వంతెనలు వంచనలు...

చంద్రబాబు వంచనలకు కాదేదీ అనర్హం. ఇబ్రహీంపట్నం వద్ద 1387 కోట్లతో ఐకానిక్ వంతనకు శంకుస్థాపన చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచం అంతా ఈ వంతెన చూడటానికి వస్తుందని గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో పాలన పడకేసింది. ముఖ్యమంత్రి సమయం అంతా పునాదిరాళ్లు, శంకుస్థాపనలు, కొత్త కొత్త పేర్లతో జనాలను మోసం చేసే స్టంట్ల గురించి ఆలోచనలకే సరిపోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. 
ఎన్నికలు సమీపంలో ఉండగా ఈ శంకుస్థాపనలన్నీ ఓట్ల కోసం జరిగే స్టంటులే అన్న సంగతి చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ప్రధాని మోదీ డబ్బులివ్వడం లేదు, నా దగ్గర డబ్బులు లేవు ఇదీ చంద్రబాబు ప్రతి శంకుస్థాపనలోనూ చెబుతున్న మాట. కేంద్రం నిధులు ఇవ్వడంలేదు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలూ లేవు. మరి ఈ శంకుస్థాపనలన్నీ ఎందుకు? ఎవరిని మభ్యపెట్టడానికి. వీటన్నిటికీ బాబు దగ్గరున్న సమాధానం ఒకటే. మీరంతా నాకు సహకరించాలి. అంటే మరోసారి బాబు మాయమాటలను ప్రజలు మళ్లీ నమ్మి ఓట్లేయాలి. వేస్తే అప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు అంచనాలు పెంచి సొంత గూటి కంపెనీలకు వాటిని కట్టబెట్టి ముడుపులు మూట కట్టుకుంటారు. మరోసారి భూముల సేకరణ పేరుతో ప్రజల భూములకు పంగనామాలు పెడతారు. మరోసారి స్వాధినం చేసుకున్న భూములను కారుచౌకగా బినామీలకు కట్టబెడతారు. మరోసారి ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి కోటాను కోట్లు అప్పులు చేసి నెత్తిన పెడతారు. ఇందుకే చంద్రబాబు పదే పదే మీరు నాకు సహకరించాలింమీరంతా ఒప్పుకోవాలి అంటూ ప్రజలపై మంత్ర ప్రయోగం చేస్తున్నాడు. 
వంతెన ఎవరికోసం??
విజయవాడ నుంచి అమరావతికి రోడ్డు ద్వారా చూస్తే 42.9 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే సుమారు రెండు గంటలకంటే తక్కువ ప్రయాణ దూరం. పవిత్ర సంగమం నుంచి తాళ్లపాలం, రాయపూడి దాకా పిల్లర్లు వేసి వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టే ఈ వంతెన, తాత్కాలిక భవనాలైనా పూర్తిగా నిర్మాణం కాని రాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు సమయం ఆదా చేస్తుందని శెలవిస్తున్నారు. ఇక ఈ వంతెనవల్ల కలిగే మరో ప్రయోజనం హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ లోని జగదల్ పూర్ కు వెళ్లేందుకు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుందట. నిజానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు పెద్దగా ఉన్నది లేదు. మావోల ప్రభావిత ప్రాంతంగా తప్ప ఏపీ తెలంగాణాలు ఛత్తీస్ ఘడ్ తో వేరే వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నది ఎక్కడ? మరి ఏ ప్రయోజనం కోసం కేవలం 2 గంటల సమయం ఆదా చేసేందుకు అదీ హైదరాబాద్ నుంచి జగదల్ పూర్ కు వెళ్లే సమయం ఆదా చేసేందుకు ఆంధ్రా ముఖ్యమంత్రి ఇంత ఖరీదైన వంతెన నిర్మించాలనుకుంటున్నాడు? విజయవాడ ట్రాఫిక్ భారం తగ్గేందుకు ఈ వంతెన అసలు ఉపయోగపడుతుందా? వీటికి సమాధానాలులేవు. బాబు దృష్టిలో ఇదో పర్యాటక వంతెనలా ఉంది. దీన్ని దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతోంది. కానీ బాబు సారధ్యంలో మూడేళ్లు దాటినా సగం పని కూడా పూర్తికాని కనకదుర్గ వారధి చూస్తేనే ఈ మాటలు ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తాయన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. 
నోట్  నిజానికి 2017జూన్ లో ఎ.డి.సి (అమరావతి డెలవలప్మెంట్ కార్పొరేషన్) టెండర్లు పిలిచినప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టు 800 కోట్లే. 2018 కల్లా దీని అంచానా విలువ పెరిగిపోయి 1300 కోట్లను దాటిపోయింది.  

 

Back to Top