ప్రజలిచ్చే శ్వేత పత్రం

మొన్న తెలంగాణాకొచ్చి పోటీచేసినందుకు చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కేసీఆర్. అది మన సాంప్రదాయ కదా అని కూడా పద్ధతులు గుర్తు చేసాడు. మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రే మన ముఖ్యమంత్రికి అన్ని అతిథి మర్యాదలు, గౌరవ సత్కారాలు చేస్తూ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నప్పుడు స్వరాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఏపీ ప్రజలు ఇంకెంత చేయాలి చెప్పండి?? ఆయన శ్వేత పత్రాలంటూ కొన్ని ఎల్లో పేపర్లు మనకు ఇచ్చినప్పుడు అవి పుచ్చుకున్నాం కదా. మరి అందుకు బదులుగా తెలుగు ప్రజలు కూడా బాబుగారికి ఏదో ఒక పత్రం ఇచ్చుకోవాలి కదా! నాలుగేళ్లకు పైగా బోలెడు వినతి పత్రాలు ఇస్తున్నాం కదా...అవి బుట్టదాఖలౌతున్నాయి కదా అంటారా?? అదంతా అప్పుడు...స్థాన బలిమిలాగా...ఎన్నికల సమయ బలిమి అనేదొకటి ఉంటుంది. దాన్ని తెలుసకోవాల్సిన, తెలుకుని వాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు అపర భగీరథుడు, ఆశ్రితపక్షపాతి, అడిగిందే తడవుగా వరాలు కురిపించే కామధేనువు. అన్నిటికీ అవుననే ఆపద్భాంధవుడు. మీరు మీ ఇంటిముందో విమానాశ్రయం కోరండి- పునాది రాయివేసి తధాస్తు అంటాడు. మీ సందు చివర ఓ చెక్క ఫ్యాక్టరీ అనండి శంకుస్థాపన చేసి ఆశీర్వదిస్తాడు. మరి ఇన్ని చేసిన బాబు రుణం తీర్చుకునేలా, ఆయన కోరినట్టు ఆయన పనులకు కూలీ ఇచ్చేలా ఏపీ ప్రజలు కూడా ఏదో ఒకటి చేయాలి గదా!

ఇంతకీ ఇన్నేళ్లుగా బాబు బద్దల కొట్టిన బ్రహ్మాండాలు, చేసేసిన రాచకార్యాల గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎంతకీ పూర్తి కాని సర్వేలు, ప్రభుత్వానికి 'కమ్మ'గా తప్ప వాస్తవాలను నిక్కచ్చిగా చెప్పని కమిటీలు, వాతావరణ ఉష్ణోగ్రతలు పెంచి తగ్గించడం కోసం సాగిన ఉన్నతాధికారుల సమీక్షలు, బాహుబలి సెట్టింగులకే ఇన్సిపిరేషన్ లా ఉండే గ్రాఫిక్కులు, పైసా కూడా పెట్టుబడులు పట్టుకురాని పరమ విలాసవంతమైన విదేశీ పర్యటనలు, మొదలెప్పుడౌతాయో తెలియని శంకుస్థాపనలైన ప్రాజెక్టులు, పూర్తి ఎప్పుడౌతాయో చెప్పలేని నడుస్తున్న ప్రాజెక్టులు, మూలన పడ్డ హామీలు, మూతబడ్డ పథకాలు ఇదండీ నలభై ఏళ్ల బాబు గారి అనుభవం నాలుగున్నరేళ్లలో చేసిన పాలన.  ఈ మహోన్నత పాలన గురించే బాబుగారు వారు చేసినవో, చేయనివో, చేయాలనుకున్నవో, చేసానని చెప్పి నమ్మిస్తున్నవో శ్వేతపత్రాలుగా మనకందించారు. ఇచ్చుకున్నది పుచ్చుకున్నప్పుడు పుచ్చుకున్నవాళ్లుగూడా ఇచ్చుకోవాలి గదా! కనుక తెలుగు ప్రజలు కూడా బాబుగారి పాలనపై తమ శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారు. ఆ శ్వేత పత్రాల్లో ఏమున్నా ఈ శ్వేత పత్రాల్లో మాత్రం బాబుగారి భవిష్యత్తు ఉంది. తెల్ల కాగితాలపై అభివృద్ధి అంకెలనే శ్వేత పత్రాలుగా ప్రకటించిన బాబుకు ప్రజలు కూడా తిరిగి తెల్లకాగితమే ఇవ్వబోతున్నారు. పని చేయని సీఎమ్ కి ప్రజలిచ్చే కూలీ ప్రతికూలంగానే ఉంటుంది. ప్రజలిచ్చే శ్వేత పత్రానికి బాబు ముఖం తెల్లబోతుంది.

Back to Top