అదిగ‌దిగో ..జ‌గ‌న్నాథ ర‌థ‌ చ‌క్రాలు

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అన్ని జిల్లాల్లో డోర్ డెలివ‌రీ వాహ‌నాల ప్రారంభోత్స‌వాలు

గ్రామాల‌కు ప‌రుగులు తీస్తున్న కొత్త వాహ‌నాలు

రోడ్ల‌పై బారులు తీరి జేజేలు ప‌లుకుతున్న జ‌నం

అమరావతి: పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు.  రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం వైయ‌స్ జగన్‌ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు.

ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను గురువారం విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు విజయవాడ బెంజ్‌ సర్కిల్ నుంచి ఆయా జిల్లాల‌కు ప‌రుగులు తీయ‌డం క‌నుల విందుగా ఉంది. అదిగ‌దిగో..జ‌గ‌న్నాథ‌ర‌థ‌చ‌క్రాలు అంటూ రోడ్డు వెంట జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు.  అన్ని జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. 

ప‌ల్లెల‌కు ప‌రుగులు తీస్తున్న 9,260 కొత్త వాహ‌నాలు..

 రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9,260 వాహనాలు ప్రారంభించ‌డంతో ప‌ల్లెల‌ల‌కు కొత్త వాహ‌నాలు ప‌రుగులు తీస్తున్నాయి.  లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్‌ వీఆర్‌వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం..
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్‌ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్‌ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. 
బుధవారం రాత్రి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద బారులు తీరిన రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు 

22, 23న వాహనదారులకు శిక్షణ
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్‌ ఆపరేటర్‌ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని రేషన్‌ డీలర్‌ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని తిరిగి డీలర్‌కు అప్పగించాలి. ఆపరేటర్‌ రోజూ ఈ–పాస్‌ మిషన్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్‌ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్‌ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్‌ వీఆర్‌వోలు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్‌ పరిధిలోని రేషన్‌ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి.

నిరుద్యోగ యువతకు ఉపాధి..
బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్‌ వాహనాలను రివర్స్‌ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది.

ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు?
ఎస్టీ కార్పొరేషన్‌  ద్వారా 700
ఎస్సీ కార్పొరేషన్‌  ద్వారా 2,300
బీసీ కార్పొరేషన్‌  ద్వారా 3,800
మైనారిటీస్‌ కార్పొరేషన్‌  ద్వారా 660
ఈబీ కార్పొరేషన్‌  ద్వారా 1,800

మొబైల్‌ వాహనంలో వసతులు ఇలా
మొబైల్‌ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్‌ స్కేల్‌), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్‌ యంత్రాల ఛార్జింగ్‌ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్‌ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. 

రేషన్‌ సరఫరాలో పాత విధానం ఇదీ
– రేషన్‌ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు.
– సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి.

రేషన్‌ సరుకుల్లో కొత్త విధానం ఇలా...
– కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్‌ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్‌ తూకంతో పంపిణీ చేస్తారు.
– వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు.
– కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్‌ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్‌ కోడ్‌ వల్ల ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ జరుగుతుంది. అన్ని మొబైల్‌ వాహనాలకు జీపీఎస్‌ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్‌ ఆడిట్‌ ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు.

సచివాలయాల ద్వారా బియ్యం కార్డుల సేవల వివరాలు (2020 జూన్‌ నుంచి ఇప్పటివరకు)
కొత్త బియ్యం కార్డులు 4,93, 422
కొత్త బియ్యం కార్డులలో సభ్యులను చేర్చడం  17,07,928
కొత్త బియ్యం కార్డులను విభజించడం 4,38,013
మొత్తం సేవలు  26,39,363

Back to Top