ఏ సీటులో ఎవరైనా??

బాబు సీటులో బాలయ్య

స్పీకర్ సీటులో మరొకరు

అధికార పక్షం సీట్లలో ప్రతిపక్ష నేతలు
 

బుక్ చేసుకున్న సినిమా సీటులోనే ఎవరైనా కూర్చుంటే లేవమంటాం. ప్రయాణంలో రిజర్వ్ చేసుకున్న సీటు మరొకరు ఆక్రమిస్తే కోపగిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి , శాసనసభకు వెన్నెముకలాంటి స్పీకర్ కు మాత్రం తమ సీటు విషయంలో పెద్ద పట్టింపేం లేదు. అవసరార్థం ఎవ్వరైనా అక్కడ కూర్చోవచ్చు. దానికెలాంటి అభ్యంతరం ఉండదు అన్నట్టే ఉంటారు. స్పీకర్ కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీలకు టీడీపీ పాలనలో బొత్తిగా విలువలేదని తేటతెల్లం అవుతోంది.
బాబు సీటులో బాలయ్య
కొద్ది నెలల క్రితం హిందూపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయానా వియ్యంకుడైన బాలకృష్ణ కూడా సీఎమ్ ఛైర్ లో కూర్చుని కార్యకలాపాలు సాగించారు. లేపాక్షీ ఉత్సవాల గురించి సమీక్షించేందుకు బాలకృష్ణ ముఖ్యమంత్రి ఛాంబర్ నే కాదు, సీఎం కుర్చీని కూడా వాడుకున్నారు. ఈ విషయంపై పెద్ద దుమారం రేగడంతో ఆ సీటు సీఎం కూర్చునేది కాదని, బాలయ్యకోసం వేరే కుర్చీ వేసామని ఆఫీసు వర్గాలు కప్పిపుచ్చుకునే కాకమ్మ కబుర్లేవో చెప్పాయి. అయినా కుర్చీలు లాగేసుకోవడం, ముఖ్యమంత్రి పీఠంతో రఫ్పాడేసుకోవడం టీడీపీ చరిత్రలో జీర్ణించుకున్న విషయమే కదా! ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ప్రతిసారీ ఎవరో ఒకరు ఆయన పీఠానికి ఎసరు పెడుతూనే ఉన్నారు. చివరకు చంద్రబాబు మాత్రం లాక్కున్న కుర్చీని గట్టిగా పట్టుకుని, తాను ఎన్టీఆర్ కు చేసినట్టు తనకెవరూ ద్రోహం చేయకుండా జాగ్రత్తలు పడ్డాడు. ఆ విధంగా నిత్యం సీటు మీద ప్రీతితో, అధికారం పోతుందనే భీతితో, ఎవ్వరినీ నమ్మకుండా కాలం గుడపుతున్నాడు. 
అధికార పక్షం సీట్లలో ప్రతిపక్ష నేతలు
23 మంది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డగోలుగా, సంతలో పసువుల్లా కొన్న చంద్రబాబు వారిని రాజీనామాలు ఇవ్వమని కోరలేదు. స్పీకర్ వారిపై వేటు వేయలేదు. ప్రతిపక్ష సీట్లనుంచి లేచివెళ్లి నిస్సిగ్గుగా పాలకపక్షం వైపు సీట్లలో కూర్చున్న వారిలో కించిత్ కూడా నైతికత లేదు. టీడీపీలోని ఇతర నాయకులైనా సిగ్గుంటే ప్రతిపక్ష పార్టీ గుర్తుపై గెలిచి మా వైపు ఎలా కూర్చున్నారని అడగలేని దుస్థితిలో ఉన్నారు. 
స్పీకర్ సీటులో మరొకరు
తాజాగా స్పీకర్ సీటులో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వచ్చి కూర్చున్నాడు. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ కోడెల రెస్టురూమ్ కి వెళ్లగా ఆ స్థానంలో ఎమ్మెల్యే ఆదిత్య కూర్చుని సభను నడిపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల చొక్కా ధరించి వచ్చిన ఎమ్మెల్యే స్సీకర్ పీఠంపై కూర్చోవడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులెన్నో జరుగుతాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి? 
మొత్తంగా తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు కానీ, ఆ పార్టీలోని ఇతర నాయకులకు కానీ సీటు దాని విలువ అనే వాటికి అర్థం తెలియదు. అవసరం కోసం తమ అవకాశవాదాన్ని ప్రదర్శించడమే తప్ప ఒక స్థానానికి మర్యాద, ప్రవర్తనకు క్రమశిక్షణ ఉండాలని తెలియదు.  ఏసీటులో ఎవరైనా అన్న తీరు ఆదినుంచీ అలావాటున్న టీడీపీని చూసి ప్రజలు  నేటికీ ఛీ కొడుతున్నారు. 

 

Back to Top