కర్నూలు: ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా కర్నూలులో తొలి హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్ వపర్‌ను పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అని కూడా అంటారు. హైడల్ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది. అయితే, కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్ వాడకానికి డిమాండ్ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్ చేస్తారు. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్ స్టోరేజ్ పవర్ లేదా హైడల్ పవర్ అంటారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. రూ.15వేల కోట్ల ప్రాజెక్టుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారవుతోంది. 15 మిలియన్ టన్నుల CO2 తగ్గుతుందని కంపెనీ అంచనా ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్ డయా క్సైడ్ 15 మిలియన్ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్ కార్ల బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్ డయాౖక్సైడ్ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. రూ.15వేల కోట్ల పెట్టుబడి.. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు. ఇక్కడ విద్యుదుత్పత్తి ప్రారంభమైతే విద్యుత్ కష్టాలు కొంతవరకు తీరుతాయి.