టీడీపీ చివరి సభలో...

ఈనెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం  

అధికార పక్ష అహంకార వైఖరికి స్పీకర్ కూడా కళ్లెం వేయని వైనం

23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని నలుగురికి మంత్రి పదవులు

ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై వేటు వేయని స్పీకర్

ప్రజాస్వామ్యాన్న వెక్కిరించే ఇలాంటి సభకు ప్రతిపక్షం దూరం

ప్రజల మధ్యే సుదీర్ఘ కాలం ఉంటున్నప్రతిపక్ష నేత వైయస్ జగన్

2019 లో ఈనెల 30వ తేదీ నుండి ప్రారంభం  కానున్న అసెంబ్లీ సమావేశాలు టీడీపీ పరిపాలనాకాలానికి ఆఖరి సమావేశాలు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సమావేశాల్లో బడ్జెట్ ఎలా ఉండబోతోందో సులభంగా అంచనా వేయొచ్చు. చంద్రబాబు గత కొద్దిరోజులగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీలను కాపీ చేస్తూ ఇస్తున్న హామీలకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండబోతోంది. ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లకు అందించే నిధులపై భారీ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటనలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
ప్రతిపక్షం పై విమర్శలు
కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న టీడీపీ శ్రేణులు మరోసారి సభలో తమ బురదజల్లుడు కార్యక్రమంతో కార్యక్రమాలు ప్రారంభిస్తాయి. అయితే పాలకులు ఎంతగా తిమ్మిని బమ్మిని చేయాలని చూసినా గత 3సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలను చూసిన ప్రజలకు ప్రతిపక్షం నిర్ణయం సరైనదే అన్న అవగాహన ఉంది. కనుకనే ఏడాది కాలంగా ప్రజల్లో ఉన్న జగన్ కు అంతటి ఆదరణ లభించింది. శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు, ప్రజాసంక్షేమంపై బిల్లులు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. చట్టసభలా హుందాగా ఉండాల్సిన అసెంబ్లీలో రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతుంటాయి. అధికార పక్ష అహంకార వైఖరికి కనీసం స్పీకర్ కూడా కళ్లెం వేయని నికృష్టపు పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ప్రశ్నించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశమే లేకుండా చేసే సభలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయకుండా, వారి గొంతు వినిపించే అవకాశం ఇవ్వకుండా అవమానించే నీచ సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వానిది. ఇందుకు ఆ టీడీపీ వ్యవస్థాపకులైన స్వర్గీయ ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు. ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నే గద్దె దింపి, సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని అన్యాయపు చరిత్ర ఈ పార్టీకి ఉంది. ప్రతిపక్షం ఉనికే లేకుండా చేస్తూ తిరిగి అదే ప్రతిపక్షం సభకి రావడం లేదంటూ విమర్శలు చేసే కుసంస్కారానికి ప్రజల నుంచి తీవ్రత వ్యతిరేక ఎదురౌతోంది. 
ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించి..
ప్రభుత్వం ప్రతిపక్షం అనే రెండు వర్గాలూ సభలో సమతుల్యతకు ప్రయత్నం చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, పదవుల ఆశచూపి ఫిరాయింపులకు ప్రోత్సహించిన ప్రభుత్వానికి శాసన సభపై కనీస మర్యాద ఉన్నట్టా? 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చి సభలో కూర్చోబెట్టుకుంటున్న టీడీపీకి నైతికత అనే పదానికి అర్థం తెలుసా? ఒక పార్టీ జెండాపై గెలిచి మరోపార్టీలోకి మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోడు. ఏ పార్టీ గుర్తుతో గెలిచారో ఆ పార్టీకీ, పదవికీ రాజీనామా చేయమని చంద్రబాబు కోరడు. ప్రజాస్వామ్యాన్న వెక్కిరించే, ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించే ఇలాంటి సభలో ప్రజాపక్షంగా ప్రతిపక్షం పనిచేయగలదా?? అందుకే వైఎస్ జగన్ తన పయనం ప్రజలవైపు సాగించారు. తన గొంతును వారిముందే వినిపించారు. 
ప్రభుత్వం ఇచ్చే టిఎ డిఎలు తీసుకుంటూ సభకు రాకపోవడం నైతికత కాదంటూ వాఖ్యానించారు స్పీకర్ కోడెల. ప్రజలు పార్టీని నమ్మి వేసిన ఓట్లను తీసుకుని ఫిరాయింపులకు పాల్పడ్డ వారిది ఏ పాటి నైతికతో, వారిపై వేటు వేయని స్పీకర్, మంత్రి పదవులిచ్చి పక్కన కూర్చోబెట్టుకునే ముఖ్యమంత్రిది ఎలాంటి నైతికతో ప్రజలకు వివరించాలి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా ప్రజలకు జవాబుదారీ. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయడంలేదు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్  చేస్తోంది. తాయిలాలతో రాష్ట్ర ప్రజల తలరాతలు మరోసారి తలకిందులు చేసేయాలనే టిడిపి ఆలోచనలేమిటో ఈ చివరి అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే ప్రజలకు అర్థం కావడం తథ్యం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top