నెరవేరిన వైయస్‌ఆర్‌ ఆశయం

పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల

13 ఏళ్ల తరువాత కళ సాకారం

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌ 

 

కర్నూలు:  పోతిరెడ్డిపాడు విస్తరణ చేపట్టాలని, తద్వారా రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని, 44 వేల క్యూసెక్కుల నీటిని అక్కడి నుంచి తీసుకొస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆలోచించారు దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన అకాల మరణంతో విస్తరణ పనులు కుంటుపడ్డాయి. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవరూ ఇలాంటి ఆలోచన చేయలేదు.   వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం పూర్తైన ప్రాజెక్టులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. అయితే దేవుడు కరుణించాడు. మహానేత ఆశయం నెరవేర్చాడు. 13 ఏళ్ల నాటి కల సాకారం అయ్యింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలశయానికి చేరుకోవడంతో ఈ నెల 6వ తేదీ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి దిగువకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి అధికం కావడంతో నీటి విడుదలను 2 వేల క్యుసెక్కుల నుంచి ప్రస్తుతం 44 వేల క్యూసెక్కులకు పెంచారు.  ఇదంతా కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లోనే సాధ్యమైంది. దీంతో అందరూ కూడా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు ఎంత కరెక్టుగా స్క్ట్రీప్‌ రాశారని చర్చించుకుంటున్నారు. 

గత ప్రభుత్వంలో నత్తనడకన విస్తరణ పనులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా.. తప్పుడు హామీలతో రైతులను మభ్యపెట్టేందుకు యత్నించారే తప్ప, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేయలేకపోయారు. 2015 నాటికి 44 వేల క్యూసెక్కుల నీటిని ఇస్తామన్న టీడీపీ నేతల హామీ నీటి మూటలైంది. పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటరు నిర్మాణం పనులు 2006 డిసెంబర్‌లో రూ.201.347కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యాయి.   ఎమిదేళ్ల క్రితం 85 శాతం పనులు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 15 శాతం పనులను పూర్తిచేయించటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు పనుల నిర్మాణం సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో   డిజైన్‌లో లోపం ఉన్నట్లు ఈఎన్‌సీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నాసిరకంగా పనులు చేయటం వల్ల నూతన హెడ్‌రెగ్యులేటరు అప్‌స్టీం సేఫ్టీవాల్‌గోడలు పగుళ్లు ఇచ్చాయి. ఎస్సారెమ్సీని బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాల్వలోని పూడికను తొలగించాల్సి ఉంది. 0 నుంచి 9కిలోమీటర్ల మేర ఎస్సారెమ్సీ ఎడమగట్టును పటిష్టంచేసి స్టాండర్డు బ్యాంకును నిర్మించాల్సి ఉంది. కుడిగట్టు వెంట 16.325 కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించాల్సి ఉంది.

కాల్వ వెంట వంతెనల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల నివాస గృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాల్సి ఉండగా.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తికావొస్తున్నా నేటికీ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరింటికి ఉన్న రబ్బర్‌షీల్స్‌ ఊడిపోవటంతో ప్రారంభానికి ముందే లీకేజీ అవుతున్నాయి. అలాగే 3వ గేటు సక్రమంగా పనిచేయట్లేదు. పాత హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న నాలుగు గేట్లలో కేవలం 2, 3  మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒకటోగేటు స్టాండ్‌భైగా ఉండగా 4వగేటు సక్రమంగా పనిచేయట్లేదు.పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసే 44వేల క్యూసెక్కుల నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ, కేసీ ఎస్కేప్‌ కాల్వలు 11వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీకి 22వేల క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువ నుంచి నీరు భారీగా రావడంతో ఎట్టకేలకు అధికారులు దిగువకు 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా జలాలు రాయలసీమ ప్రాంతంతో పాటు తమిళనాడుకు తరలించే వీలు కలిగింది.  ఈ పరిణామాలతో ఆయకట్టు రైతులు,  వైయస్‌ఆర్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 

Back to Top