‘సామాజిక న్యాయభేరి’ని విజయవంతం చేయండి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి  

 అమరావతి: జయహో జగనన్న నినాదంతో ఈనెల 26 నుంచి 29 వరకు జరగనున్న వైయ‌స్సార్‌సీపీ బస్సుయాత్ర ‘సామాజిక న్యాయభేరి’ని విజయవంతం చేయాలని వైయ‌స్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నేతల్ని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తమ వర్గాలకు జరిగిన మేలు గురించి స్వయంగా ప్రజలకు వివరించడమే ముఖ్య ఉద్దేశంగా చేపట్టిన బస్సుయాత్రను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నామినేటెడ్‌ పదవులు పొందిన నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు.  

ప్రజలను చైతన్యపరిచేందుకే సామాజిక న్యాయభేరి : మంత్రులు ధర్మాన, బొత్స 

శ్రీకాకుళం : ప్రజలను చైతన్యపరచడమే సామాజిక న్యాయభేరి ఉద్దేశమని రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ యాత్రలో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పెదపాడు క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి ధర్మాన పార్టీ నేతలతో మాట్లాడగా, మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు.

మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఈనెల 26న శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్‌లో బహిరంగం సభ అనంతరం అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 27న విశాఖపట్నం, 28న పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. దేశంలోనే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌లకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, దానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలో తెలియజేస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బడుగు, బలహీనవర్గాల వారున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యాన్ని దాదాపు 50% మంది బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ అప్పగించారని తెలిపారు. రాజ్యసభ సీట్లను తెలంగాణ వారికి ఇవ్వడాన్ని తప్పుగా ప్రసారం చేస్తున్న ఏబీఎన్‌ చానల్‌.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.

రాజ్యసభ సీట్లను ఆ రాష్ట్రవాసులకే ఇవ్వాలనే నిబంధనలు లేవని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ఇప్పటికే ఆయనపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారని, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తప్పుచేసిన వారిపై ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలను ఈ వేసవి సెలవుల్లోనే చేపడతామన్నారు. మంత్రి బొత్స వెంట జెడ్పీ చైర్మన్‌ మజ్జి సీతారాం, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top