జగనన్న ఆణిముత్యాల‌కు పుర‌స్కారాలు

నేడు నియోజకవర్గ ప్రతిభావంతులకు  సత్కారం

పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 678 మంది

ఇంటర్‌లో మొదటి స్థానాల్లో నిలిచిన 662 మంది

అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సా­ధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిము­త్యా­లు’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ని­యో­జకవర్గస్థాయిలో విద్యార్థులను గురువా­రం సత్కరించేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. 
జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్‌మెంట్లలో  విద్యాసంస్థలున్నాయి. ఒక్కో మేనేజ్‌మెంట్‌ పరిధిలోని సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారు.

ఇంటర్మీడియట్‌లో కూడా వివిధ మేనేజ్‌మెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో  ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులు 662 మంది ఉన్నారు. విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపు­ణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది.

విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్‌ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. నియోజకవర్గస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఇంటర్మీడియట్‌లో గ్రూప్‌ టాపర్‌కు రూ.15 వేలు చొప్పున ఇస్తారు.

20న రాష్ట్రస్థాయిలో..  
రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యాలను ఈ­నెల 20న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించనున్నా­రు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో మొద­టి మూడు­స్థానాల్లో నిలిచిన 42 మందిని, ఇంటర్‌­లో మొదటి స్థానంలో నిలిచిన 28 మందిని ఆయన సన్మానించనున్నారు. పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండోస్థానంలోని వారికి రూ.­75 వేలు, మూడోస్థానంలో నిలిచిన వారి­కి రూ.50 వేలు,  ఇంటర్‌ టాపర్స్‌కు రూ.­లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.   

17న జిల్లాస్థాయిలో..  
జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచిన పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులను ఈ నెల 17న ఆయా జిల్లా కేంద్రాల్లో సన్మానించనున్నారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్‌మెంట్లలోని సంస్థల్లో ఒక్కో మేనేజ్‌మెంట్‌లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులను సన్మానిస్తారు.

ఇంటర్మీడియట్‌లో కూడా వివిధ మేనేజ్‌మెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు.

జిల్లాస్థాయిలో పదో తరగతి విద్యార్థులు 606 మందిని, ఇంటర్‌ టాపర్స్‌ 392 మందిని సత్కరించనున్నా­రు. పదో తరగతిలో జిల్లా టాపర్‌కు రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వే­లు, మూడో బహుమతిగా రూ.15 వేలు నగదు బహుమతి అందిస్తారు. ఇంటర్‌లో ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తారు.

Back to Top