ఆకర్షణీయంగా.. విజ‌య 'సంక‌ల్పం'

ఇచ్ఛాపురంలో వేగంగా పైలాన్‌ నిర్మాణ పనులు

చిరస్థాయిగా నిలిచిపోయేలా పైలాన్ నిర్మాణం

పాదయాత్ర ముగింపు రోజు 9న ఆవిష్కరించనున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

దర్శనీయ స్థలంలా తీర్చిదిద్దుతున్న పార్టీ శ్రేణులు

 

శ్రీ‌కాకుళం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న పైలాన్‌ చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. అనితర సాధ్యం.. అనన్య సామాన్యం అన్న రీతిలో ఇప్పటికి 3,593.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన వైయ‌స్‌ జగన్‌.. ఈ నెల 9న తన ప్రజా సంకల్ప యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య ఈ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.  
 
ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం 
వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత.. 2019 జనవరి 9వ తేదీ నాటికి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ‘ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం’ వరకూ నడుస్తూ లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ భవిష్యత్తుపై వారికి భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పైలాన్‌ నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూనుకుంది.   

 ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో.. యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్‌ పనులు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.  16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరో వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించనుంది. ఈ పైలాన్‌లో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఫొటోలు, జగన్‌ పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను నిబీడీకృతం చేయనున్నారు.  
 
13 జిల్లాలకు గుర్తుగా.. 13 మెట్లు 
పైలాన్‌ చుట్టూ చిన్నపాటి లాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాన్‌ నుంచి పైలాన్‌ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందున ఒక్కో జిల్లాకు చిహ్నంగా ఒక్కో మెట్టును ఏర్పాటు చేశారు. ఇక పైభాగాన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు. నిర్మాణం అగ్రభాగాన పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్‌ జగన్‌ నడిచారో తెలియజేస్తూ ఒక మ్యాప్‌ను కూడా ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్నో దర్శనీయ స్థలంగా, ఆకర్షణీయమైనదిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 9న పైలాన్‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రిస్తారు. 

ప్రజాసంకల్పయాత్ర అంకెల్లో:
పాదయాత్ర వివరాలు : ( జవరి 9 వరకూ):
మొత్తం పాదయాత్ర జరిగిన రోజులు : 341
మొత్తం దూరం : 3,648 కిలోమీటర్లు ( కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దూరం)
పాదయాత్ర నియోజకవర్గాలు : 134
పాదయాత్ర సాగిన మొత్తం గ్రామాలు : 2,516
పాదయాత్ర సాగిన మండలాలు: 231
పాదయాత్ర సాగిన మున్సిపాల్టీలు: 54
పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు : 8
బహిరంగ సమావేశాలు : 124
ఆత్మీయ సమ్మేళనాలు  : 55

 

Back to Top