అమరావతి: పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రం అంతటా ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కొనుగోలు చేసిన 9,260 మొబైల్ వాహనాలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 21న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం సవివరంగా ఎస్‌ఈసీకి తిరుగు సమాధానం ఇచ్చింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఈ దేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో వివరించింది. వాస్తవంగా ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతోందని, ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు వీలుగా అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయమై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నేటి నుంచి ఇంటింటికీ రేషన్ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.