పల్నాటి సీమ రూపురేఖ­లు మార్చే దిశగా అడుగులు

వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి  శ్రీకారం
 
నేడు వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్న సీఎం

ప‌ల్నాడు: పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు.

పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవే­రుస్తూ.. ‘వైయ‌స్ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్ట­నున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం వైయ‌స్ జగన్‌ పనులను ప్రారంభించనున్నారు.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే
రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.  

జయహో..జలప్రదాత
జల ప్రదాత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పల్నాడు ప్రజలు జయహో అంటున్నారు. ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే వరికపూడిశెల ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు రోడ్డులోని చెన్నకేశవకాలనీ ఎదురు స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు రెండు దశల్లో పనులు పూర్తయితే మాచర్ల, వినుకొండ, యర్రగొండపాలెం నియోజకవర్గాలలోని 1.25 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరు, లక్షమందికి తాగునీరు అందనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు సీఎం వస్తుండటం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జలప్రదాతకు స్వాగతం పలుకుతూ మాచర్ల పట్టణంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌, వైయ‌స్ఆర్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మాచర్లలో సభకు జరుగుతున్న ఏర్పాట్ల తీరు పర్యవేక్షించారు. సీఎం హెలిప్యాడ్‌, ఆయన పర్యటించే బస్సు, కాన్వాయ్‌ వెళ్లే మార్గాలను కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు పరిశీలించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేస్తున్న వేళ సభను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చే జనాలకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

Back to Top