంతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. అది తెలిసి జెంటిల్‌మెన్‌గా వ్యవహరించా. హత్యాయత్నం జరిగిన తర్వాత చొక్కా మార్చుకున్నా. హత్యాయత్నం జరిగిన చోట నేను ఒక్కడినే కాదు.. 30 మంది ఉన్నారక్కడ వీఐపీ లాంజ్‌లో. సీఎస్‌ఐ సిబ్బంది, ఇండిగో సిబ్బంది, ఇతర వీఐపీలు కూర్చున్నారు. వారి ముందు ఘటన జరిగింది. ఘటన జరిగాక రక్తం కారుతుంటే చొక్కా విప్పి ప్రాథమిక చికిత్స చేసిన వాళ్లే ఎయిర్‌పోర్టులో కట్టుకట్టారు. మళ్లీ ఇంకో చొక్కా వేసుకుని హైదరాబాద్‌కు వచ్చి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చి రెండు వారాలు విశ్రాంతిలో ఉన్నా. విశ్రాంతి పూర్తయిన తర్వాత మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టా. మొదలుపెట్టిన మొదటి మీటింగ్‌లోనే ఇవన్నీ అడిగాను. ఎక్కడా నేను మాట్లాడలేదు.  

ప్రశ్న: మరి విచారణ? 
జగన్‌: నువ్వే చెప్పు రజనీ.. హత్యారోపణ ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసులతో విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా? హత్యాయత్నం చేయించింది రాష్ట్ర ప్రభుత్వమని మేము అనుకుంటున్నాం. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసులతో, డీజీపీ గంటకే తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన పరిస్థితులు చూసిన నేపథ్యంలో, డీజీపీ ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అదే పోలీసులచేత విచారణ జరిగితే న్యాయం జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? కాబట్టి మేము థర్డ్‌ పార్టీ విచారణ అడిగాం. థర్డ్‌ పార్టీ ఎవరని మేం చెప్పలేదు. మీ ఇష్టం.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని థర్డ్‌ పార్టీ ఎవరితోనైనా విచారణ చేయించమని అడిగాం. తప్పేం ఉంది? 

జగన్‌ అనే వ్యక్తి ఫిబ్రవరిలో ఇక్కడే కొత్త ఇంట్లో చేరనున్నాడు
ప్రశ్న: మీరు రాజధానిని మారుస్తారని,లేదంటే కుదిస్తారని, మరేమేమో చేస్తారని ప్రజలకు అనుమానం ఉంది?  
జగన్‌: ఇదే మాట చంద్రబాబునాయుడును ఎందుకు అడగటం లేదు. ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ లేదు. ఏదైనా తాత్కాలికమే. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ తాత్కాలికమే. పర్మనెంట్‌ అనే పేరుతో ఇంతవరకు ఒక్క ఇటుక వేయలేదు. ఎందుకు వేయడం లేదు? ఎందుకు మీరు అడగటం లేదు? ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇల్లు కట్టాడా? హైదరాబాద్‌లో వంద కోట్లపైన ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో వేసిన మార్బుల్‌ గురించి, ఫ్లోరింగ్‌ గురించి కథలు కథలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అడుగుకు వేలల్లో ఖర్చు పెట్టారంట.. ఎందుకు రాజధానిలో ఇల్లు కట్టలేదు? ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. ఇక్కడ ఉండాలనుకుంటే ఇల్లు కట్టాలి. అదే రాజధాని ప్రాంతంలో జగన్‌ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు.. ఫిబ్రవరిలో కొత్త ఇంట్లోకి చేరబోతున్నాడు. ఆఫీసు కడుతున్నాం అక్కడ. ఇన్ని కనిపిస్తున్నా రకరకాలుగా తిమ్మిని బమ్మిని చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఆరోపణ ఏదో రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి రాజధానిలో ఆ స్థాయిలో ఉంది. ఆ అవినీతిపై ఏ స్థాయిలో విచారణ జరుగుతుందో తెలియదు. బహుశా నాస్టేజీ దాటిపోయి, కోర్టు స్టేజీ దాటిపోయి, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి ఏ స్టేజీలోకి పోతుందో నాకు తెలియదు. రాజధాని భూముల్లో జరిగిన అవినీతి మామూలు అవినీతి కాదు. ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకున్న ఈ భూములను ఇష్టం వచ్చిన రేటుకు, ఇష్టం వచ్చిన వ్యక్తికి లంచాలు తీసుకుని ఇచ్చారు. సింగపూర్‌ కంపెనీ అంట.. 16 నుంచి 17 వందల ఎకరాలు ఎందుకిస్తున్నాడండీ? వాళ్లు అక్కడ చేసేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మిడీ మేలు జరగదు. వాళ్లు అక్కడ రియల్‌ ఎస్టేట్‌ చేస్తారంట. ప్లాట్లు వేసి అమ్ముతారంట. వచ్చే లాభాలు తీసుకునేది వాళ్లే. ఇంతటి దారుణంగా స్కాములు జరుగుతుంటే వీటిపై విచారణలు జరగకుండా ఉంటాయా? జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యుడు ఎవరు? చంద్రబాబు కాదా? 

బాబుకు దేవుడు మొట్టికాయలు వేసే రోజొస్తుంది
ప్రశ్న: జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉంటుందా? 
జగన్‌: జైలుకు పోతాడా, పోడా అన్నది ఆధారాలు, సాక్ష్యాలను బట్టి ఉంటుంది. నేను చిన్న ఉదాహరణ చెబుతా. రాజధాని పలానా చోట వస్తుందని చంద్రబాబునాయుడుకు తెలుసు. ప్రజలను మిస్లీడ్‌ చేస్తాడు. నూజివీడు దగ్గర వస్తుంది, ఇంకోచోట వస్తుందని మిస్లీడ్‌ చేశాడు. అధికారం చేపట్టాక డిసెంబరు దాకా ఎక్కడ అనేది చెప్పలేదు. మధ్య ఆరు నెలల కాలంలో ఆయన, ఆయన బినామీలు రాజధాని ఎక్కడ వస్తుందో అక్కడ రైతుల వద్ద నుంచి భూములు కొన్నారు. సాక్షాత్తు హెరిటేజ్‌ అనే ఆయన సొంత సంస్థ పేరిట కూడా 14 ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రాజధాని అక్కడే ఏర్పాటు చేశారు. దీనిని స్టాక్‌ మార్కెట్లో అయితే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇందుకు శిక్ష మూడు నుంచి నాలుగేళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది.  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి రాజ్యాంగ రహస్యాలను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోనని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక్కడ తాను, తన బినామీలు బాగుపడేదాని కోసం రాజ్యాంగ రహస్యాన్ని తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకున్న పరిస్థితి. దీనికి శిక్ష ఏమిటి? ఆధారాలతో సహా ఉన్నాయి. ఇటువంటివి అనేకం అక్కడ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి దేవుడికి కూడా కోపం వస్తుంది. శిశుపాలుడికి కూడా 100 తప్పులు నిండిన తరువాత 101వ తప్పు చేస్తే దేవుడు మొట్టికాయలు వేశాడు. ఈయన చేసిన అన్యాయాలకు, అవినీతికి, అప్రజాస్వామిక పాలనకు కచ్చితంగా ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకసారి దేవుడు మొట్టికాయలు వేసి బుద్దిచెప్పే పరిస్థితి వస్తుంది. 

ప్రశ్న: ఇప్పుడు ఎన్‌ఐఏ వచ్చింది.. సహకరిస్తారా? 
జగన్‌: తప్పకుండా సహకరిస్తాం. మేం సహకరించేది ఏంటి.. వాళ్లు విచారణ చేయాలి. విచారణ తర్వాత దోషులను పట్టించాలి. నేను బాధితుణ్ణి. ఏం జరిగిందనేది వాళ్లు నాకు చెప్పాలి.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 

ప్రశ్న: పాదయాత్రలు చేసిన వాళ్లందరూ సీఎంలయ్యారు.. మీరు కూడా అవుతున్నారా?  
జగన్‌: దేవుని దయ, ప్రజల దీవెనలు.   

Back to Top